Begin typing your search above and press return to search.

మన్మోహన్.. మోడీ మధ్య తేడాను ఎంత బాగా చెప్పారో

By:  Tupaki Desk   |   30 May 2021 9:30 AM GMT
మన్మోహన్.. మోడీ మధ్య తేడాను ఎంత బాగా చెప్పారో
X
అప్పుడెప్పుడో ఇందిరమ్మ.. ఆ తర్వాత నరేంద్ర మోడీ మాత్రమే. యావత్ దేశాన్ని ప్రభావితం చేసిన ప్రధానుల్లో వీరిద్దరి పేర్లే తరచూ వినిపిస్తాయి. ఆ మాటకు వస్తే.. ఈ ఇద్దరి పాలనను చూసినప్పుడు.. ఏమైనా ఫర్లేదన్నట్లుగా తీసుకొన్ని కొన్ని నిర్ణయాలు కనిపిస్తాయి. మోడీ ఏడేళ్ల పాలనలో దేశ ప్రజలకు ఏం జరిగింది? ఎంత మేలు జరిగిందన్న చర్చకు తెర తీస్తే.. ఒక పట్టాన తేలే అంశం కాదు. మోడీని అభిమానించి ఆరాధించేవారు.. విపరీతంగావిభేదించి వ్యతిరేకించేవారు ఒప్పుకునే వాస్తవం మాత్రం ఒకటి ఉందని చెబుతారు.

తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక పిక్ ను చూసినప్పుడు.. దేశ ప్రజలకు మోడీ ఇచ్చిన అద్భుత కానుక ఏమిటో ఇట్టే అర్థమైపోతుంది. అదే సమయంలో పదేళ్ల పాటు ప్రధానిగా వ్యవహరించిన మన్మోహన్ హయాంకు.. ఏడేళ్ల మోడీ పాలనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఈ ఫోటో చెప్పేయటం మరో విశేషంగా చెప్పాలి.

మన్మోహన్ హయాంలో క్రూడ్ ఆయిల్ బ్యారల్ గరిష్ఠంగా 146 డాలర్లు ఉన్నప్పుడు దేశంలో లీటరు పెట్రోల్ ధర రూ.68 దాట లేదు. మహా అయితే.. మరో రెండు మూడు రూపాయిలు ఎక్కువైంది. కానీ.. దేశ ప్రజల ఆదరాభిమానాలు అందుకున్న మోడీ ప్రధానిగా ఉన్న వేళలో.. కనిష్ఠంగా బ్యారెల్ ముడిచమురు ధర 58 డాలర్లు. గత లాక్ డౌన్ వేళలో.. ప్రపంచంలో మరెప్పుడూ లేనంత దారుణంగా క్రూడాయిల్ పడిపోయింది. దాన్ని పరిగణలోకి తీసుకోలేదు. కాస్త అటు ఇటుగా బ్యారెల్ ముడిచమురు 58 డాలర్లు ఉన్న వేళ.. దేశంలో లీటరు పెట్రోల్ ధర రూ.100 కావటం గమనార్హం.

అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధర తక్కువైనప్పటికీ.. లీటరు పెట్రోల్ రూ.100 (తెలంగాణతో సహా మరికొన్ని రాష్ట్రాల్లో మరికొద్ది రోజుల్లో వందను టచ్ చేయనుంది) పలుకుతోంది. ఏపీతో సహా ఇప్పటికే పలు రాష్ట్రాల్లో వంద కూడా దాటేసిన పరిస్థితి. అంతేనా.. నూనెల ధరలు కూడా ఆయిల్ మార్కెట్ చరిత్రలో ఎప్పుడూ లేనంత భారీగా నమోదవుతున్నాయి. పేదలు ఎక్కువగా వినియోగించే లీటరు పామాయిల్ రూ.140 దాటిపోతే.దిగువ.. మధ్యతరగతి వారు ఎక్కువగా వినియోగించే రిఫైండ్ సన్ ఫ్లవర్ ఆయిల్ లీటరు ఏకంగా రూ.175 దాటేయటం తెలిసిందే. ఇలా ధరల మంట విషయంలో మోడీ మాష్టారి తర్వాతే ఏమైనా?