Begin typing your search above and press return to search.

క్షమాపణ చెప్పిన మోడీ

By:  Tupaki Desk   |   19 Nov 2021 6:00 AM GMT
క్షమాపణ చెప్పిన మోడీ
X
నరేంద్ర మోడీ నుండి ఇలాంటి విషయాన్ని దేశంలో ఎవరైనా ఊహించారా ? తప్పులు ఎన్ని చేసినా ప్రజలకు గానీ పార్లమెంటుకు కానీ సమాధానం చెప్పాల్సిన అవసరమే లేదన్నట్లుగా ఇంతకాలం వ్యవహరిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక్కసారిగా నేలమీదకు దిగొచ్చారు. మూడు వ్యవసాయ చట్టాల విషయంలో దేశానికి క్షమాపణలు చెప్పి చట్టాన్ని రద్దు చేస్తున్నట్లు చెప్పటమంటే మామూలు విషయం కాదు.

వ్యవసాయ చట్టాలపై దేశానికి, రైతులకు మోడి క్షమాపణలు చెప్పటమంటే తాను తప్పుచేసినట్లు అంగీకరించటమే. గడచిన ఏడాదిగా రైతుల ఉద్యమాన్ని, ప్రతిపక్షాలను, సుప్రింకోర్టును కూడా ఏమాత్రం లెక్క చేయని మోడీ హఠాత్తుగా వ్యవసాయ చట్టాలు ఎందుకు వెనక్కు తీసుకున్నట్లు ? ఎందుకంటే రాబోయే రోజుల్లో బీజేపీ భవిష్యత్తు కళ్ళకు కనబడుతోంది కాబట్టే అనుకోవాలి. దేశవ్యాప్తంగా మోడీపై వ్యతిరేకత పెరిగిపోతోంది.

వచ్చే ఏడాదిలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల విషయంలో మోడిలో టెన్షన్ మొదలైనట్లు అర్ధమైపోతోంది. పంజాబ్ లో బీజేపీ ఎటూ గెలిచే అవకాశంలేదని తేలిపోయింది. గోవా, మణిపూర్ పెద్ద విషయమే కాదు. మిగిలిన ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ లో గెలవటం బీజేపీకి చాలా చాలా అవసరం. యూపీలో గెలుపుపైనే 2024 షెడ్యూల్ పార్లమెంటు ఎన్నికల రిజల్టు ఆధారపడుంది. ఒకవైపు యూపీలో బీజేపీ గెలుపు అంత ఈజీకాదని సర్వేలు చెబుతున్నాయి. ప్రధాన ప్రత్యర్ధుల్లో ఒకటైన సమాజ్ వాదీ పార్టీ బాగా పుంజుకున్నట్లు సర్వేలు చెబుతున్నాయి.

దాంతో మోడిలో టెన్షన్ పెరిగిపోతున్నట్లు అర్ధమైంది. ఈమధ్యనే ప్రశాంతంగా ర్యాలీచేస్తున్న రైతులపై లఖింపూర్ ఖేరిలో బీజేపీ కేంద్రమంత్రి కొడుకు వాహనం దూసుకుపోవటం లాంటి అనేక ఘటనల వల్ల అధికారపార్టీపై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతోంది. ఇలాంటి అనేక విషయాలను దృష్టిలో ఉంచుకుని ఒక్కసారిగా మోడి యూటర్న్ తీసుకున్నారు. గడచిన ఏడాదిగా జరుగుతున్న రైతుల ఉద్యమం పంజాబ్, యూపీ, ఉత్తరాఖండ్, హర్యానా, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో చాలా తీవ్రంగానే సాగుతోంది.

రైతుల మీద ప్రేమతోనో లేకపోతే ఉద్యమంలో చనిపోయిన వారి ఆత్మలు శాంతిస్తాయనో మోడి వ్యవసాయ చట్టాలను రద్దుచేయలేదు. కేవలం రాజకీయంగా దెబ్బ తగలకూడదని, రాబోయే ఎన్నికల్లో బీజేపీ లాభపడాలన్న ఆలోచనతో మాత్రమే వ్యవసాయ చట్టాలను రద్దు చేశారంతే. ఏదేమైనా రాజకీయ అనివార్యతను కలగచేస్తే మాత్రమే ప్రభుత్వాలు నేలమీదకు దిగొస్తాయని తాజాగా రైతుల ఉద్యమం నిరూపించింది.