Begin typing your search above and press return to search.

మోడీ ఓటమి అసాధ్యం కాదు:పీకే

By:  Tupaki Desk   |   13 Dec 2021 4:30 PM GMT
మోడీ ఓటమి అసాధ్యం కాదు:పీకే
X
2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని దేశంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు కావాలన్న ప్రచారం జోరందుకున్న సంగతి తెలిసిందే. బలమైన బీజేపీని ఢీకొట్టాలంటే కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ ఏకం కావాలని రాజకీయ విశ్లేషకులు పిలుపునిస్తున్నారు. ఇక, దేశంలో యూపీఏ ఎక్కడుందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు కాక రేపాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పై మరోసారి ఎన్నికల వ్యూహకర్త, ఐ ప్యాక్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ పార్టీకి బలమైన శాశ్వత అధ్యక్షుడు కావాలని, గాంధీ కుటుంబం తక్షణమే అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటే తప్ప పార్టీ బ్రతకదని పీకే షాకింగ్ కామెంట్లు చేశారు. క్యాండిల్ మార్చ్, ట్వీట్లతో బీజేపీని కాంగ్రెస్ ఓడించలేదని రాహుల్ గాంధీకి చురకలంటించారు. ఇటీవల జరిగిన ఏ ఎన్నికలోనూ కాంగ్రెస్ గట్టి పోటీ ఇవ్వలేకపోతోందని, సమైక్య ప్రతిపక్షం, వేగంగా ప్రతిస్పందించే పార్టీ యంత్రాంగం ఉంటే 2024 ఎన్నికల్లో బీజేపీని గట్టిగా ఎదుర్కోవచ్చని వెల్లడించారు. బీజేపీకి కాంగ్రెస్‌ ఏకైక ప్రతిపక్షం కానే కాదన్నారు.

ఒంటరిగా పోటీ పడితే బీజేపీని కాంగ్రెస్ ఓడించలేదని, ఆ పార్టీ లేకుండానే ప్రతిపక్షాలు కూటమిని ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న పశ్చిమ బెంగాల్‌, ఒడిశా, ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళలో 200 ఎంపీ సీట్లకు బీజేపీ 47 మాత్రమే దక్కించుకుందని గుర్తు చేశారు. కాంగ్రెస్ నేతలు పార్టీని కాపాడుకోవాలంటే ప్రజాస్వామ్యయుతంగా అధ్యక్షుడిని ఎన్నుకోవాలని పీకే అన్నారు.1984 తర్వాత కాంగ్రెస్‌ ఒంటరిగా దేశంలో ఒక్క సార్వత్రిక ఎన్నికల్లోనూ గెలవలేదన్నారు.