Begin typing your search above and press return to search.

కేసీఆర్ ప‌థ‌కాల గురించి మోడీ ఆరా?

By:  Tupaki Desk   |   10 Jan 2018 10:19 AM GMT
కేసీఆర్ ప‌థ‌కాల గురించి మోడీ ఆరా?
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గురించి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ప్ర‌త్యేకంగా ఆరాతీశారా? రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌ తో భేటీ సంద‌ర్భంగా కేసీఆర్ క‌ల‌ల ప్రాజెక్టు గురించి అడిగి తెలుసుకున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన‌ గవర్నర్ ఈఎస్‌ ఎల్ నరసింహన్ బిజీబిజీగా గడిపారు. రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్ - ప్రధాని నరేంద్రమోదీతోపాటు కేంద్ర హోంమంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ తో స‌మావేశ‌మ‌య్యారు. అంత‌ర్గ‌త సంభాష‌ణ‌ల తాలుకు అంశాలు ఒకింత ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చాయి.

వివిధ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ప్రధాని నరేంద్రమోడీతో దాదాపు 30 నిమిషాలపాటు గ‌వ‌ర్న‌ర్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రెండు రాష్ర్టాలకు చెందిన పలు అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. రెండు రాష్ర్టాల మధ్య పెండింగ్‌ లో ఉన్న పునర్విభజన సమస్యలు చాలావరకు సమసిపోయాయని ప్రధానికి గవర్నర్ వివరించారు. రెండు రాష్ర్టాల ముఖ్యమంత్రులు కే చంద్రశేఖర్‌ రావు - చంద్రబాబునాయుడు చాలా విషయాల్లో సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తూ పెండింగ్‌ లో ఉన్న సమస్యల పరిష్కారానికి చొరువచూపుతున్నారని తెలిపారు. ఇటీవల హైదరాబాద్ రాజ్‌ భవన్‌ లో రాష్ట్రపతి రామ్‌ నాథ్ కోవింద్‌ కు ఇచ్చిన విందు కార్యక్రమంలో ఇద్దరు ముఖ్యమంత్రులు పాల్గొని హైకోర్టు విభజన వంటి అంశాలపై సుహృద్భావ వాతావరణంలో చర్చించుకున్నారని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌ లో హైకోర్టు భవనాల ఏర్పాటుకు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయని, త్వరలోనే హైకోర్టు విభజన పూర్తికావడానికి అన్ని సానుకూల పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు పూర్తి అనుమతులు రావడం, ఆంధ్రప్రదేశ్‌ లో పోలవరం ప్రాజెక్ట్ పనులు వేగవంతం కావడం గురించి గ‌వ‌ర్న‌ర్ వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటలపాటు విద్యుత్ సరఫరాపై ప్రత్యేక ప్రస్తావన వచ్చినట్టు తెలిసింది. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన నిరంతర విద్యుత్ పథకం గురించి గవ‌ర్న‌ర్ వివ‌రించగా త‌మ‌కు స‌మాచారం ఉంద‌ని అన్న‌ట్లు స‌మాచారం. భూరికార్డుల ప్రక్షాళనపై కూడా ప్రధానికి వివరించినట్టు సమాచారం. దాదాపు 30 నిమిషాలపాటు జరిగిన ఈ సమావేశం సంతృప్తికరంగా ముగిసినట్టు స‌మాచారం.

కేంద్ర హోంమంత్రితో స‌మావేశం సంద‌ర్భంగా రెండు తెలుగు రాష్ర్టాల మధ్య సమస్యలు చాలా వరకు పరిష్కారమయ్యాయని, ఇద్దరు ముఖ్యమంత్రులు సుహృద్భావ ధోరణితో వ్యవహరిస్తున్నారని గ‌వ‌ర్న‌ర్‌ వివరించారు. హైకోర్టు విభజనకు సానుకూల పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలలో తాజా పరిస్థితుల గురించి చర్చించారు. కాగా తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరోపణలు కుటుంబంలో పిల్లల తగాదా వంటివని మీడియా ముందు తేలికగా కొట్టిపారేశారు.