Begin typing your search above and press return to search.

మోడీ ఈ నిర్ణయం ఎప్పుడు తీసుకున్నారంటే...!

By:  Tupaki Desk   |   9 Nov 2016 11:58 AM GMT
మోడీ ఈ నిర్ణయం ఎప్పుడు తీసుకున్నారంటే...!
X
నవంబ‌ర్ 8 - మంగ‌ళ‌వారం రాత్రి... ఈ రోజును భార‌తీయులు ఎవ్వ‌రూ మ‌ర‌చిపోలేరు! ఎందుకంటే, చెలామ‌ణిలో ఉన్న రూ. 500 - రూ. 1000 నోట్ల‌ను ర‌ద్దు చేస్తూ ప్ర‌ధాన‌మంత్రి మోడీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. న‌ల్ల‌ధ‌నంపై పోరాటంలో భాగంగా ఈ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే, తాత్కాలికంగా సామాన్యులు కొంత గంద‌ర‌గోళానికి గురౌతున్నారు. కానీ, దీర్ఘ‌కాలంలో దేశ‌ప్ర‌యోజ‌నాల‌కు ఈ నిర్ణ‌యం గ‌ట్టి పునాది అని చెప్పుకోవ‌చ్చు. అయితే, ఇక్క‌డ గ‌మ‌నించాల్సింది... ఇంత భారీ నిర్ణ‌యం వెన‌క, అంత‌కుమించిన భారీ క‌స‌ర‌త్తే ఉంటుంది క‌దా! ఇదేదో ఒక రాత్రిలోనో ఒక‌రోజులోనో జ‌రిగిపోయేదీ కాదు క‌దా! ప్ర‌ధాన‌మంత్రి ఒక్క‌రే కూర్చుని డిసైడ్ చేసేదీ కాదు క‌దా! ఎన్నో చ‌ర్చోప‌చర్చ‌లు - ఎన్నో మేథోమ‌థ‌నాల అనంత‌రం మోడీ వెల్ల‌డించిన నిర్ణ‌యం ఇది. అయితే, ఇంత భారీ నిర్ణ‌యానికి సంబంధించి చిన్న వార్త‌ కూడా లీక్ కాకుండా జాగ్ర‌త్తప‌డ్డ తీరును ప్ర‌శంసించాలి.

ఈ క‌రెన్సీ నోట్లు త్వ‌ర‌లో ర‌ద్దు అవుతాయ‌న్న సూచ‌న‌లు కూడా ఎక్క‌డా రాలేదు. క‌నీసం ఓ గాసిప్ గా కూడా మీడియాలో సింగిల్ కాల‌మ్ వార్త క‌నిపించ‌లేదు. ఈ భారీ నిర్ణ‌యం వెన‌క దాదాపు ఆర్నెల్లు క‌స‌ర‌త్తు ఉందని ఇప్పుడు తెలుస్తోంది. న‌ల్ల‌ధ‌నం అరిక‌ట్ట‌డం కోసం క‌ఠిన‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆర్నెల్ల కింద‌టే ప్ర‌ధాని మోడీ డిసైడ్ చేసుకున్నార‌ట‌. దాన్లో భాగంగానే మోడీ - రిజ‌ర్వ్ బ్యాంక్ కీలక సిబ్బంది ఓ పక్కా వ్యూహాన్ని ఖ‌రారు చేసుకున్నార‌ని, దాన్ని చాలా జాగ్ర‌త్త‌గా అమ‌లు చేసుకుంటూ వ‌చ్చార‌నీ, స‌మాచారం బ‌య‌ట‌కి పొక్క‌నీయకుండా క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకున్నార‌ని తెలుస్తోంది. బ్లాక్ మ‌నీపై పోరాటంలో తొలిద‌శ‌గా స్వ‌చ్ఛందంగా న‌ల్ల‌ధ‌న ప్ర‌క‌ట‌న ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. ప్ర‌స్తుత నిర్ణ‌యం త‌రువాతి ద‌శ‌గా చెప్పొచ్చు.

మూడు నెల‌ల కింద‌టే రూ. 2000 - రూ. 500 కొత్త నోట్ల ముద్ర‌ణ కూడా జ‌రిగిపోయింద‌ట‌! అయితే, ప్ర‌స్తుతం రూ. 500 - రూ. 1000 నోట్ల‌ను ర‌ద్దు చేయ‌డానికి ఆర్బీఐ కూడా ముందస్తుగానే కొన్ని వ్యూహాలు అనుస‌రించింది. కొద్ది రోజుల కింద‌టే బ్యాంకుల్లో రూ. 100 నోట్ల స‌ర‌ఫ‌రా పెంచాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే, రూ. 100 నోట్ల విష‌యంలో దొంగ నోట్లపై కూడా క‌న్నేసి ఉంచాల‌ని కూడా ఆదేశించింది. పెద్ద నోట్ల‌ను ఒకేసారి ఉప‌సంహ‌రించుకుంటే దేశంలో క‌రెన్సీ స‌ర్దుబాటుకు ఎలాంటి ఇబ్బంది ఉండ‌కూడ‌ద‌న్న ముందుచూపుతోనే ఇలాంటి ఆదేశాలు ఇచ్చింద‌ని చెప్పుకోవాలి.

మొత్తానికి - నవంబ‌ర్ 8 ప్ర‌క‌ట‌న వెన‌క ఆర్నెల్ల క‌ర‌స‌త్తు ఉంద‌న్న‌మాట‌. అయితే, ఇంత జ‌రుగుతున్నా ఈ విష‌యం స‌హ‌చ‌రుల‌కుగానీ - క్యాబినెట్ లో కీల‌క మంత్రుల‌కుగానీ - ప్ర‌ముఖ బ్యాంక‌ర్ల‌కుగానీ - పారిశ్రామికవేత్త‌ల‌కు కూడా తెలియ‌నీయ‌కుండా ప్ర‌ధాని తీసుకున్న జాగ్ర‌త్త‌ల్ని మెచ్చుకోవాల్సిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/