Begin typing your search above and press return to search.

మిత్రులు ఇప్ప‌టికైనా క‌నిపిస్తారా మోడీ!

By:  Tupaki Desk   |   9 Nov 2015 8:52 AM GMT
మిత్రులు ఇప్ప‌టికైనా క‌నిపిస్తారా మోడీ!
X
విజ‌యం మ‌త్తుమందు లాంటిది. ఊపును.. ఉత్సాహాన్ని ఇచ్చేస్తుంది. ఆత్మ‌విశ్వాసాన్ని పెంచేస్తుంది. ఇన్ని మంచి ప‌నులు చేసే విజ‌యం.. త‌ల‌కెక్కితే మాత్రం స‌మ‌స్య‌లే. ఇప్పుడు అలాంటి స‌మ‌స్య‌ల్లోనే చిక్కుకున్నారు ప్ర‌ధాని మోడీ.. బీజేపీ జాతీయాధ్య‌క్షులు అమిత్ షా. ఎవ‌రూ ఊహించ‌నంత విజ‌యాన్ని సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో దేశ ప్ర‌జ‌లు క‌ట్ట‌బెట్ట‌టాన్ని వారు త‌ప్పుగా అర్థం చేసుకున్న‌ట్లు క‌నిపిస్తోంది.

త‌మ మీద ప్ర‌జ‌లు పెట్టిన న‌మ్మ‌కాన్ని బాధ్య‌త‌గా కంటే కూడా అదంతా త‌మ తెలివి వ‌ల్ల‌నే అన్న ధీమా పెరిగిపోయింది. ఈకార‌ణం చేత‌నే సార్వ‌త్రిక ఎన్నిక‌లకు ముందు స్నేహితుల కోసం అర్రులు జాచిన బీజేపీ.. ఘ‌న విజ‌యం త‌ర్వాత మిత్ర‌ధ‌ర్మాన్ని మ‌ర‌వ‌టం క‌నిపిస్తోంది. ఒక‌ప్పుడు బీజేపీతో జ‌త క‌ట్టేందుకు ఏ రాజ‌కీయ పార్టీ కూడా ఇష్ట‌ప‌డ‌ని స‌మ‌యంలో శివ‌సేన పార్టీకి ద‌న్నుగా నిలిచింది. కానీ.. అలాంటి శివ‌సేన‌తోనూ బీజేపీ అధినాయ‌క‌త్వం పేచీలు పెట్టుకుంది.

తాజాగా బీహార్ ఎన్నిక‌ల్లో అవ‌మాన‌క‌ర అప‌జ‌యాన్ని మూట‌గ‌ట్టుకున్నారు. ఇదంతా ఎందుకు.. మోడీ.. అమిత్ షాల అహంకారంతోనే అని చెప్ప‌క‌త‌ప్ప‌దు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల ముందు బీజేపీ త‌న పార్టీ ప్ర‌ధాని అభ్య‌ర్థిగా మోడీని ఎంపిక చేయ‌టాన్ని నితీశ్ వ్య‌తిరేకించారు. ఎన్డీయే నుంచి ప‌క్క‌కు త‌ప్పుకున్నారు. అయితే.. ఈ విష‌యాన్ని మోడీ వ్య‌క్తిగ‌త అంశంగా తీసుకున్నారే కానీ.. పెద్ద‌రికంగా తీసుకోలేదు.

దీర్ఘ‌కాలంగా మిత్రుడిగా ఉన్న వ్య‌క్తి త‌న బంధాన్ని తెంచుకొని బ‌య‌ట‌కు వెళ్లిపోతే.. విజ‌యం సాధించిన త‌ర్వాత అయినా ద‌గ్గ‌ర‌కు చేర్చి.. ఉన్న ఇబ్బందిని మాట్లాడి.. హుందాగా స్నేహ‌ హ‌స్తం చాస్తే ఈ రోజున మోడీ అండ్ కో అవ‌మానానికి గురి కావాల్సిన అవ‌స‌రం ఉండేది కాదేమో.

పార్టీకి కురువృద్ధుడు లాంటి అద్వానీని ప‌క్క‌న పెట్టేసి.. 89 ఏళ్ల వ‌య‌సులో అంతులేని అవ‌మానాలు మిగిలుస్తున్న మోడీ ప‌రివారానికి బీహారీ ప్ర‌జ‌లు బుద్ధి చెప్పారన్న మాట వినిపిస్తోంది కూడా.

మోడీ ఈ రోజు ఈ స్థాయిలో ఉండ‌టానికి అద్వానీ అండ‌దండ‌లే క‌దా. ఆయ‌న పెంచిన మొక్క ఈ రోజున త‌న‌ను ప‌క్క‌న ప‌డేయ‌టాన్ని ఎంత‌గా బాధ‌ప‌డుతున్నారో? అద్వానీ 89వ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆయ‌న ఇంటికి వెళ్లిన ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు చెప్పిన మోడీ.. అద్వానీ త‌న మార్గ‌నిర్దేశ‌కుడిగా పేర్కొన్నారు. ఆ మాట‌లే నిజ‌మైతే.. అద్వానీకి పార్టీలో కానీ.. ప్రభుత్వంలో కానీ కీల‌క‌స్థానం ఎందుకు ఇవ్వ‌లేదు. త‌న‌కు మార్గ‌నిర్దేశ‌కుడైన అద్వానీతో కూర్చొని బీహార్‌ లో నితీశ్ తో పార్టీ ప‌రంగా ఏం చేద్దామ‌ని అడిగితే ఏం చెప్పి ఉండేవారు? అన్న‌ప్ర‌శ్న వేసుకుంటే.. క‌చ్ఛితంగా మైత్రి కోసం ప్ర‌య‌త్నించేవారు.

నిజానికి నితీశ్ తో కానీ బీజేపీ జ‌త క‌ట్టి బీహార్ బ‌రిలో దిగితే ఎలా ఉండేది? బీహార్ సంగ‌తి ప‌క్క‌న పెడ‌దాం. మ‌హారాష్ట్రలో త‌న చిర‌కాల మిత్రుడు శివ‌సేన‌తో పేచీలేంది? క‌లిసి వ‌చ్చే స్నేహితుడితో క‌ల‌సి పైకి ఎద‌గాల‌నుకోవ‌టం ధ‌ర్మం. అంతేకానీ.. స్నేహ‌ హ‌స్తం అందిస్తూనే.. స్నేహితుడ్ని ముంచేయాల‌న్న ఆలోచ‌న దుర్మార్గం. అలాంటి ద‌రిద్ర‌పు వ్యూహాన్ని అటు మ‌హారాష్ట్రలోనూ.. ఇటు ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోనూ మోడీ ప‌రివారం అమ‌లు చేస్తోంది. ఈ కార‌ణంగానే శివ‌సేన చేత నానా మాట‌లు అనిపించుకుంటున్న ప‌రిస్థితి. సుదీర్ఘ కాలంపాటు మిత్రుడిని మెప్పించ‌లేని మోడీ అండ్ కో.. ప్ర‌జ‌ల్ని ఎలా మెప్పించ‌గ‌ల‌రు.

మ‌హారాష్ట్ర నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కు వ‌ద్దాం. చంద్ర‌బాబుతో మైత్రి స‌హ‌జం కాద‌న్న‌ది అంద‌రికి తెలిసిందే. అవ‌స‌రం కోసం జ‌త క‌లిసిన మిత్రుడికి అండ‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. ఏపీలో పార్టీ సొంతంగా ఎద‌గ‌డం సాధ్య‌మ‌య్యేది కాదు. కానీ.. ఆ వాస్త‌వాన్ని ఒప్పుకోవ‌టానికి ఏపీ క‌మ‌ల‌నాథులు సిద్ధంగా లేరు. బ‌ల‌మైన మిత్రుడి బ‌లాన్ని త‌న‌దిగా చెప్పుకోవ‌టానికి ఎందుకంత ఇబ్బందో అర్థం కానిది. భార‌త‌దేశం అంత‌టా తానే ఉండిపోవాల‌న్న లాంటి అత్యాశ‌ల నుంచి క‌మ‌ల‌నాథులు బ‌య‌ట‌కు వ‌స్తే మంచిది. ఎందుకంటే.. ఇంత పెద్ద దేశంలో అలాంటిది సాధ్యం కానిది. ఎన్నో మ‌తాలు.. మ‌రెన్నో కులాల స‌మాహార‌మైన దేశంలో ఒక్క‌డిగా ప‌ట్టు సాధించాల‌నుకోవ‌టం అవివేకం. దాని కంటే.. తోడు వ‌చ్చే స్నేహితుల‌తో సుదీర్ఘ‌కాలం పాటు అధికారాన్ని ఎలా నిలుపుకోవాల‌న్న అంశం మీద మోడీ అండ్ కో దృష్టి పెట్టాలే కానీ.. మిత్రుల్ని దెబ్బ తీసి.. వారిని తొక్కేసి.. ఎద‌గాల‌న్న దుర్మార్గ‌పు ఆలోచ‌న చేయ‌టం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌న్న విష‌యాన్ని బీజేపీ నేత‌లు గుర్తించాల్సిన స‌మ‌యం అసన్న‌మైంది.

ఏపీ వ‌ర‌కూ చూస్తే.. ఎన్నిక‌ల ముందు తానిచ్చిన హామీల్ని న‌మ్మి సీమాంధ్రులు త‌మ‌కు అధికారాన్ని కట్ట‌బెట్టార‌న్న విష‌యాన్ని మోడీ ప‌రివారం మ‌ర్చిపోవ‌టం త‌మ గొయ్యిని తాము త‌వ్వుకున్న‌ట్లే. త‌మ‌కు అన్యాయం చేసిన వారిని.. ద్రోహం త‌ల‌పెట్టిన వారిని సీమాంధ్రులు అంత తేలిగ్గా వ‌దిలిపెట్ట‌రు. ఆ విష‌యాన్ని ఇప్ప‌టికే సీమాంధ్రులు ప‌లుమార్లు స్ప‌ష్టం చేశారు కూడా. కానీ.. క‌మ‌ల‌నాథులు ఆ విష‌యాన్ని మ‌ర్చిపోతూ పెద్ద త‌ప్పే చేస్తున్నారు. విభ‌జ‌న కార‌ణంగా ప్ర‌త్యేక హోదా.. ప్యాకేజీ కోసం ఆశ‌గా ఎదురుచూస్తున్న వారికి ఎలాంటి తీపిక‌బురు చెప్ప‌కుండా బీహార్ కు రూ.1.1ల‌క్ష‌ల కోట్లు.. కాశ్శీర్ కు రూ.80వేల కోట్ల ప్యాకేజీ ప్ర‌క‌టించ‌టం ఏపీ ప్ర‌జ‌ల్ని మోసం చేసిన‌ట్లే. త‌మ రాజ‌కీయ స్వార్థం కోసం మిత్రుల్ని మోసం చేయ‌టం.. త‌మ‌ను న‌మ్మిన ప్ర‌జ‌ల‌కు రిక్త హ‌స్తం చూప‌టం లాంటివి భ‌విష్య‌త్తులోనూ కంటిన్యూ చేస్తే.. బీహార్‌ కు మించిన పెద్ద షాక్ లే తినాల్సి ఉంటుంద‌న్న విష‌యాన్ని మోడీ అండ్ కో గుర్తిస్తే మంచిది.