Begin typing your search above and press return to search.

మోడీ ఎమోషన్ : అమ్మకు ప్రేమతో...

By:  Tupaki Desk   |   18 Jun 2022 1:30 PM GMT
మోడీ ఎమోషన్ :  అమ్మకు ప్రేమతో...
X
ఆయన దేశానికి ధీటైన ప్రధాని, ఎదురులేని నాయకుడు. మిన్ను విరిగి మీద పడినా తొణకని బెణకని తత్వం ఆయన సొంతం. ఒక చాయ్ అమ్ముకునే కుటుంబానికి చెందిన అతి సామాన్యుడు ఈ దేశానికి బలమైన నాయకుడిగా ఎదిగారు అంటే అది మోడీ గొప్పతనమే కాదు ఆయన కుటుంబానిది కూడా. మోడీకి సెంటిమెంట్లు లేవు. కుటుంబ బంధాలు తెలియవు అని ప్రత్యర్ధులు తరచూ ఆరోపణలు చేస్తూంటారు.

అలాంటి వారికి జవాబుగా తన తల్లి హీరాబా మోడీ వందవ పుట్టిన రోజు వేళ మోడీ తన మనసు విప్పి చెప్పారు. తల్లిని తలచుకుంటూ ఆయన భావోద్వేగం చెందారు. ఆయన తన బ్లాగ్ లో రాసిన పోస్టు మోడీ అంటే ఎవరు ఏమిటి అన్నది తేటతెల్లం చేసింది. తన జీవితంలో జరిగిన అన్ని సంఘటనలు తల్లితో తనకు ఉన్న అనుబంధం చెబుతూ మోడీ రాసుకొచ్చారు.

ఈ సందర్భంగా ఆయన ఒక మాట అన్నారు. ఇన్నాళ్ళూ తన తల్లి గురించి పెద్దగా చెప్పలేదని, ఇప్పటివరకు మీ జీవితం గురించి బహిరంగంగా,ఇంత సుదీర్ఘంగా రాసే సాహసం ఎప్పుడూ చేయలేదు అని అంటారు. దానిని బట్టి రెండు విషయాలు ఇక్కడ అర్ధం అవుతాయి. మోడీ ఎంత నిండు కుండగా ఉంటారో తల్లి కూడా అంతే. ఎక్కడా ప్రచారం కానీ తన ప్రసక్తి కానీ కోరుకోని అతి సాధారణ మహిళ ఆమె.

అందుకే మోడీ తన తల్లి హీరాబా మోడీ గురించి సరైన సందర్భం ఎంచుకుని మరీ తనలోని భావాలను లోకానికి చెప్పారు. తల్లితో తన అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. తాను యుక్త వయసులోనే దేశ సేవ కోసం ఇల్లు విడిచి వెళ్తున్నపుడు తండ్రికి ఇష్టం లేదని, కానీ తల్లి నచ్చచెప్పి తనను సాగనంపారని మోడీ పేర్కొన్నారు.

ఇక తాను దేశాలు పట్టి తిరుగుతున్న వేళ కూడా తల్లి తనకు చిన్నపుడు చెప్పిన ఎన్నో విషయాలు ఎపుడూ మదిలో ఉంటూ ప్రేరణగా నిలిచాయని చెప్పారు. తన తల్లి కడు పేదరికం లో నుంచి వచ్చారని చిన్నపుడే ఆమె తల్లిని కోల్పోయారని, ఆమె ఇంటికి పెద్ద కూతురుగా, ఇక మెట్టినింట పెద్ద కోడలిగా ఎంతో కీలకమైన పాత్రను పోషించారు అని మోడీ పేర్కొన్నారు.

తాము చిన్ననాట పేదరిం అనుభవించినా కష్టాలు పడినా అవేమీ మనసుకు తాకకుండా చూసుకున్న అమ్మ కంటే ఎవరూ లేరని ఆమె చెప్పుకున్నారు. తన తల్లి గురించి మాట్లాడినపుడు ఈ ప్రపంచంలో ఉన్న అందరు అమ్మలూ గుర్తుకువస్తారని కూడా ఆయన అనడం విశేషం.

ఇక తాను ఎంత గొప్పవాడిని అయినా దేశానికి ప్రధాని అయినా తల్లికి అవేమీ ముఖ్యం కాదని, నిజాయతీగా ఉంటూ పేదలకు సాయం చేయడమే ఆమె తన నుంచి ఎపుడూ కోరుకునేది అని మోడీ పేర్కొన్నారు. ఇక గుజరాత్ కి తాను తొలిసారి ముఖ్యమంత్రి అయినపుడు ప్రమాణ స్వీకారం వేళ తల్లి బహిరంగంగా తనతో ఒకసారి కనిపించారని, గత రెండు దశాబ్దాలుగా ఆమె ఎపుడూ తన వద్దకు రాలేదని ఆయన అన్నారు.

దేశ ప్రధానిగా తన చిరునామా ఢిల్లీకి మారినపుడు తాను తల్లిని ఎక్కువగా కలుసుకోవడం తగ్గిందని ఆయన బాధపడ్డారు. అయితే వీలున్నపుడల్లా తాను గుజరాత్ వెళ్ళి తల్లిని దర్శించుకుంటాను అని ఆయన చెప్పారు. ఇక తల్లి తనకు అడిగే మాట ఢిల్లీలో నీకు బాగుందా అనేనని మోడీ చెప్పారు.

తాను ఈ రోజు ఇలా ఉన్నాను అంటే తనకు సంస్కారం, జ్ఞానం, మేధస్సు, ధైర్యం పేదల పట్ల కరుణ, దేశం, దైవం పట్ల భక్తి అన్నీ తల్లి నుంచి వచ్చినవే అని మోడీ అన్నారు. తన తల్లి నిస్వార్ధపరురాలు అని, ఆమె ఎవరి నుంచి ఏమీ కోరుకోరని, ఆమె దైవాన్ని నమ్ముతారని, తాను దేశానికి ప్రధాని అయినా కూడా అది ఆ దేవుడు ఇచ్చిన అవకాశంగా మాత్రమే ఆమె చూస్తారు అని ఆయన పేర్కొన్నారు.

చిన్ననాడు తన తల్లికి తాను చేసిన సాయన్ని గుర్తు చేసుకున్న మోడీ అమ్మ ఏదీ సాయం చేయమని అడగదు, అయినా పిల్లలం అంతా ఆమెకు పనులలో ఎంతో కొంత తోడుగా నిలిచేవాళ్ళమని చెప్పారు. తన తల్లి దేవుడిని ప్రార్ధించినా సాధు సంతులను ఆదరించినా తన బిడ్డలు బాగా ఉండాలనే కోరుకునేవారని, తన గురించి ఏ రోజూ మొక్కని కనిపించే దైవం అమ్మ అని ఆయన పేర్కొన్నారు. అమ్మ మరింత కాలం ఆరోగ్యంగా ఉండాలని, ఆమె స్పూర్తి ఎప్పటికీ తనలో అలా ఉండాలని మోడీ బ్లగ్ లో రాసుకొచ్చారు.

మోడీ అమ్మకు ప్రేమతో రాసిన ఈ బ్లాగ్ లోని వివరాలు అన్నీ కూడా ఎప్పటికీ ఈ దేశంలోని యువతకు స్పూర్తిగానే ఉంటాయి. ఆయన అందులో రాసిన ప్రతీ అక్షరం యువతరం గుండెలలో పెట్టుకోవాల్సినవే అని వేరేగా చెప్పాల్సినది లేదు, చివరిగా ఒక్క మాట. దేశానికి రాజు అయినా ఆ తల్లికి కొడుకే. అందుకే మోడీ ఈ రోజు పసివాడుగా మారి అమ్మా అంటూ ఎంతో ప్రేమతో బ్లాగ్ లో రాశారు ఎంతో జీవితం చూసినా కూడా తనలోని పసివాడిని తట్టిలేపే తల్లిని ఆయన అలా చూస్తూ మురిసిపోయారు.