Begin typing your search above and press return to search.

కశ్మీర్ ఫైల్స్ తరహా సినిమా రావాలి సరే.. ఆ నరమేధానికి మీరేం చేస్తారు మోడీజీ?

By:  Tupaki Desk   |   16 March 2022 6:30 AM GMT
కశ్మీర్ ఫైల్స్ తరహా సినిమా రావాలి సరే.. ఆ నరమేధానికి మీరేం చేస్తారు మోడీజీ?
X
దారుణమైన తప్పు జరిగింది. ఘోరమైన నరమేధం చోటుచేసుకుంది. ప్రజాస్వామ్య భారతంలో ఇలాంటిది ఒకటి జరిగిందా? అన్న విషయం చాలామంది ప్రజలకు తెలీకపోవటమే కాదు.. ఏపీకి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసి రిటైర్ అయిన ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి సైతం.. విస్మయం వ్యక్తం చేయటమే కాదు.. ఈ సినిమా చూశాక వాస్తవాలు బయటకు రాని వైనంపై తన ఆక్రోశాన్ని వ్యక్తం చేశారు.

ఆయన ఒక్కరే కాదు.. కశ్మీర్ ఫైల్స్ చూస్తున్న వేలాదిమంది నోటి వినిపిస్తున్న మాట ఒక్కటే.. జరిగింది సరే.. వారికి సాయం మాటేంటి? దోషులకు శిక్ష సంగతేంటి? అన్నదిప్పుడు ప్రశ్న.

జరిగిన పరిణామాలకు బాధ్యులు ఎవరన్న దాన్ని రాజకీయం చేసి.. రాజకీయ లబ్థి పొందే కన్నా.. దారుణమైన నేరాలకు పాల్పడిన వారికి తగిన శిక్షలు విధించాల్సిన అవసరం ఉంది కదా? ఒక విదేశీ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కశ్మీర్ నాయకుడు ఒకడు.. తాను పాతిక మంది వరకు చంపేసినట్లుగా చెప్పినప్పుడు.. దాన్ని ప్రాథమిక ఆధారంగా ఎందుకు తీసుకోకూడదు. చట్టం తన పని తాను చేసుకుపోవాలి కదా? గతంలో జరిగిన ఒక దారుణం కాస్త ఆలస్యంగా ప్రపంచానికి తెలిసి.. దాని మీద స్పందిస్తున్న వేళ.. ఇప్పుడున్న ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి కదా?

కశ్మీర్ ఫైల్స్ సినిమాతో వాస్తవాలు వెలుగు చూశాయని దేశ ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించటమే కాదు.. ఈ తరహా సినిమాలు మరిన్ని రావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. నాటి అకృత్యాలను కళ్లకు కట్టేలా చిత్రీకరించిన చిత్ర యూనిట్ ను ఆయన ప్రశంసించారు. సరే.. ఇదంతా ఓకే. దేశ ప్రధానిగా ఉన్న మోడీ నోటి నుంచే ఇంత మాట వచ్చిన తర్వాత.. సర్వాధికారాలు ఉన్న ఆయన.. నాటి మారణహోమానికి సంబంధించిన చర్యలు ఇప్పుడెందుకు తీసుకోరు?

అదే జరిగితే.. ఈ దేశంలో తప్పు జరిగితే.. ఒకప్పుడు కాకున్నా మరో సమయంలో అయినా సరే.. తప్పు చేసినోడికి శిక్ష పడుతుందన్న సందేశాన్ని మోడీ సర్కారు ఇవ్వాలి కదా? ఈ తరహా సినిమాలు మరిన్ని రావాలన్నఆకాంక్షను తప్పు పట్టలేం.

అదే సమయంలో నాటి దారుణాలకు కారణమైన వారి మీద చట్టపరమైన చర్యలు ఇప్పటికైనా షురూ చేయటం.. కశ్మీరీ పండిట్లకు న్యాయం జరిగేలా చేయటం.. వారి స్వప్నమైన వారి ప్రాంతంలో వారు జీవించే హక్కును కల్పించే దిశగా చర్యల్ని ముమ్మరం చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే.. కశ్మీర్ పండిట్లకు న్యాయం జరిగినట్లు.