Begin typing your search above and press return to search.

మోడీజీ ఈ ఏడు రాష్ర్టాలు ఏం పాపం చేశాయి?

By:  Tupaki Desk   |   3 Sep 2017 12:31 PM GMT
మోడీజీ ఈ ఏడు రాష్ర్టాలు ఏం పాపం చేశాయి?
X
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ విష‌యంలో ఏడు రాష్ర్టాలు గుర్రుగా ఉన్నాయనే చ‌ర్చ జ‌రుగుతోంది. మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ సందర్భంగా మోడీ వ్య‌వ‌హ‌రించిన తీరే ఇందుకు నిద‌ర్శ‌నం కావ‌డం గ‌మ‌నార్హం. ఇలా గుర్రుగా ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ కూడా ఒక‌టి కావ‌డం గ‌మ‌నార్హం.కేంద్ర కేబినెట్ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ త‌ర్వాత ఇప్పుడు మొత్తం మంత్రుల సంఖ్య 75 (మోడీ కాకుండా)కి చేరింది. దేశంలో అత్య‌ధిక జ‌నాభా ఉన్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ కు కేబినెట్‌ లోనూ పెద్ద పీటే వేశారు.అయితే ఏడు రాష్ట్రాల‌కు కూడా కేబినెట్‌ లో చోటు ద‌క్క‌లేదు. వీటిలో ఈశాన్య రాష్ట్రాలే ఎక్కువ‌. అయితే చిత్రంగా పెద్ద రాష్ట్రాల విష‌యానికి వ‌స్తే తెలంగాణ మాత్ర‌మే ఈ జాబితాలో ఉంది.

తెలంగాణ‌కు మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌ విష‌యంలో మోడీ మొండిచేయి చూపారు. 75 మంది మంత్రులున్న భారీ కేబినెట్‌లో తెలంగాణ నుంచి ఒక్కరికి కూడా అవ‌కాశం ద‌క్క‌లేదు. ఇప్ప‌టివ‌ర‌కు ఉన్న ద‌త్తాత్రేయ‌ను కూడా రాజీనామా చేయించిన విష‌యం తెలిసిందే. అయితే తెలంగాణ పొరుగున ఉన్న‌ రాష్ట్రమై ఏపీ నుంచి ముగ్గురికి అవ‌కాశం ద‌క్కింది. టీడీపీకి చెందిన అశోక గ‌జ‌ప‌తి రాజు - సుజ‌నా చౌద‌రితోపాటు ఇక్క‌డి నుంచే రాజ్య‌స‌భ‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న సురేశ్ ప్ర‌భు కూడా కేబినెట్‌ లో ఉన్నారు.

ఇక యూపీకి ప్ర‌ధాని మోడీ అధిక‌ ప్రాధాన్యం ఇచ్చారు. గ‌త లోక్‌ స‌భ ఎన్నిక‌ల్లో మొత్తం 80 స్థానాల‌కుగాను 71 గెలిచింది బీజేపీ. అంతేకాదు ఈ మ‌ధ్యే రాష్ట్రంలోనూ అధికారంలోకి వ‌చ్చింది. దీంతో యూపీ నుంచి ఎక్కువ మందికి కేబినెట్‌లో అవ‌కాశం ఇచ్చారు. మొత్తం 12 మంది యూపీ మంత్రులు కేంద్ర కేబినెట్‌ లో ఉన్నారు. ప్ర‌ధాని మోడీ కూడా వార‌ణాసి నుంచే ప్రాతినిధ్యం వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. ఇక బీహార్ నుంచి 8 మంది స్థానం సంపాదించ‌డం గ‌మనార్హం. గుజ‌రాత్‌ - రాజ‌స్థాన్‌ ల నుంచి చెరో ఆరుగురికి కేబినెట్‌ లో స్థానం ద‌క్కింది. ఈ మంత్రివ‌ర్గంలో 57 మంది లోక్‌ స‌భ స‌భ్యులు కాగా.. రాజ్య‌స‌భ నుంచి 18 మంది మాత్ర‌మే ఉన్నారు. మొత్తం 75 మంది మంత్రుల్లో 27 మందికి కేబినెట్ హోదా, 11 మందికి స్వ‌తంత్ర హోదా ద‌క్క‌గా.. మిగిలిన 37 మంది స‌హాయ మంత్రులే.