Begin typing your search above and press return to search.

ఆ ఇద్దరు అధినేతల్నినిలువునా ముంచేసిన ‘మూడు’

By:  Tupaki Desk   |   23 Nov 2021 4:09 AM GMT
ఆ ఇద్దరు అధినేతల్నినిలువునా ముంచేసిన ‘మూడు’
X
చేతిలో అధికారం ఉంటే సరిపోదు.. దానికి మించిన ప్రజాదరణ చాలా ముఖ్యం. అధికారంలోకి వచ్చేందుకు పడిన కష్టం.. మిగిలిన వారి కంటే రెట్టింపు అయినప్పటికీ.. పవర్లోకి వచ్చిన తర్వాత తిరుగులేని అధినేతలుగా మారటం అంత తేలికైన విషయం కాదు. అన్నింటికి మించి ప్రజాదరణ విషయంలో ప్రత్యర్థులు దగ్గరకు కూడా రాలేని చందంగా ఇమేజ్ ను సొంతం చేసుకోవటం మామూలు విషయం కాదు.

వీటన్నింటిని సొంతం చేసుకున్నారు ఇద్దరు ప్రముఖులు. వారిలో ఒకరు దేశ ప్రధాని నరేంద్ర మోడీ అయితే.. మరొకరు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఒకరు రాజకీయాల్లో తలపండిన సీనియర్ పొలిటీషియన్ అయితే.. మరొకరు వయసు తక్కువ.. అనుభవం కూడా తక్కువే. కానీ.. తలపండిన రాజకీయ నేతలకు సైతం తలంటు పోసేలా.. వరుస నిర్ణయాలతో వారిని ఉక్కిరిబిక్కిరి చేయటంలో మాత్రం తిరుగులేని సత్తా ఇద్దరిదని చెప్పాలి.

ఇలాంటి ఈ ఇద్దరు అధినేతలకు కొద్దిరోజుల తేడాతో కొత్త కష్టం వచ్చింది. ఎవరెన్ని చెప్పినా వినకుండా.. తాము అనుకున్నది అనుకున్నట్లుగా జరగాలన్న మొండితనంతో సొంతం తీసుకొచ్చిన చట్టాల్ని.. తమకు తామే వెనక్కి తీసుకునే అరుదైన తీరు వారికి మాత్రమే సాధ్యమని చెప్పాలి.

కేంద్రంలోని మోడీ సర్కారు తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఎంతటి ప్రజాఉద్యమం జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతికూలతల్ని భరిస్తూ.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు వెనకడుగు వేయమని.. విశ్రమించమన్నట్లుగా వ్యవహరించిన ఉద్యమకారుల పట్టుదలకు లొంగక తప్పని పరిస్థితైంది.

మోడీ.. జగన్ లు తాము తీసుకొచ్చిన చట్టాల్ని తాము వెనక్కి తీసుకుంటున్నట్లుగా ప్రకటించటం.. ఇదంతా రోజుల తేడాతో చోటు చేసుకోవటం.. ఈరెండు ఉదంతాల్లో ‘మూడు’ కీలకభూమిక పోషించటం ఆసక్తికర అంశంగా చెప్పాలి. మోడీ చెప్పిన వ్యవసాయ చట్టాలు.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన మూడు రాష్ట్రాల ఎపిసోడ్ లో.. కామన్ గా కనిపించేది మాత్రం ‘మూడే’ అని చెప్పాలి.

ఈ మూడు చట్టాలకు సంబంధించి మోడీ.. జగన్ లు ఒకేలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవటమే కాదు.. వాటిని కంట్రోల్ చేసేందుకు అనుసరించిన విధానాలు దాదాపుగా ఒక్కటేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తంగా తాము నమ్ముకున్న ‘మూడు’తో ఏదో చేయాలనుకున్న ఇద్దరికి.. మూడుతో మూడినట్లుగా మారటం కాలమహిమ కాకుంటే మరేంటి? ఈ దెబ్బతో ‘మూడు’ అంకెతో ఈ ఇద్దరు అధినేతలు మరింత జాగ్రత్తగా ఉండటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.