Begin typing your search above and press return to search.

ఫైర్ బ్రాండ్లపై మోడీ పవర్ ఫుల్ అటాక్

By:  Tupaki Desk   |   21 Nov 2016 4:54 AM GMT
ఫైర్ బ్రాండ్లపై మోడీ పవర్ ఫుల్ అటాక్
X
తాను తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంపై ఫైర్ అవుతున్న ఫైర్ బ్రాండ్లపై ప్రధాని రివర్స్ అటాక్ షురూ చేశారు. నోట్ల రద్దుపై విపక్షాలన్నింటిని ఏకం చేస్తున్న కీలక నేతలపై ఫోకస్ చేసిన మోడీ.. ఒక్కొక్కరిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నేరుగా ఎవరి పేరును ప్రస్తావించనప్పటికీ.. వారి చర్యల్ని.. వారు చేసే తప్పుల్ని ప్రస్తావిస్తూ పరోక్షంగా మండిపడ్డారు. పెద్దనోట్ల రద్దుతో టికెట్లను అమ్ముకునే రాజకీయ పార్టీలకు షాక్ తగిలిందంటూ మండిపడ్డ ఆయన.. బీఎస్పీ అధినేత్రి మాయావతి.. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీపై తీవ్రంగా మండిపడ్డారు. పనిలో పనిగా కాంగ్రెస్ నూ మోడీ వదిలిపెట్టలేదు. ఒకవిధంగా చూస్తే.. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత.. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పై ఆయన పెద్దగా ఫోకస్ చేసినట్లుగా కనిపించకపోవటం గమనార్హం.

ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో ఏర్పాటు చేసిన సభలో మోడీ మాట్లాడారు. అగ్రాలో అందరికీ ఇల్లు అన్న పథకంలో భాగంగా మొదటి దశను లాంఛనంగా ప్రారంభించిన ఆయన.. 2022 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో నివసించే అందరికి ఇల్లు అనే కలను సాకారం చేయనున్నట్లుగా చెప్పిన మోడీ.. యూపీలో మరికొద్ది నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని తాజాగా ఈ సభతో షురూ చేసినట్లుగా కనిపించింది.

పెద్దనోట్లను రద్దు చేసిన నిర్ణయంతో.. ఆ డబ్బంతా ఎవరికి చెందుతుందని ప్రశ్నించిన ఆయన.. రద్దు చేసిన నోట్లు పేదలు.. నిజాయితీపరులకు దక్కుతాయన్నారు. పెద్దనోట్ల రద్దును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని పరోక్షంగా విమర్శించే క్రమంలో మోడీ ఆమెపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కోట్లాది రూపాయిల మొత్తాన్ని చిట్ ఫండ్ కుంభకోణాల వెనుక ఉన్న రాజకీయ నాయకులను రద్దు నిర్ణయం తీవ్రంగా కలిచివేస్తోందన్నారు. అందుకే వారు.. రాజకీయంగా వ్యతిరేక గళం విప్పుతున్నట్లుగా అభివర్ణించిన మోడీ.. ‘‘నాకు వ్యతిరేకంగా గళం విప్పుతున్న వారు ఎవరో.. ఎలాంటి వారో నాకు తెలీదా? చిట్ ఫండ్ వ్యాపారంలో ఎవరి డబ్బు పెట్టుబడిగా పెట్టారో ప్రజలకు తెలీదా? కోట్లాది మంది ప్రజలు కష్టపడి కూడబెట్టిన పైసా పైసా మొత్తాన్ని చిట్ ఫండ్ కంపెనీల్లో కూడబెట్టారు. కానీ.. కొందరు రాజకీయ నేతల ఆశీస్సులతో ఆ కోట్లాది రూపాయిలు అదృశ్యమయ్యాయి’’ మండిపడ్డారు. చిట్ ఫండ్ లో డబ్బు పెట్టి మోసపోయిన చాలామంది పేదలు ఆత్మహత్యలు చేసుకున్నారని.. ఆ రాజకీయ నేతల చరిత్ర అలాంటిదని.. వారంతా తనను ప్రశ్నిస్తున్నారంటూ మండిపడ్డారు.

ఎంతకాలం ఈ దేశం నోరు మెదపకుండా ఉండాలి? వారు 70 ఏళ్లపాటు నోరెత్తలేదు.. వారు నల్లధనాన్ని అరికట్టటానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ కాంగ్రెస్ పై ఫైర్ అయిన మోడీ.. తాను చెప్పినట్లుగా 50 రోజుల సమయం తనకిస్తే.. తాను చెప్పింది చేసి చూపిస్తానని.. రద్దు నిర్ణయం విజయవంతం అవుతుందని వ్యాఖ్యానించారు. నోట్ల రద్దుతో నల్లధనానికి చెక్ పడుతుందని.. తాము తీసుకున్న నిర్ణయం పేదలు.. నిజాయితీపరుల్ని ఇబ్బంది పెట్టడానికి ఎంత మాత్రం కాదన్న ఆయన.. నల్లధనాన్ని దాచుకునేందుకు జన్ ధన్ యోజన ఖాతాదారులు ఎలాంటి అవకాశం ఇవ్వొద్దని కోరారు. ఒకవేళ అలాంటి పని చేస్తే తిప్పలు తప్పవన్న ఆయన.. పెద్దనోట్ల రద్దు కారణంగా తీవ్రవాదం.. డ్రగ్స్ సరఫరాకు చెక్ పడుతుందన్నారు. మొత్తానికి తన మీద తీవ్రంగా విరుచుకుపడుతున్న నేతలపై ఫైర్ అవుతూ.. మోడీ రాజకీయ ఎదురుదాడి షురూ చేశారని చెప్పొచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/