Begin typing your search above and press return to search.

మోడీ.. రాహుల్ మాటలకు రాలే ఓట్లు ఎన్ని?

By:  Tupaki Desk   |   14 March 2017 6:58 AM GMT
మోడీ.. రాహుల్ మాటలకు రాలే ఓట్లు ఎన్ని?
X
ఏ మాత్రం పోల్చలేని పోలికలు తరచూ పోలుస్తూ ఉంటారు. ప్రధాని నరేంద్ర మోడీని ఏ రకంగానూ పోటీ పడలేని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ కు మధ్య పోలికలు తెస్తుంటారు. సార్వత్రిక ఎన్నికల్లో రెండు ప్రదాన పార్టీల ప్రదానమంత్రి అభ్యర్థులన్న పోలిక కూడా ఇందుకు కారణమై ఉండొచ్చు. వాస్తవానికి వారిద్దరికి భూమి.. ఆకాశానికి మధ్యనున్నంత వ్యత్యాసం ఉందని చెప్పాలి. ఏ యాంగిల్ లోచూసినా మోడీతో పోటీ తర్వాత.. ఆ దరిదాపుల్లోకి రాలేని వైనం రాహుల్ లో కనిపిస్తుంది.

తాజాగా వెలువడిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఆ విషయాన్ని మరోసారి స్పష్టం చేశాయని చెప్పాలి. ప్రధాని మోడీ మాటలు చూపించే ప్రభావం.. ఓటర్ల మనసుపై ఆయన మాటలు ఎంతలా ఉంటాయి? అదే సమయంలో రాహుల్ మాటల ప్రభావం ఏ పాటిదన్న విషయంపై ఆసక్తికర చర్చ ఒకటి నడుస్తోంది.దీనికి సంబంధించిన లెక్క ఒకటిబయటకు వచ్చింది. మొన్న ముగిసిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పలు సభల్లో పాల్గొన్నా.. కీలకమైన యూపీ విషయానికి వస్తే.. మోడీ మొత్తంగా 23 ర్యాలీలు.. రెండు రోడ్డు షోలలో పాల్గొన్నారు. తన ప్రచారంతో దాదాపు 118 అసెంబ్లీ స్థానాల్ని కవర్ చేశారు.

అదే సమయంలో రాహుల్ పాల్గొన్న ప్రచారసభల సంఖ్య చూస్తే ఆశ్చర్యానికి గురి కాక తప్పదు. ఎందుకంటే.. ఆయన పాల్గొన్నది 54 అసెంబ్లీస్థానాల్లో 54 ర్యాలీల్లో మాత్రమే. యూపీ పీఠాన్నిదక్కించుకోవటం కోసం బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు తెలిసిన నేపథ్యంలో..మరింతగా కృషి చేయాల్సి ఉన్నప్పటికీ.. మోడీ కంటే తక్కువనియోజకవర్గాల్లో రాహుల్ ప్రచారం చేయటం గమనార్హం.

మోడీ ప్రచారం చేసిన నియోజకర్గాల్లో బీజేపీ 99 స్థానాల్లో విజయం సాధిస్తే.. బీజేపీ మిత్రపక్షం అప్నాదల్ మరో మూడు స్థానాల్లో విజయం సాధించింది. అదే సమయంలో రాహుల్ ప్రచారం చేసిన 46 అసెంబ్లీ స్థానాల్లో కేవలం ఏడు స్థానాల్లోనే సమాజ్ వాదీ.. కాంగ్రెస్ కూటమి విజయం సాధించటం గమనార్హం. మోడీ ప్రచారం చేసిన అసెంబ్లీ స్థానాల్లో గెలుపు శాతం 86.4శాతం ఉంటే.. రాహుల్ ప్రచారం చేసిన స్థానాల్లో విజయం కేవలం 15 శాతం మాత్రమే ఉండటం గమనార్హం.

మోడీ ప్రచారం చేసిన ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఐదు ఓట్లకు నాలుగు ఓట్లు బీజేపీకి పడితే.. రాహుల్ ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో ప్రతి ఐదు ఓట్లకు ఒక్క ఓటు మాత్రమే కాంగ్రెస్ కు పడటం చూస్తే.. మోడీ..రాహుల్ మాటలు ఓటర్ల మీద ఎంత ప్రభావాన్ని చూపించాయో ఇట్టే తెలుస్తుంది. అదే సమయంలో భారీ మెజార్టీతో కాంగ్రెస్ గెలుపొందినపంజాబ్ విషయానికి వస్తే.. మోడీ ప్రచారం చేసిన పది అసెంబ్లీ స్థానాల్లో అకాలీదళ్ – బీజేపీ కూటమి నాలుగు స్థానాల్లో మాత్రమే నెగ్గింది.అంటే.. మోడీ ప్రచారంతో విజయ శాతం 40 మాత్రమే. అదే సమయంలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న పంజాబ్ రాష్ట్రంలో రాహుల్ 15నియోజకవర్గాల్లో ప్రచారం చేయగా..ఏడు నియోజకవర్గాల్లో మాత్రమే విజయం సాధించటం విశేషం. కాంగ్రెస్ విజయం సాధించిన పంజాబ్ లో రాహుల్ ప్రచార విజయ శాతం 46 శాతం మాత్రమే.

ఉత్తరాఖండ్ లో మోడీ ప్రచార విజయ శాతం 80 అయితే.. రాహుల్ గాంధీ ప్రచారం చేసిన ఐదు స్థానాలు బీజేపీఖాతాలోకే వెళ్లిపోయాయి. మణిపూర్ విషయానికి వస్తే.. 26 అసెంబ్లీ స్థానాల్లో ప్రధానిమోడీ ప్రచారం చేస్తే.. 13 స్థానాలు బీజేపీ ఖాతాలోకి వెళ్లగా.. రాహుల్ ప్రచారం చేసిన ఒకే ఒక్కనియోజకవర్గం బీజేపీకి వెళ్లిపోయింది. గోవాలో మోడీ ప్రచారం చేసిన ఒక్క నియోజకవర్గంలో బీజేపీ విజయం సాధించగా.. రాహుల్ గాంధీ ప్రచారం చేసినఒక్కస్థానంలో కాంగ్రెస్ విజయం సాధించింది.

మొత్తంగా చూసినప్పుడు ఐదు రాష్ట్రాల్లో మోడీ 180 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తే..వాటిల్లో 140 స్థానాల్లో బీజీపీ.. దాని మిత్రపక్షాలు విజయం సాధించాయి. అదే సమయంలో రాహుల్ గాంధీ మొత్తం ఐదు రాష్ట్రాల్లో 69స్థానాల్లో పర్యటిస్తే.. కాంగ్రెస్..దాని మిత్రపక్షాలు కేవలం15 స్థానాల్లోనే గెలుపొందటం చూస్తే.. మోడీ మాటలకు..రాహుల్ మాటలకు రాలే ఓట్లు ఎన్ని అన్న విషయం ఇట్టే అర్థమవుతుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/