Begin typing your search above and press return to search.

ఒక్కమాటతో పాకిస్థాన్ కు చెమటలు పట్టించిన మోడీ

By:  Tupaki Desk   |   15 Aug 2016 7:17 AM GMT
ఒక్కమాటతో పాకిస్థాన్ కు చెమటలు పట్టించిన మోడీ
X
పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోవడం.. అందుకు భారత్ సహకరించడం తెలిసిందే. దానివల్ల ఇండియా - పాక్ ల మధ్య సంబంధాలు మరింత క్షీణించడమూ తెలిసిందే. ఇప్పుడు మరోసారి అలాంటి పరిణామాలకు అవకాశం కనిపిస్తోంది. భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సాక్షాత్తు ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు ఇందుకు ఊతమిస్తున్నాయి. నిత్యం కాలు దువ్వుతూ రెచ్చగొట్టే పాకిస్థాన్ కు చెమటలు పట్టించే మాట ఒకటి మోడీ అన్నారు. మన దేశంలో వేర్పాటు వాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్ షాక్ తినేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ నుంచి బలూచిస్థాన్ కు స్వాతంత్ర్యం రావాలని అన్నారు. దీంతో అంతర్జాతీయంగానూ ఒక్కసారిగా కలకలం రేగింది.

70వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని ఎర్రకోట నుంచి కీలక ప్రసంగం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... పాక్ ఆక్రమిత కశ్మీర్ తో పాటు ఆ దేశంలోని బలూచిస్థాన్ కు కూడా స్వాతంత్య్రం కావాల్సిందేనని ప్రకటించారు. దీంతో బలూచిస్థాన్ లోని నేతల ఆనందానికి అవధుల్లేవు. పాక్ లో అంతర్భాగంగా ఉన్న బలూచిస్థాన్ కు చెందిన కీలక రాజకీయవేత్త వెంటనే స్పందించారు. అంతేకాదు జైహింద్ అంటూ నినదించారు. బలూచిస్థాన్ లో కీలక రాజకీయ పార్టీగా ఉన్న బలూచ్ రిపబ్లికన్ పార్టీ (బీఆర్పీ) నేత అష్రఫ్ షెర్జాన్ ‘జైహింద్’ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేయడమే కాకుండా పాకిస్థాన్ కబంద హస్తాల నుంచి బలూచిస్థాన్ ప్రజలు విముక్తి కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. త్వరలోనే భారత్ తో కలిసి బలూచిస్థాన్ స్వాతంత్య్ర వేడుకలు జరుపుకుంటుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ వేదికలపై బలూచిస్థాన్ సమస్యను ప్రస్తావించారంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీకి షెర్జాన్ కృతజ్ఞతలు చెప్పారు.

కాగా మోడీ ఇంత నేరుగా బలూచిస్థాన్ అంశాన్ని స్వాతంత్ర్య దినోత్సవ వేదిక నుంచి ప్రస్తావించడంతో ఇదేదో మామూలుగా చేసిన వ్యాఖ్యలు కావని అర్థమవుతోంది. ఒక రకంగా పాక్ తో యుద్ధానికి రెడీ అని సంకేతం పంపినట్లే. అయితే... ప్రధాని ఈ కీలక వ్యాఖ్యలు చేసిన కొద్దిసేపటికే శ్రీనగర్ లో తీవ్రవాదులు విరుచుకుపడ్డారు. భద్రతాదళాలపై దాడికి తెగబడ్డారు. ఈ దాడి మోడీ వ్యాఖ్యల నేపథ్యంలోనే జరిగిందని అనుమానిస్తున్నారు. మోడీ వ్యాఖ్యలపై పాక్ స్పందన ఇలా దాడుల రూపంలోనే ఉంటుందా లేదా ఏమైనా మాట్లాడుతుందా అన్నది చూడాలి.