Begin typing your search above and press return to search.

సుష్మ లేని మోదీ కేబినెట్‌ ను చూడలేమంటున్న ట్విటర్ అభిమానులు

By:  Tupaki Desk   |   30 May 2019 4:59 PM GMT
సుష్మ లేని మోదీ కేబినెట్‌ ను చూడలేమంటున్న ట్విటర్ అభిమానులు
X
రెండో సారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన మోదీ కేబినెట్ లో ఈసారి సీనియర్ నేతలు కొందరు తప్పుకున్నారు. మోదీ గత ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన అరుణ్ జైట్లీ ఆరోగ్య కారణాలతో తప్పుకోగా.. విదేశాంగ మంత్రిగా పనిచేసిన సుష్మ కూడా ఆరోగ్య కారణాలతో మంత్రి పదవి వద్దనుకున్నారు. దీంతో ఆ ఇద్దరూ మోదీ తాజా కేబినెట్లో లేరు.

నిజానికి సుష్మ మొన్నటి ఎణ్నికల్లో కూడా పోటీ చేయలేదు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని ఆమె చాలా ముందుగానే ప్రకటించారు. అయితే ఆమెను రాజ్యసభ సభ్యురాలుగా ఎంపిక చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన టీంలో తప్పక చేర్చుకుంటారనే అంచనాలు బలంగానే వినిపించాయి. అయితే ఈ అంచనాలకు భిన్నంగా ప్రస్తుతానికి సుష్మా మాజీ కేంద్ర మంత్రుల జాబితాలోకి చేరిపోయారు. ముఖ్యంగా ప్రమాణ స్వీకారోత్సవంలో తేనిటీ విందుకు గైర్హాజరైన సుష్మా ప్రేక్షకుల వరుసలో జైట్లీ భార్య పక్కన ఆసీనులయ్యారు. దీంతో ఆమెకు మోదీ టీంలో స్థానం లేదని అందరూ ధృవీకరించుకున్నారు. దీంతో ట్విటర్ లో ఆమె అభిమానులు నిరాశపడ్డారు.

ట్విటర్ లో యాక్టివ్‌ గా ఉంటూ ఎన్నో సమస్యలను ట్విటర్ ద్వారా పరిష్కరించిన సుష్మకు ట్విటర్ లో భారీ ఫాలోయింగ్ ఉంది. దీంతో వియ్‌ మిస్‌ యూ మేమ్‌ అంటూ చాలామంది అక్కడ తమ బాధను వ్యక్తంచేశారు. ఇది ఎన్ ఆర్ ఐలకు తీరని లోటని మరొక యూజర్‌ ట్వీట్‌ చేశారు. కాగా 2016 డిసెంబరులో సుష్మా స్వరాజ్‌ కు మూత్రపిండ మార్పిడి చికిత్స జరిగినప్పటి నుంచి ఆమె ఆరోగ్యం సరిగా లేదు. అయినప్పటికీ చికిత్స పొందుతూనే ఆమె మంత్రిగా కొనసాగారు. ఇప్పుడు మళ్లీ మంత్రి పదవిలో ఉంటే ఆ ఒత్తిడి వల్ల ఆరోగ్యం మరింత క్షీణిస్తుందన్న ఉద్దేశంతో ఆమె స్వయంగా తప్పుకొన్నారు.