Begin typing your search above and press return to search.

సభకు మోడీ వచ్చారు కానీ..

By:  Tupaki Desk   |   23 Nov 2016 9:40 AM GMT
సభకు మోడీ వచ్చారు కానీ..
X
నోట్ల రద్దు నిర్ణయం తర్వాత కొద్దిరోజులు కామ్ గా ఉండిపోయిన విపక్షాలు.. రెట్టించిన ఉత్సాహంతో మోడీ అండ్ కో మీద విరుచుకుపడటం తెలిసిందే. ప్రధాని నిర్ణయం తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్.. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మినహా మిగిలిన వారు ఎవరూ పెదవి విప్పని పరిస్థితి. అయితే.. ఏటీఎంలు పని చేయకపోవటం.. బ్యాంకుల వద్ద బారులు తీరిన క్యూలతో పాటు.. నగదు కొరత ఉందని బ్యాంకులు చెప్పిన మాటలతో విపక్షాలు ఒక్కసారిగా మోడీ సర్కారుపై విరుచుకుపడ్డారు.

సరైన జాగ్రత్తలు తీసుకోకుండా.. దూకుడుగా నిర్ణయాన్ని తీసుకున్నారని.. ఈ నిర్ణయం వెనుక భారీ కుంభకోణం ఉందంటూ విమర్శల్ని సంధిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఓపక్క దేశ ప్రజలంతా డబ్బులు మార్చుకునేందుకు.. బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకునేందుకు బ్యాంకుల ముందు క్యూలలో నిలుచున్న వేళ.. పార్లమెంటు సమావేశాలు షురూ అయ్యాయి. సభ ప్రారంభమైన తొలిరోజున ప్రధాని నరేంద్ర మోడీ సభకు హాజరయ్యారు.

విపక్షనేతల వద్దకు వెళ్లి మరీ.. పలుకరించి..వారితో ప్రత్యేకంగా మాట్లాడారు. అనంతరం ఆయన సభకు హాజరు కాలేదు. నోట్ల రద్దుపై చర్చ జరగాలని.. ప్రధాని సమాధానం చెప్పాలంటూ విపక్ష నేతలు ఆందోళన చేస్తున్నారు. ఓపక్క సభ జరుగుతుంటే.. ప్రధాని మోడీ సభకు ఎందుకు రారు? అంటూ విపక్షాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి. కీలకనిర్ణయం తీసుకున్న తర్వాత జరుగుతున్న పార్లమెంటు సమావేశాలకు ప్రధాని హాజరు కాకపోవటంపై పలు వర్గాల ప్రముఖులు తప్పు పట్టే పరిస్థితి.

సభ ఎలా జరుగుతుంది? సభలో మాట్లాడే అవకాశం ఉందా? లేదా? అన్న విషయాల్ని పక్కన పెట్టి.. సభకు హాజరు కావటం ప్రధాని బాధ్యత కానీ.. తప్పించుకున్నట్లుగా ఆయన సభకు హాజరు కాకపోవటం తప్పు అవుతుందన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేశారు. ఇక.. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అయితే.. సభలు.. సమావేశాలు.. పార్టీ మీటింగ్ లలో తరచూ ప్రసంగించే ప్రధాని మోడీ.. లోక్ సభలో ఎందుకు మాట్లాడరంటూ సూటి ప్రశ్న వేశారు.

విపక్ష నేతల మండిపాటు వేడి ప్రధాని మోడీని తాకిందేమో కానీ.. తాజాగా ఆయన సభకు హాజరయ్యారు. తనకు అవకాశం లభిస్తే.. సభను ఉద్దేశించి మాట్లాడాలన్న ఉద్దేశంతో మోడీ ఉన్నట్లు కనిపించింది. అయితే.. సభా పర్వరం వాడీవేడీగా.. ఆరోపణలు.. ప్రతి ఆరోపణల నేపథ్యంలో పలుమార్లు వాయిదా పడిన సభ.. చివరకు అధికార.. విపక్షాల మాటలు చురుకుల మధ్య అర్థాంతంగా వాయిదా పడింది. దీంతో.. నిన్నటి వరకూ ప్రధాని సభకు రాలేదంటూ తప్పు పట్టిన విపక్ష నేతలు.. నేడు ప్రధానిని మాట్లాడే అవకాశం ఇవ్వకపోవటం విపక్షాల వైపు వేలెత్తి చూపేలా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/