Begin typing your search above and press return to search.

మోదీకి ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ తెలియ‌ద‌ట‌!

By:  Tupaki Desk   |   2 Jan 2019 8:51 AM GMT
మోదీకి ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ తెలియ‌ద‌ట‌!
X
సార్వ‌త్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ దేశ‌మంత‌టా పొత్తులు - కూట‌ముల చ‌ర్చ న‌డుస్తోంది. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు వ్య‌తిరేకంగా కాంగ్రెస్ బ‌లీయ కూట‌మిని త‌యారు చేసేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ఆ పార్టీకి టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు కూడా తోడ‌య్యారు. కేంద్రంలో బీజేపీని గ‌ద్దె దించేందుకు స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతున్నారు.

మ‌రోవైపు టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ - బీజేపీయేత‌ర ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కోసం కృషిచేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం తెచ్చిన జోష్ తో ఫ్రంట్ ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేశారు. ఇటీవ‌లే ఒడిశా ముఖ్య‌మంత్రి - బిజూ జ‌న‌తాద‌ళ్ అధినేత న‌వీన్ ప‌ట్నాయ‌క్‌, ప‌శ్చిమ బెంగాల్ సీఎం - తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీల‌తో ఆయ‌న‌ భేటీ అయ్యారు. స‌మాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాద‌వ్‌, బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ అధ్య‌క్షురాలు మాయావ‌తిని క‌లిసేందుకు కూడ ప్ర‌య‌త్నించారు. దీంతో ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటుపై జాతీయ మీడియాలోనూ ప్ర‌ముఖంగా వార్త‌లొచ్చాయి.

కేసీఆర్ ఫ్రంట్ పై దేశ‌వ్యాప్తంగా ఇంత చ‌ర్చ జ‌రుగుతున్నా.. దాని గురించి ప్ర‌ధాని నరేంద్ర మోదీకి మాత్రం తెలియ‌నే తెలియ‌ద‌ట‌! అస‌లు కాంగ్రెస్ - బీజేపీ లేని ఫ్రంట్ కోసం కేసీఆర్ ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లే త‌న‌కు తెలియ‌ద‌ని నూత‌న సంవ‌త్స‌రం తొలి రోజున మోదీ ఓ వార్త‌సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో తెలిపారు. మోదీ ఆదేశాల మేర‌కే ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం కేసీఆర్ ప్ర‌య‌త్నిస్తున్నారంటూ చంద్ర‌బాబు నాయుడు చేసిన ఆరోప‌ణ‌ల‌ పై స్పంద‌న కోర‌గా ప్ర‌ధాని ఈ మేర‌కు వ్యాఖ్యానించారు. కేసీఆర్ పై చంద్ర‌బాబు నిరాధార ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని కూడా మోదీ విమ‌ర్శించారు. తెలంగాణ‌ పై బాబుకు క‌క్ష ఉంద‌ని, రాష్ట్రంపై ప్ర‌తీకారం తీర్చుకునేందుకు ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబుకు చావుదెబ్బ త‌గిలింద‌ని పేర్కొన్నారు. బీజేపీకి వ్య‌తిరేకంగా చంద్ర‌బాబు కూడ‌గ‌డుతున్న కూట‌మికి ఎలాంటి ప్రాధాన్య‌త లేద‌ని అన్నారు. అలాంటి రాజ‌కీయాల‌ను ప్ర‌జ‌లే తిప్పికొడ‌తార‌ని పేర్కొన్నారు.

మిగ‌తా మాట‌లెలా ఉన్నా.. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ గురించి త‌న‌కు ఏమాత్రం తెలియ‌ద‌ని మోదీ చెప్ప‌డం ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. కావాల‌నే మోదీ అలా చెప్పార‌ని.. ఆయ‌న మాట‌లు చూస్తుంటే కేసీఆర్ తో బీజేపీ అంత‌ర్గ‌త పొత్తు వాస్త‌వ‌మేన‌ని తేలుతోంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. లేదంటే జాతీయ స్థాయిలో ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పై విస్తృత చ‌ర్చ జ‌రుగుతుంటే ప్ర‌ధాని స్థాయి వ్య‌క్తి త‌న‌కేమీ తెలియ‌ద‌ని చెప్ప‌డ‌మేంట‌ని అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు.