Begin typing your search above and press return to search.

పీఎం మోడీ-కేసీఆర్.. ఎవరు దృష్టిని ఆకర్షిస్తారు?

By:  Tupaki Desk   |   27 Nov 2020 5:30 PM GMT
పీఎం మోడీ-కేసీఆర్.. ఎవరు దృష్టిని ఆకర్షిస్తారు?
X
కరోనా వైరస్ నిరోధానికి హైదరాబాద్ లోని భారత్ బయోటిక్ సంస్థ వ్యాక్సిన్ తయారు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యాక్సిన్ పురోగతిని పరిశీలించేందుకు ప్రధాన మంత్రి మోడీ ఆదివారం హైదరాబాద్ కు రానున్నారు. 29న ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హకీం పేటకు వస్తారు. అక్కడి నుంచి భారత్ బయోటెక్ సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటారు. అయితే ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ తరుపున ప్రముఖులు ప్రచారానికి వస్తున్నారు.

ప్రధాని నరేంద్రమోడీ సడెన్ గా హైదరాబాద్ టూర్ పెట్టుకోవడం ఆసక్తి రేపుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ అనూహ్యంగా మోడీ హైదరాబాద్ వస్తుండడం ఉత్కంఠగా మారింది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల చివరి రోజున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భాగ్యనగరానికి రానున్నారు. దాంతో ఆయన పర్యటన చర్చనీయాంశమైంది. మోదీ పర్యటనలో ఒక్క మాట మాట్లాడినా అది గ్రేటర్ ఎన్నికల ప్రచారానికేనని అభిప్రాయం కలిగే సంకేతాలున్నాయి.

గ్రేటర్ ఎన్నికల ప్రచార పర్వంలో టీఆర్ఎస్, బీజేపీల మధ్య మాటల మంటలు రగులుకున్న నేపథ్యంలో బీజేపీ జాతీయ నాయకుల రాకను గులాబీ నేతలు తప్పుపడుతున్నారు. అవసరమైతే ప్రధానమంత్రిని కూడా జీహెచ్ఎంసీ ప్రచారానికి స్థానిక నేతలు పిలుచుకు వస్తారంటూ తెలంగాణ మునిసిపల్ మంత్రి కే.తారక రామారావు సెటైర్ వేశారు. ఈ నేపథ్యంలోనే నరేంద్ర మోదీ హైదరాబాద్ రానున్నట్లు హఠాత్తుగా పర్యటన ఖరారైంది. దాంతో స్థానికంగా మోదీ పర్యటనపై ఆసక్తి ఏర్పడింది.

హైదరాబాద్ వచ్చే ముందు రోజున అంటే నవంబర్ 28వ తేదీన ప్రధాని పుణె నగరానికి వెళ్ళనున్నారు. అక్కడి సీరం ఇనిస్టిట్యూట్‌లో రూపొందుతున్న వ్యాక్సిన్‌పై కూడా ప్రధాని సమీక్ష జరపనున్నారు. వ్యాక్సిన్‌ మంచి చెడ్డలను వాకబు చేసేందుకు తలపెట్టిన పర్యటనల్లో భాగంగానే ప్రధాని మోదీ.. మొదట పుణెకు, ఆ తర్వాత హైదరాబాద్‌కు వెళ్ళాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

మధ్యాహ్నం 3.45 గంటలకు ప్రధాని హైదరాబాద్‌ను సందర్శించనుండగా.. అదేరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్బీ స్టేడియంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ సమావేశం నిర్వహించనున్నారు, ఈ ఇద్దరి పర్యటన రాజకీయంగా వేడి పుట్టిస్తోంది. సిఎం సమావేశం రెండు గంటల పాటు సాయంత్రం 5.45 గంటలకు ముగుస్తుంది. ఆ సమయంలో ప్రధాని తిరిగి న్యూఢిల్లీకి వెళ్తారు.

బహిరంగ సభకు భారీగా జనాలను తరలిస్తున్నారు. హైదరాబాద్ భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికల గురించి ముఖ్యమంత్రి మాట్లాడే అవకాశం ఉంది. రాజకీయ పరిశీలకులు ఇది యాదృచ్చికం కాదు.. బాగా ప్రణాళికాబద్ధమైన వ్యూహం అని అంటున్నారు. మధ్యాహ్నం 3.45 గంటలకు సిఎం సమావేశం పెట్టడంతో కేసీఆర్ ప్రధానమంత్రి మోడీ హైదరాబాద్ పర్యటనకు దూరంగా ఉంటుడడం విశేషంగా మారింది. ఇది ప్రజల దృష్టిని మళ్ళించే ప్రయత్నం అని చెబుతున్నారు.. భారీ బహిరంగ సభను నిర్వహించడం ద్వారా కేసీఆర్ ప్రజల దృష్టిని మరలుస్తున్నారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ బీజేపీ, టీఆర్ఎస్ టఫ్ ఫైట్ నెలకొన్న ఈ సమయంలో మోడీ హైదరాబాద్ కు రావడం.. కేసీఆర్ సభ పెట్టుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మోడీ రాజకీయంగా ఏదైనా మాట్లాడుతాడా అనేది ఆసక్తి రేపుతోంది.