Begin typing your search above and press return to search.

రాష్ట్రప‌తిగా మోదీ?... ప్ర‌ధానిగా గ‌డ్క‌రీ?

By:  Tupaki Desk   |   24 May 2021 12:30 PM GMT
రాష్ట్రప‌తిగా మోదీ?... ప్ర‌ధానిగా గ‌డ్క‌రీ?
X
క‌రోనా క‌రాళ నృత్యం నేప‌థ్యంలో భార‌త రాజ‌కీయాల్లో కొత్త కొత్త ఈక్వేష‌న్లు తెర మీద‌కు వ‌స్తున్నాయి. ఈ ఈక్వేష‌న్ల‌లో ప్ర‌ధాన‌మైన‌ది బీజేపీలో వినిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి రాష్ట్రప‌తిగా ప్రస్తుత ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ మారిపోతే... ప్ర‌ధానిగా ప్ర‌స్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న నితిన్ గ‌డ్క‌రీ బాధ్య‌త‌లు చేప‌డ‌తార‌న్న ఈక్వేష‌న్ అంద‌రిలోనూ ఆస‌క్తి రేకెత్తిస్తోంది. ఈ ఈక్వేష‌న్ కు ఏ మేర ఛాన్సుందో తెలియ‌దు గానీ... క‌రోనా క‌ట్ట‌డిలో ఎన్డీఏ స‌ర్కారు విఫ‌ల‌మైన తీరును ఆధారం చేసుకుని ప‌లు సోష‌ల్ మీడియా వేదిక‌ల మీద ఈ ఈక్వేష‌న్ చ‌క్క‌ర్లు కొడుతోంది. మ‌రి ఈ ఈక్వేష‌న్ ఎంత‌వ‌ర‌కు వ‌ర్క‌వుట్ అవుతుంద‌న్న విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. ఇత‌ర రాజ‌కీయ పార్టీల్లోనే కాకుండా స్వ‌యంగా బీజేపీ శ్రేణుల్లోనూ దీనిపై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది.

క‌రోనా తొలి వేవ్ ను మోదీ స‌ర్కారు స‌మ‌ర్థ‌వంతంగానే క‌ట్ట‌డి చేయ‌గ‌లిగింది. దీనిపై జాతీయ మీడియాతో పాటు అంత‌ర్జాతీయ మీడియా కూడా మోదీని ఆకాశానికెత్తేసింది. అయితే ఇదంతా క‌రోనా సెకండ్ వేవ్ మొద‌లు కాగానే గాలి బుడ‌గ మాదిరిగా పేలిపోయింది. అస‌లు క‌రోనా సెకండ్ వేవ్ ను మోదీ సర్కారు అంచ‌నా వేయ‌లేక‌పోవ‌డం, దానిని క‌ట్ట‌డి చేయ‌డంలో ఘోరంగా విఫ‌ల‌మ‌వుతున్న తీరుతో మోదీ గ్రాఫ్ అంత‌కంత‌కూ త‌గ్గిపోతోంది. ఈ నేప‌థ్యంలో తొలి వేవ్ ను స‌మ‌ర్థంగా క‌ట్ట‌డి చేయ‌గ‌లిగాని కీర్తించిన మీడియా... సెకండ్ వేవ్ ను కట్ట‌డి చేయ‌డంలో మోదీ స‌ర్కారు ఘోరంగా విఫ‌ల‌మైపోయింద‌ని పెద్ద ఎత్తున వార్త‌లు రాసేస్తోంది. ఈ క్ర‌మంలో అంత‌ర్జాతీయంగా జ‌రిగిన స‌ర్వేల్లో మోదీ గ్రాఫ్ అమాంతంగా ప‌డిపోయింది. దీనికి సంబంధించి వార్త‌ల‌తో ఇటు బీజేపీతో పాటు అటు ఇత‌ర పార్టీల్లోనూ కొత్త త‌ర‌హా ఈక్వేష‌న్లు చ‌ర్చ‌కు వ‌చ్చేశాయి.

బీజేపీ అంటే కాంగ్రెస్ మాదిరి కుటుంబ పార్టీ ఏమీ కాదు. ఆరెస్సెస్ వ్యూహాల‌తో ముందుకు సాగుతున్న బీజేపీలో ఎప్పుడు ఎవ‌రికి ప‌ద‌వి ద‌క్కుతుందో? ఎప్పుడు ఎవ‌రి ప‌ద‌వి ఊడుతుందో చెప్ప‌లేని ప‌రిస్థితి. మాజీ ప్ర‌ధాని వాజ్ పేయి త‌ర్వాత‌... పార్టీ బాగా వీకైన నేప‌థ్యంలో ప‌దేళ్ల కాంగ్రెస్ పార్టీ పాల‌న‌... దానిపై జ‌నాల్లో పెరిగిన అసంతృప్తిని క్యాచ్ చేసిన ఆరెస్సెస్‌... బీజేపీ గ‌ట్టెక్కాలంటే కొత్త నేత కావాల్సిందేన‌ని, అది కూడా ప‌దునైన వ్యూహాలు ర‌చించి అమ‌లు చేసే నేత ఎవ‌ర‌న్న దిశ‌గా ఆలోచ‌న చేస్తుండ‌గా... అప్ప‌టికే గుజ‌రాత్ లో ప‌దిహేనేళ్ల‌కు పైగా ఏకధాటిగా పాల‌న సాగిస్తున్న మోదీ క‌నిపించారు. దీంతో ఆయ‌న‌ను రంగంలోకి దించ‌గా... ఆరెస్సెస్ అనుకున్న మాదిరిగానే మోదీ కూడా మంచి ఫ‌లితాల‌నే సాధించారు. 2014 ఎన్నిక‌ల్లో పార్టీని విజ‌య‌ప‌థంలో న‌డిపాడు. అయితే 2019 వ‌చ్చేస‌రికి త‌న‌కు ప్ర‌త్యామ్నయం వెతికే అవ‌కాశాన్ని ఆరెస్సెస్ కు వ‌ద‌ల‌ని రీతిలో మోదీ వ్య‌వ‌హ‌రించారు. అంతేకాకుండా 2019 ఎన్నికల్లో మ‌రింత‌గా బ‌ల‌హీన‌ప‌డిన‌ కాంగ్రెస్ పార్టీని మ‌రోమారు గ‌ట్టిగా బాదేసిన మోదీ... మంచి మెజారిటీతో వ‌రుస‌గా రెండో ప‌ర్యాయం బీజేపీని గెలిపించ‌గ‌లిగారు.

ఇదంతా గ‌తం అనుకుంటే.. ఇప్ప‌టికే ఏడేళ్లుగా ప్ర‌ధానిగా కొన‌సాగుతున్న మోదీ మ‌రో మూడేళ్ల పాటు ఆ ప‌ద‌విలో కొనసాగుతార‌నే చెప్పాలి. అయితే 2024 ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్దీ మోదీకి ప్ర‌త్యామ్నాయం ఎవ‌ర‌న్న దిశ‌గా అంతా ఆలోచ‌న చేయ‌డం మొద‌ల‌వుతుంది. అది కూడా కరోనా సెకండ్ వేవ్ ను కట్ట‌డి చేయ‌డంలో ఘోరంగా విఫ‌ల‌మ‌య్యార‌న్న అప‌ప్ర‌ద మోదీపై ఉండ‌నే ఉంది క‌దా. ఈ నేప‌థ్యంలో త‌ప్ప‌నిస‌రిగా మోదీకి ప్ర‌త్యామ్నాయం ఎవ‌ర‌న్న దిశ‌గా బీజేపీతో పాటు ఆరెస్సెస్ కూడా ఆలోచించే అవ‌కాశాలున్నాయ‌న్న వాద‌న‌లు క‌మ‌ల‌నాథుల్లో వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అయితే మోదీ మాదిరి వ్య‌వ‌హారం న‌డ‌ప‌డంలో నితిన్ గడ్క‌రీ అయితేనే బాగుంటుంద‌న్న వాద‌న‌లు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో బీజేపీకి పున‌రుజ్జీవం పోసిన మోదీని ఒక్క దెబ్బ‌కే ప‌క్క‌న‌పెట్ట‌కుండా ఆయ‌న‌ను రాష్ట్రప‌తి హోదాకు ప‌రిమితం చేసేసి... ప్ర‌ధాని ప‌ద‌వికి గ‌డ్క‌రీని ప్ర‌పోజ్ చేసే అవ‌కాశాలున్నాయ‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఈ దిశ‌గా ఆస‌క్తిక‌ర‌మైన విశ్లేష‌ణ‌లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.