Begin typing your search above and press return to search.

ఇక అది మో‘డీఎంకే’?

By:  Tupaki Desk   |   8 Nov 2017 4:30 AM GMT
ఇక అది మో‘డీఎంకే’?
X
తమిళ రాజకీయాలపై కన్నేసిన బీజేపీ ఇప్పటివరకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అక్కడ కీ ప్లేయర్ కాలేకపోయింది. అన్నా డీఎంకేతో ఒకప్పుడు సంబంధాలు బాగానే ఉన్నప్పటికీ జయలలిత హయాంలో అక్కడ వారికి ఏమాత్రం అవకాశం రాలేదు. జయ మరణం తరువాత రకరకాల ఎత్తులు వేసినా శశికళను కటకటాల్లోకి పంపగలిగారే కానీ రాజకీయంగా మాత్రం తాము బలపడలేకపోయారు. జయ మరణానంతర రాజకీయాల్లో తాము చెప్పినట్టల్లా ఆడిన పన్నీర్ సెల్వం కూడా ఆ తరువాత తమ చేయి దాటిపోవడంతో బీజేపీ ఇప్పుడు గేమ్ ప్లాన్ మార్చింది. అక్కడి విపక్ష డీఎంకేతో జతకట్టడానికి రెడీ అయింది. కాంగ్రెస్ తో అంటకాగే డీఎంకే కూడా ఇప్పుడు మోడీ సరసన చేరడానికి సిద్ధమవుతున్నట్లుగా స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి.

నవంబరు 8తో దేశంలో పెద్ద నోట్ల రద్దుకు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఎన్డీయేత‌ర పార్టీలు రేపు దేశ వ్యాప్తంగా ఆందోళ‌న‌లకు పిలుపునిచ్చిన విష‌యం తెలిసిందే. అందులో డీఎంకే కూడా ఉంది. కానీ.... సోమవారం నుంచి డీఎంకే తీరు మారిపోయింది. సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెన్నైలో డీఎంకే అధినేత కరుణానిధిని కలిసి మాట్లాడిన తరువాత డీఎంకే తన స్టాండ్ మార్చుకుంది. ఈ క్రమంలో ఈ రోజు డీఎంకే ఓ ప్ర‌క‌ట‌న చేసింది. తాము పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమంలో పాల్గొనడం లేదని ప్రకటించింది. వ‌ర‌ద‌ ప్రభావిత ప్రాంతాలైన ఎనిమిది జిల్లాల్లో నిరసన కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు చెప్పింది. ఇందులో ఏ రాజ‌కీయ ఉద్దేశం లేద‌ని పేర్కొంది.

అయితే.. ఎన్డీయేతర పార్టీలన్నీ పెద్ద నోట్ల రద్దుకు నిరసనగా కార్యక్రమాలు చేస్తుండగా బీజేపీ అదే సమయంలో అవినీతి వ్య‌తిరేక దినోత్స‌వం నిర్వ‌హించ‌నుంది. ఈ నిరసనలు ఎలా ఉణ్నా కూడా మోడీ - కరుణల సమావేశంలో తమిళనాడు రాజకీయాలపై వ్యూహాత్మక చర్చలు జరిగినట్లు చెప్తున్నారు. జయ మరణం తరువాత అన్నా డీఎంకేలో వర్గాలు ముదరడం.. కొత్తగా రజనీ - కమల్ వంటివారు పార్టీ ఏర్పాటు ప్రయత్నాల్లో ఉండడంతో అక్కడ గందరగోళ పరిస్థితి ఉంది. ఈ సమయంలో స్థిరమైన పార్టీగా డీఎంకే ఒక్కటే కనిపిస్తోంది. దీంతో కేంద్రంలో బలంగా ఉన్న బీజేపీ - తమిళనాడులో బలంగా ఉన్న డీఎంకేలు కలిస్తే బెటరని రెండు పార్టీలూ డిసైడైనట్లు తెలుస్తోంది. అందులో భాగమే డీఎంకే తన స్టాండు మార్చుకోవడమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.