Begin typing your search above and press return to search.

పవన్ ఇమేజిని అమాంతం పెంచేసిన మోడీ

By:  Tupaki Desk   |   11 Nov 2022 4:52 PM GMT
పవన్ ఇమేజిని అమాంతం పెంచేసిన మోడీ
X
దేశాన్ని ఏలే ప్రధాని ఆయన. అత్యంత ప్రజాకర్షణ కలిగిన నాయకుడు. ఆయనే నరేంద్ర మోడీ. ఆయనది విశాఖలో ఒక టైట్ షెడ్యూల్ ప్రోగ్రాం. అందునా అరగంటకు పైగా టూర్ ఆలస్యం అయింది. ఈ టైం లో ముందుగా అనుకున్న కార్యక్రమాలు రద్దు అవడమో లేక కుదించబడడమో జరుగుతుంది. కానీ ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ముందుగా షెడ్యూల్ చేయబడిన కార్యక్రమాన్ని వాయిదా వేసి మరీ జనసేనాని పవన్ కళ్యాణ్ కి అపాయింట్మెంట్ ఇచ్చారు. అది కూడా షెడ్యూల్ లో పది నిముషాలు అని ఉంటే దాన్ని అరగంటకు పెంచుకుంటూ పోయారు.

పైగా మోడీ పవన్ ల భేటీ ఏకాంతంగా జరిగింది. వన్ టూ వన్ గా సాగిన ఈ భేటీ ఏపీ రాజకీయాల్లో అత్యంత రాజకీయ ప్రాధాన్యత కలిగిన అంశంగా చూడాలి. అందునా ఒక చీఫ్ మినిస్టర్ అదే సిటీలో ఉన్న వేళ ఎమ్మెల్యే కూడా కాని ఒక నాయకుడికి, ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్న పార్టీ అధినేతకు మోడీ వంటి దేశంలో క్రే మోజూ ఉన్న నాయకుడు కీలకమైన అపాయింట్మెంట్ ఇచ్చారు అంటే పవన్ ఇమేజ్ అమాంతం పెరిగినట్లే అంటున్నారు.

ఏపీ రాజకీయాల్లో ఇప్పటికే పవన్ గ్రాఫ్ పెరుగుతోంది. ఆయన వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి సీటు మీద గురి పెట్టారు. ఆయన తనదైన వ్యూహాలు ప్రణాళికల మేరకు పనిచేసుకుంటూ పోతున్నారు. ఈ నేపధ్యంలో మిత్రపక్షంగా ఉన్న బీజేపీ ఇంతవరకూ పవన్ వంటి చరిష్మాటిక్ లీడర్ ని అసలు పట్టించుకోవడంలేదు అన్న బాధ అయితే పవన్ తో పాటు ఆ పార్టీ నేతలలో ఉంది.

అయితే ఏకంగా ఎనిమిదేళ్ళ తరువాత పవన్ కి ప్రధాని ఈ విధంగా భేటీకి అవకాశం ఇవ్వడం, అనేక విషయాలను చర్చించడం ద్వారా ఫ్యూచర్ సీఎం ఆఫ్ ఏపీ అన్న సంకేతాన్ని సందేశాన్ని ఏపీ జనాల్లో పంపించినట్లుగా ఉంది అంటున్నారు. మరో వైపు చూస్తే మోడీ పవన్ ల మధ్య ఏమి జరిగింది అనే దాని కంటే పవన్ తో బీజేపీ కలసి ఏపీ రాజకీయాల్లో ముందుకు సాగుతుంది అన్న బలమైన సంకేతాన్ని మాత్రం ఈ భేటీ ఇచ్చినట్లుగా భావించాలి.

మరో వైపు చూస్తే ఏపీలో జగన్ సీఎం గా ఉన్నారు. ప్రధాన్ ప్రతిపక్ష నేతగా నలభై ఏళ్ల అనుభవం కలిగిన చంద్రబాబు ఉన్నారు. ఏపీ రాజకీయాలు అంటే ఈ ఇద్దరే గుర్తుకు వచ్చేలా కొన్నేళ్ళుగా సాగుతున్న రాజకీయాన్ని మలుపు తిప్పే కీలకమైన భేటీగా కూడా మోడీ పవన్ మధ్య సమావేశాన్ని అంతా చూస్తున్నారు.

ఈ భేటీ తరువాత మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఏపీకి మంచి రోజులు వస్తున్నాయి అని మీడియాతో మాట్లాడుతూ చెప్పారు అంటే రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాల్లో అనేకమైన కీలక మార్పులు వస్తున్నాయని అనుకోవాలి. ఏది ఏమైనా పవన్ ఇమేజ్ మాత్రం బాగా పెరిగింది అనే అంటున్నారు. ఏపీకి మోడీ రావడం కాదు కానీ టాక్ ఆఫ్ ది స్టేట్ గా పవన్ వార్తల్లో నిలిచిపోయారు అని అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.