Begin typing your search above and press return to search.

తిరుప‌తి ప్ర‌చారానికి మోడీ.. క‌మ‌ల నాథుల ఆశ‌లు..!

By:  Tupaki Desk   |   28 March 2021 3:42 PM GMT
తిరుప‌తి ప్ర‌చారానికి మోడీ.. క‌మ‌ల నాథుల ఆశ‌లు..!
X
తిరుప‌తి పార్ల‌మెంటు స్థానానికి జ‌రుగుతున్న ఉప ఎన్నిక‌లో ఎట్టి ప‌రిస్థితిలోనూ స‌త్తా చాటి తీరాల‌నే క‌సి ఉన్నారు రాష్ట్ర క‌మ‌ల‌నాథులు. ఇప్ప‌టికే స్థానిక‌, పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం చ‌విచూసిన నేప‌థ్యంలో తిరుప‌తి పార్ల‌మెంటు స్థానాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. ఈ క్ర‌మంలోనే మాజీ ఐఏఎస్ ర‌త్న ప్ర‌భ‌ను ఇక్క‌డ పోటీకి పెట్టారు.

అయితే.. వైసీపీ దూకుడుగా ఉన్న నేప‌థ్యంలో.. ఇక్క‌డ తాము ఎంత ప్ర‌చారం చేసినా.. ప్ర‌యోజ‌నం త‌క్కువ‌గా ఉంటుంద‌ని రాష్ట్ర నేత‌లు భావిస్తున్నారు. తాము ప్ర‌చారం చేసినా..ప్ర‌జ‌లు ప‌ట్టించుకుంటారా ? అనేది పెద్ద స‌మ‌స్య‌గా మారింది. పైగా ఏపీకి బీజేపీ గ‌త ఆరేడేళ్ల‌లో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క‌టి నెర‌వేర్చ‌లేదు. దీంతో బీజేపీ అంటేనే ఏపీ ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు.

పైగా ఇటీవ‌ల వెలుగు చూసిన‌.. ఓ కుంభ‌కోణం కూడా ఇక్క‌డి నాయ‌కుల‌పై ప్ర‌భావం ప‌డుతోంది. ఈ క్ర‌మంలో తాము ప్ర‌చారం చేస్తూనే ఒక్క‌సారైనా.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని ఇక్క‌డ ప్ర‌చారానికి ర‌ప్పించ‌గ‌లిగితే.. ఆ ప్ర‌భావం వేరేగా ఉంటుంద‌ని అనుకుంటు న్నారు. ముఖ్యంగా విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ అంశాన్ని అధికార ప‌క్షం లోపాయికారీగా ప్ర‌జ‌ల్లో చ‌ర్చ‌కు పెట్టి.. దీనికి బీజేపీనే కార‌ణ‌మ‌ని ప్ర‌చారం చేస్తోంది. ఈ నేప‌త్యంలో అస‌లు ఏం జ‌రుగుతోంది ? ఎందుకు విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ విష‌యంలో మోడీతోనే ఏదో ఒక క్లారిటీ ఇప్పిస్తే బాగుంటుంద‌ని బీజేపీ నేత‌ల ప్లాన్.

మోడీతో సైతం నేరుగా విశాఖ ఉక్కు స్టీల్ ప్రైవేటీక‌ర‌ణ ఉంటుంద‌ని చెప్ప‌కుండా అది ప‌రిశీల‌న‌లోనే ఉంద‌ని చెప్ప‌డం ద్వారా అస‌లు అంశాన్ని దాట‌వేయిస్తే ఇక్క‌డ అంత వ్య‌తిరేక‌త ఉండ‌ద‌ని బీజేపీ ప్లాన్‌. ఈ క్ర‌మంలోనే తాజాగా రాష్ట్ర బీజేపీ చీఫ్‌.. సోము వీర్రాజు.. ఇప్ప‌టికే.. జాతీయ పార్టీ నేత‌.. జేపీ న‌డ్డాకు ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న‌కు సంబందించి.. ఒక్క‌రోజు కేటాయించాల‌ని.. కోరుతూ లేఖ రాసిన‌ట్టు తెలుస్తోంది. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఇప్ప‌టికే నాలుగు రాష్ట్రాల ఎన్నిక‌ల ప్ర‌చారంలో మోడీ బిజీగా ఉన్నారు. అప్పుడే తిరుపతి ఉప ఎన్నిక కూడా ఉంది.

ఈ నేప‌థ్యంలో ఆయ‌న త‌న బిజీ షెడ్యూల్ నుంచి ఒక్క సీటు కోసం కేటాయిస్తారా? పైగా విశాఖ ఉక్కు వంటి కీల‌క అంశంపై బ‌హిరంగంగా మాట్లాడితే.. ఇత‌ర రాష్ట్రాల ఎన్నిక‌లపై ప్ర‌భావం ప‌డ‌కుండా ఉంటుందా ? అనేది చ‌ర్చ‌కు దారితీస్తోంది. అయితే.. మోడీ క‌నుక తిరుప‌తి వ‌స్తే.. ఆయ‌న వెంట ఇష్టం ఉన్నా లేకున్నా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ వ‌స్తార‌ని.. అప్పుడు కొంత మేర‌కు త‌మ‌కు ప‌రిస్థితి బాగుంటుంద‌ని అంటున్నారు. మ‌రి మోడీ ఏమేర‌కు స‌హ‌క‌రిస్తారు? అనేది చూడాలి.