Begin typing your search above and press return to search.

పేదోళ్ల క‌ష్టాన్ని ఒక్క మాట‌తో తీసేసిన మోడీ

By:  Tupaki Desk   |   29 Nov 2016 11:10 AM GMT
పేదోళ్ల క‌ష్టాన్ని ఒక్క మాట‌తో తీసేసిన మోడీ
X
500 - 1000 నోట్ల ర‌ద్దుతో తీవ్ర క‌ష్టాలు అనుభ‌విస్తున్న సామాన్యుల‌ను ప్ర‌ధాని మోడీ ఒక్క మాట‌తో చ‌ల్ల‌బ‌రిచేశారు. కుబేరులు కూడ‌బెట్టిన న‌ల్ల‌ధ‌నాన్ని బ‌య‌ట‌కు లాగి అదంతా పేద‌ల‌కే చెందేలా చేస్తాన‌ని ప్ర‌క‌టించి అసంతృప్తిని తొల‌గించుకోవ‌డంతో పాటు విప‌క్షాల నోళ్లు కూడా మూయించారు. ఢిల్లీలో ఈ రోజు జ‌రిగిన బీజేపీ పార్ల‌మెంట‌రీ స‌మావేశంలో ఆయ‌న కీల‌క ఎత్తుగ‌డ‌ను బ‌య‌ట‌పెట్టారు. స‌భ‌లో ప్ర‌ధాని మోడీ మాట్లాడుతూ.. వ‌సూలైన న‌ల్ల‌ధ‌నం అంతా పేద‌ల‌ కోసమే ఖ‌ర్చు చేస్తామ‌ని ప్ర‌క‌టించి అంద‌రిలో అనుమానాల‌ను ప‌టాపంచ‌లు చేశారు. ఆదాయ‌ప‌న్ను చ‌ట్ట‌స‌వ‌ర‌ణ బిల్లు అనేది న‌ల్ల‌ధ‌నాన్ని అధికారికం చేసేదికాదని వ్యాఖ్యానించారు. దేశంలోని పేద‌ల సంక్షేమానికి ఆదాయ‌ప‌న్ను చ‌ట్ట‌స‌వ‌ర‌ణ బిల్లు ఉప‌యోగ‌ప‌డుతుందని చెప్పారు.

పంచాయ‌తీలు - మున్సిపాలిటీల్లో ప్ర‌జాప్ర‌తినిధులు ప‌ర్య‌టించాల‌ని, ప్ర‌జ‌లకు న‌గ‌దుర‌హిత లావాదేవీల‌పై అవ‌గాహ‌న క‌ల్పిస్తూ - పెద్ద‌నోట్ల ర‌ద్దుతో క‌లిగే ప్ర‌యోజ‌నాల‌ను తెల‌పాల‌ని మోడీ చెప్పారు. దేశంలో న‌ల్ల‌ధనాన్ని మెడలు వంచి వెలుగులోకి తెస్తున్నామని పేర్కొన్నారు. ఈ-బ్యాంకింగ్‌ - కార్డుల ఉప‌యోగం వంటి వాటిపై ప్ర‌జ‌ల‌తో స‌హా చిన్న వ్యాపారుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని అన్నారు. మ‌రోవైపు బీజేపీకి చెందిన ఎంపీలు - ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలంతా తమ బ్యాంకు ఖాతా వివరాలను వెల్లడించాలని - ఇదే భేటీలో మోడీ ఆదేశాలు జారీ చేశారు.

బీజేపీ ఎంపీలు పెద్ద‌నోట్ల ర‌ద్దు త‌రువాత చేప‌ట్టిన‌ అవ‌గాహన కార్య‌క్ర‌మాల గురించి పార్టీ కార్యాల‌యాల‌కు నివేదిక‌ అందించాల‌ని కూడా మోడీ కోరారు. కాగా మోడీ తాజా ప్ర‌క‌ట‌న‌తో విప‌క్షాలు డిఫెన్సులో ప‌డ్డాయి. నోట్ల ర‌ద్దు ప్ర‌జ‌ల‌ను తీవ్రంగా న‌ష్ట‌ప‌రుస్తోంద‌ని గొంతుచించుకుంటున్న విప‌క్షాలు ఇప్పుడీ అస్త్రాన్ని ఎలా ఎదుర్కోవాలా.. మోడీ మాయ‌లో ప్ర‌జ‌లు ప‌డ‌కుండా ఇంకేం చేయాలా అని ఆలోచ‌న‌లో ప‌డిపోయాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/