Begin typing your search above and press return to search.

‘‘మోడీ కో మారో’’ అని వాళ్లు అంటున్నారా?

By:  Tupaki Desk   |   22 Feb 2016 4:16 AM GMT
‘‘మోడీ కో మారో’’ అని వాళ్లు అంటున్నారా?
X
ప్రధాని మోడీ నోట సంచలన వ్యాఖ్యలు వచ్చాయి. తనపై కుట్ర జరుగుతుందని.. తన ప్రభుత్వాన్ని పడేయాలన్న ఆలోచనతో కొందరు పావులు కదుపుతున్న విషయాన్ని ఆయన స్వయంగా ప్రకటించటం గమనార్హం. తాను అనుసరిస్తున్న విధానాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కొన్ని వర్గాలు తన సర్కారును పడేయాలన్న ప్రయత్నాలు చేస్తున్నారని.. తాను అలాంటి వాటికి లొంగనని చెప్పుకొచ్చారు. సాధారణంగా దేశ ప్రధాని స్థాయి వ్యక్తి నోటి నుంచి రాని కొన్ని మాటలు తాజాగా మోడీ నోటి నుంచి రావటం గమనార్హం.

సహజంగా ఏదైనా ప్రభుత్వాన్ని కూల్చాలని రాజకీయ పార్టీలు పావులు కదుపుతుంటాయి. అయితే.. మోడీ సర్కారును కూల్చేందుకు రాజకీయ పార్టీలు కాకుండా.. కొన్ని స్వచ్ఛంద సంస్థలు.. బ్లాక్ మార్కెట్ వర్గాల వారు కుట్రలు పన్నుతున్నారంటూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఒక చాయ్ వాలా ప్రధాని కావటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారంటూ మండిపడ్డారు.

ఒడిసాలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన ఆయన.. ఈ సందర్భంగా సభకు వచ్చిన రైతుల్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. తనపై కొందరు దాడి చేయటానికి నిరంతరం ప్రయత్నిస్తున్నారని.. ఒక చాయ్ వాలా ప్రధాని కావటాన్ని సహించలేకపోతున్నారంటూ మండిపడ్డారు. ఇక.. మోడీ సర్కారును కూల్చివేస్తున్న వారు ఎవరన్న విషయాన్ని మోడీ వెల్లడిస్తూ.. ‘‘విదేశాల నుంచి స్వచ్ఛంద సంస్థలు విరాళాలు తీసుకొస్తున్నాయి. వాటి జమాలెక్కల్ని మా ప్రభుత్వం అడిగింది. మమ్మల్నే లెక్కలు అడుగుతావా? అంటూ మోడీ కో మారో.. మోడీ కో మారో అని కేకలు వేస్తున్నారు. వేపగుజ్జు పూసిన యూరియాను రైతులకు అందుబాటులోకి ఉంచాలని నిర్ణయించాం. రైతుల్ని దోపిడీ చేస్తున్న రసాయన కర్మాగారాలు నా చర్యల్ని సహిస్తాయా? అందుకే వారు నా ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర పన్నుతున్నారు’’ అంటూ సూటిగా విషయాన్ని చెప్పేశారు.

ప్రజలు తనకు అప్పగించిన బాధ్యత నుంచి తాను వైదొలగనని.. దేశాన్ని దోచుకోవటాన్ని.. నాశనం చేయటాన్ని తాను అనుమతించనని వ్యాఖ్యానించారు. ప్రధాని స్థాయి వ్యక్తి తనపై కుట్ర జరుగుతుందని ఓపెన్ గా చెబుతున్న నేపథ్యంలో.. రసాయన ఎరువుల కంపెనీలు..ఎన్జీవోలు అంత పవర్ ఫుల్లా అన్న సందేహం రాక మానదు. ఇంతకీ.. మోడీ మీద కుట్ర చేస్తున్న ఆ కంపెనీలు.. ఆ ఎన్జీవోలు ఎవరంటారు?