Begin typing your search above and press return to search.

మోడీ దిష్టబొమ్మల దగ్ధాలు.. పార్లమెంట్ లోనూ సెగ.. టీఆర్ఎస్, కాంగ్రెస్ పోరుబాట

By:  Tupaki Desk   |   9 Feb 2022 9:30 AM GMT
మోడీ దిష్టబొమ్మల దగ్ధాలు.. పార్లమెంట్ లోనూ సెగ.. టీఆర్ఎస్, కాంగ్రెస్ పోరుబాట
X
పార్లమెంట్ లో ప్రధాని నరేంద్రమోడీ చేసిన ప్రసంగం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చిచ్చు రేపుతోంది. తెలంగాణ, ఏపీ విభజన లొల్లిని ప్రస్తావించి కాంగ్రెస్ ను కడిగేసిన మోడీ తీరుపై టీఆర్ఎస్, కాంగ్రెస్ లు భగ్గుమన్నాయి. రెండోరోజూ దాని తీవ్రత తగ్గలేదు.

పార్లమెంట్ లో కాంగ్రెస్ ను తిట్టిన మోడీపై ఆ పార్టీ నిరసన ప్రదర్శనలు షురూ చేసింది. ఇఫ్పుడు దానికి పోటీగా తెలంగాణలో అధికార టీఆర్ఎస్ రంగంలోకి దిగింది. హైదరాబాద్ సహా పలు చోట్ల మోడీ దిష్టిబొమ్మలను దహనం చేసింది. అటు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనూ టీఆర్ఎస్ సభ్యులు తమ నిరసన గళాన్ని వినిపించారు.

దేశాన్ని విభజించి పాలించేలా కాంగ్రెస్ వ్యవహరించిందని.. ఇది వారి డీఎన్ఏ అని ఏపీ విభజనను మోడీ ప్రస్తావించారు. తుక్డే తుక్డే గ్యాంగ్ కు కాంగ్రెస్ నాయకత్వాన్ని వహిస్తోందని మండిపడ్డారు. తెలంగాణ విభజన అశాస్త్రీయంగా జరిగిందని మోడీ పేర్కొనడంతో టీఆర్ఎస్ భగ్గుమంది. కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రత్యేక తెలంగాణ ఇచ్చిందని మోడీ అనడం చిచ్చు రేపింది. అందుకే తెలంగాణ ప్రజలు కూడా కాంగ్రెస్ కు ఓటు వేసి గెలిపించలేదని అనడంతో టీఆర్ఎస్, కాంగ్రెస్ లు పోరుబాటపట్టాయి.

ప్రధాని మోడీ చేసిన ఈ వ్యాఖ్యలను టీపీసీసీ చీఫ్, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తప్పుపట్టారు. మోడీ ఈ దేశానికి ప్రధానమంత్రినన్న విషయాన్ని మరిచిపోయాడని.. తాను ఇంకా గుజరాత్ సీఎంననే అనుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఒక దేశాన్ని పరిపాలిస్తున్న ప్రధానమంత్రి స్థాయి నాయకుడు మాట్లాడాల్సిన మాటలు కావని రేవంత్ రెడ్డి అన్నారు.

ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో నరేంద్రమోడీ దిష్టబొమ్మలను దగ్ధం చేయాలని పిలుపునిచ్చింది. ఇక ఈరోజు టీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. మోడీ దిష్టిబొమ్మలను టీఆర్ఎస్ నేతలు దగ్ధం చేశారు.

పార్లమెంట్ ఆవరణలోనూ టీఆర్ఎస్ ఎంపీలు నిరసన తెలిపారు. జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట భైఠాయించారు. మోడీ, బీజేపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కోట్లాడి తెలంగాణ సాదించామని.. శాస్త్రీయంగానే విభజన జరిగిందని మోడీపై విమర్శలు గుప్పించారు.