Begin typing your search above and press return to search.

మోడీకి తెలంగాణ ఏమిచ్చింది..తెలంగాణకు మోడీ ఏమిచ్చారు?

By:  Tupaki Desk   |   8 Aug 2016 4:43 AM GMT
మోడీకి తెలంగాణ ఏమిచ్చింది..తెలంగాణకు మోడీ ఏమిచ్చారు?
X
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రెండళ్ల తర్వాత ప్రధాని మోడీ వచ్చారు. దేశానికి ప్రధాని అయిన వ్యక్తి రాష్ట్రానికి రావటం చిన్న కతేం కాదు. అందుకే.. ప్రదాని పర్యటన కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత భారీగా ఏర్పాట్లు చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంతవరకూ ఏర్పాటు చేయనంత భారీ బహిరంగ సభను ప్రధాని మోడీ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేయటాన్ని మర్చిపోకూడదు. విశిష్ట అతిధి రాష్ట్రానికి వచ్చిన వెళ్లిన వేళ.. లెక్కల్లోకి వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కోట్లాది రూపాయిల ఖర్చు చేసి ప్రధాని పర్యటనను దిగ్విజయంగా పూర్తి చేయటమే కాదు.. తన రెండేళ్ల పాలనలో కేంద్ర సర్కారులో అవినీతి అన్నది ఏ మాత్రం లేదన్న విషయాన్ని ఒక ఎన్డీయేతర కూటమికి చెందిన పార్టీ అధినేత.. రాష్ట్ర ముఖ్యమంత్రి నోటి నుంచి భారీ కాంప్లిమెంట్ పొందటం మామూలు విషయం కాదు.

మరికొద్ది నెలల్లో ప్రతిష్ఠాత్మకమైన యూపీ ఎన్నికలు జరుగుతున్న వేళ.. మోడీకి కేసీఆర్ ఇచ్చిన ‘అవినీతి రహిత ప్రభుత్వాధినేత’ కాంప్లిమెంట్ భారీగా ఉపయోగడపతుందని చెప్పాలి. రాక రాక వచ్చిన మోడీ.. తెలంగాణకు వచ్చిన దానికి భారీ కాంప్లిమెంట్ తో.. ఊహించని ఇమేజ్ తో ఢిల్లీకి తిరుగుముఖం పట్టగా.. ప్రధాని రాకతో తెలంగాణకు ఏం ప్రయోజనం సిద్ధించిందన్న విషయంలోకి వెళ్లినప్పుడు నిరాశ కలగక మానదు.

ఇచ్చిపుచ్చుకునే లెక్కల్లో మోడీ తెలంగాణ పర్యటనను చూస్తే.. తెలంగాణ రాష్ట్రం కంటే ప్రధాని మోడీనే తన తాజా టూర్ తో లాభం పొందారని చెప్పాలి. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోడీ గడిచిన రెండేళ్లలో మరే రాష్ట్రంలో పొందని పొగడ్తను తెలంగాణ గడ్డ మీదనే సొంతం చేసుకోవటాన్ని మర్చిపోకూడదు. అవినీతి రహిత పాలనను చేస్తున్నారని.. దేశ చరిత్రలో ఆయన నిలిచిపోతారంటూ కేసీఆర్ ఆకాశానికి ఎత్తేసేలా పొగిడేయటం అంత చిన్న విషయం కాదు.

రాష్ట్ర విభజన మొదలు మొన్నటి హైకోర్టు విభజన సందర్భంగా మోడీ సర్కారుపై అప్పుడప్పుడు విమర్శలు చేసిన కేసీఆర్ సర్కారే.. ఈ రోజు మోడీ ముందు సాగిలపడిపోయినట్లుగా ప్రశంసించటం చూసినప్పుడు.. మోడీతో అనుబంధం కోసం కేసీఆర్ ఎంతలా తపిస్తున్నారన్న విషయం స్పష్టంగా అర్థమైందని చెప్పాలి. ప్రధాని మనసు గెలుచుకోవటానికి పొగడ్తకు మించింది లేదన్నట్లుగా కేసీఆర్ ఫిక్స్ అయినట్లుగా ఉంది. అందుకే.. ఆయన్ను మరెవరు పొగడనట్లుగా కేసీఆర్ పొగిడేశారు.

తాను ఊహించిన దాని కంటే భారీ ప్రయోజనం పొందిన తెలంగాణ టూర్లో.. రాష్ట్రానికి ప్రత్యేకంగా ఏమీ ప్రకటించని మోడీ.. తెలంగాణ ముఖ్యమంత్రిని ఒక మోస్తరుగా పొగిడేసి మమ అనిపించేశారు. మొత్తంగా చూస్తే.. తన తెలంగాణ పర్యటనలో మోడీ ఇచ్చింది ఏమీ లేకున్నా.. తీసుకున్నది మాత్రం భారీగా ఉందని చెప్పాలి. తమది ఓన్లీ ఇన్ కమింగే తప్పించి.. అవుట్ గోయింగ్ తక్కువేనన్న విమర్శకు తగ్గట్లే మోడీ వ్యవహరించటం స్పష్టంగా కనిపించిందని చెప్పక తప్పుదు. నిష్ఠూరంగా ఉన్న ఒక్క విషయాన్ని చెప్పాలి. అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన మోడీ.. ఏపీకి ఒక చెంబులో నీళ్లు.. మరో చెంబులో కాసింత మట్టి ఇచ్చారు. తాజా కోమటిబండ పర్యటనలో తెలంగాణకు మోడీ అది కూడా ఇవ్వలేదనే చెప్పాలి.