Begin typing your search above and press return to search.

బీజేపీ మాస్ట‌ర్ ప్లాన్‌.. ఆ పాపం కాంగ్రెస్‌దేన‌న‌ట‌!

By:  Tupaki Desk   |   14 Jan 2023 12:30 AM GMT
బీజేపీ మాస్ట‌ర్ ప్లాన్‌.. ఆ పాపం కాంగ్రెస్‌దేన‌న‌ట‌!
X
రాజ‌కీయం అంటే.. మోడీనే చేయాలి.. రాజ‌కీయం అంటే.. మోడీతోనే మొద‌లవ్వాలి.. అన్న‌ట్టుగా ఉంది.. ప‌రిస్థితి. తాజాగా ఉత్తరాఖండ్ లోని ప్ర‌ముఖ ప‌ర్యాట‌క‌ క్షేత్రమైన జోషిమఠ్‌ లో భూమి కుంగి పోవ‌డం.. అక్క‌డ నుంచి దాదాపు 600 మంది నివాసుల‌ను వేరే ప్రాంతానికి త‌ర‌లించ‌డం.. తెలిసిందే. ఇది దేశ‌వ్యాప్తంగానే కాకుండా.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా కూడా తీవ్ర ఆందోళ‌న క‌లిగింది.

దీంతో ఈ ప‌రిణామం .. ఉత్త‌రాఖండ్‌లోని బీజేపీ ప్ర‌భుత్వానికి అదేస‌మయంలో కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు మెడ‌కు చుట్టుకుంటోంది. దీంతో ఒక్క‌సారిగా బీజేపీ మాస్ట‌ర్ ప్లాన్ వేసింది.. ఇక్క‌డి ఈ ప‌రిణామాన్ని కాంగ్రెస్ కు చుట్టేసే ప‌నికి శ్రీకారం చుట్టేసింది. అమ‌లులో కూడా పెట్టేసింది.

గతంలో కాంగ్రెస్‌హ‌యాంలో ఉత్తరాఖండ్‌లో చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులపై దివంగత కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌ లోక్‌సభలో చేసిన ఓ ప్రసంగం ఇప్పుడుబీజేపీ నేత‌లు తెర‌మీదికి తెచ్చారు. 2013 జూన్‌లో ఉత్తరాఖండ్‌ లోని కేదార్‌నాథ్‌ లో భీకర వరదలు సంభవించి అనేక మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

అప్పట్లో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీజేపీ.. ఆ ఏడాది సెప్టెంబరులో జరిగిన పార్లమెంట్‌ సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తింది. ఆ సమయంలో సుష్మా స్వరాజ్‌ ప్రసంగిస్తూ.. ''ఉత్తరాఖండ్‌లో అభివృద్ధి పేరుతో ప్రకృతి, పర్యావరణంపై విపరీతమైన దాడులు జరుగుతున్నాయి.

దాని ఫలితమే కేదార్‌నాథ్ వరదలు. మనం ఎవరి కోసం అభివృద్ధి చేస్తున్నాం? ఎవరి కోసం మిలియన్‌-బిలియన్‌ డాలర్లు ఖర్చు చేస్తున్నాం? వీటి కారణంగా ఏదో ఒక రోజు ప్రకృతి ఉగ్రరూపం దాల్చి.. ప్రతిదాన్నీ నాశనం చేస్తుంది.

ఈ విలయం తర్వాత కూడా మనం కళ్లు తెరవకపోతే.. ఇంకెప్పుడు గ్రహిస్తాం?'' అని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. అంటే.. ప్ర‌స్తుత పాపం త‌మ‌ది కాద‌ని.. కాంగ్రెస్‌దేనని చెప్ప‌డం బీజేపీ ప్ర‌ధాన ఉద్దేశం. అయితే.. గ‌త ఎనిమిదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న‌ది బీజేపీనే.. ఉత్త‌రాఖండ్‌లోనూ రెండేళ్ల‌కుపైగా బీజేపీనే పాలిస్తోంది. మ‌రి ఈ స‌మ‌యంలో ఏం చేసిన‌ట్టు అనేది మాత్రం మిలియ‌న్‌డాల‌ర్ల ప్ర‌శ్న‌. ఇదీ.. సంగ‌తి.. మోడీ రాజ‌కీయం అంటే ఇలానే ఉంటుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.