Begin typing your search above and press return to search.

కేసీఆర్ అడుగుల్లో మోడీ నడక షురూ!

By:  Tupaki Desk   |   8 Oct 2016 4:52 AM GMT
కేసీఆర్ అడుగుల్లో మోడీ నడక షురూ!
X
అవకాశాన్ని అందిపుచ్చుకోవటం అందరికి చేతనయ్యే వ్యవహారం కాదు. కొందరు చేజార్చుకుంటే.. మరికొందరు చేతికి వచ్చిన అవకాశాన్ని పూర్తిస్థాయిలో వాడుకోవటం కనిపిస్తుంది. తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రెండో పక్షానికి చెందిన వారు. ముఖ్యమంత్రి అయ్యామా.. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామా? ఓటు బ్యాంకు రాజకీయాలతో అధికారాన్ని సుస్థిరం చేసుకున్నామా? అన్న అంశాలకే పరిమితం కాకున్నా.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా.. ప్రతి రంగంలోనూ.. ప్రతి అంశంలోనూ తనదైన మార్క్ స్పష్టంగా కనిపించాలన్న తహతహ ఆయనలో ఎక్కువ కనిపిస్తుంది.

ఒక ఉద్యమ అధినేతకు పాలనా పరమైన విజన్ కాస్త తక్కువగా ఉంటుందన్న భావన ఉంటుంది. అయితే.. కేసీఆర్ ఇందుకు మినహాయింపుగా చెప్పక తప్పదు. అధికారం చేతికి వచ్చిన రెండున్నరేళ్ల వ్యవధిలో కేసీఆర్ చాలానే కార్యక్రమాలు చేపట్టారనే చెప్పాలి. వ్యవస్థ మొత్తాన్ని మార్చేసి.. తనకు నచ్చినట్లుగా తయారు చేసుకోవటంతో పాటు.. వివిధ పథకాలకు శ్రీకారం చుట్టారు. ఆయన చేపట్టిన పథకాల్లో అందరి దృష్టిని ఆకర్షించటంతో పాటు.. సామాన్యుల్లో సైతం సరికొత్త ఆశల్ని రేపుతున్న పథకం ఏదైనా ఉందంటే.. అది మిషన్ భగీరథే. ప్రతి ఇంటికి నల్లా నీళ్లను అందించటం ద్వారా.. ప్రజారోగ్యానికి పెద్దపీట వేయటంతోపాటు. తాగునీటి సమస్యకు చెక్ చెప్పాలన్న బహృత్ సంకల్పం కనిపిస్తుంది.

మిషన్ భగీరథ పథకం మాటల్లో చెప్పినంత ఈజీ ఏమీ కాదు చేతల్లో చేసి చూపించటం. సార్వత్రిక ఎన్నికల నాటికి మిషన్ భగీరథ పేరిట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నల్లాలతో నీటిని తాను అందించకుంటే.. ఎన్నికలవేళ ఓట్లు అడగనంటూ సంచలన ప్రకటన చేయటాన్ని మర్చిపోలేం. ఈ పథకం తెలంగాణ వ్యాప్తంగానే కాదు.. జాతీయ స్థాయిలో కేసీఆర్ ఇమేజ్ గ్రాఫ్ ను భారీగా పెంచిందని చెప్పాలి. ప్రధాని మోడీ సైతం మిషన్ భగీరథ కార్యక్రమం పట్ల ఆసక్తి కనపర్చటమే కాదు.. ఆ పథకాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేసే దిశగా అడుగులు వేయటం గమనార్హం.

తెలంగాణ ప్రభుత్వం పవర్ లోకి వచ్చిన తొలినాళ్లలోనే చేపట్టిన ఈ మిషన్ భగీరథ ప్రాజెక్టును.. కేంద్రం 2022 నాటికి దేశవ్యాప్తంగా 90 శాతం గ్రామీణులకు పైపులైన్ ద్వారా తాగునీటిని అందించాలని డిసైడ్ అయ్యింది. ఇప్పుడున్నగణాంకాల ప్రకారం.. దేశంలో 52 శాతం గ్రామీణులకే మాత్రమే నల్లాల ద్వారా నీళ్లు సరఫరా అవుతున్న పరిస్థితి. అవికూడా బోర్ల ద్వారా వేసిన నీరే కావటం గమనార్హం. ఇలాంటి నీటి కారణంగా ఫ్లోరైడ్.. ఐరెన్.. రసాయనాలతో కలిసిన నీటిని తాగి తీవ్ర అనారోగ్యానికి గురి అవుతున్నారు. అలాంటి దుస్థితి నుంచి తప్పించి.. దేశ ప్రజలకు సురక్షిత మంచినీటిని అందించేందుకు వీలుగా కేసీఆర్ మానసపుత్రిక మిషన్ భగీరథను ప్రధాని మోడీ దేశ వ్యాప్తంగా టేకప్ చేయాలని డిసైడ్ అయ్యారు. మోడీని.. ఆయన పాలనా విధానాల్ని స్ఫూర్తిగా తీసుకునే వేళ.. కొత్తగా ఏర్పడిన ఒక రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి చేపట్టిన ప్రాజెక్టును కేంద్రం అందిపుచ్చుకోవటం చూస్తే.. కేసీఆర్ సామర్థ్యం.. ముందుచూపు ఇట్టే అర్థమవుతుందని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/