Begin typing your search above and press return to search.

గవర్నర్లతో ప్రభుత్వాలకు మోడీ చుక్కలు చూపిస్తున్నారా?

By:  Tupaki Desk   |   26 May 2021 9:30 AM GMT
గవర్నర్లతో ప్రభుత్వాలకు మోడీ చుక్కలు చూపిస్తున్నారా?
X
దేశంలోని చట్టాలు.. నిబంధనలు చాలా సిత్రంగా ఉంటాయి. పేరుకు రబ్బర్ స్టాంప్ అన్నట్లుగా ఉండే వ్యవస్థలు.. కొన్నిసార్లు ఊహించనంత బలంగా.. అంతకు మించిన మొండిగా కనిపిస్తాయి. అరే.. రబ్బర్ స్టాంపుగా ఉన్న వారు.. ఇంత సినిమా చూపించొచ్చా? అన్న సందేహం కలిగేలా చేస్తుంటాయి. సాధారణంగా రాష్ట్రాల్లో గవర్నర్ పాత్ర నామమాత్రంగా ఉంటుంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు అధికారంలో ఉన్న వేళలో.. రాజ్యాంగపరమైన విధుల్ని మాత్రమే నిర్వహించే గవర్నర్లు.. కేంద్రంలో మోడీ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత అంతకు మించి అన్నట్లుగా కొన్ని రాష్ట్రాల్లో వ్యవహరిస్తున్నారన్న విమర్శ ఉంది. దీనికి తగ్గట్లే ఆయా రాష్ట్రాల్లో గవర్నర్లు వ్యవహరిస్తున్న తీరు ఇటీవల కాలంలో తరచూ చర్చకు వస్తోంది.

గవర్నర్లను అడ్డం పెట్టుకొని తాను అనుకున్న రీతిలో వారు నిర్ణయాలు తీసుకునేలా ప్రధాని మోడీ వ్యవహరిస్తున్నారన్న ఆరోపణ ఇటీవల కాలంలో బలంగా వినిపిస్తోంది. దీనికి తగ్గట్లే..కొన్ని ఉదాహరణలు చూపిస్తున్నారు కూడా. ఎక్కడి దాకానో ఎందుకు పశ్చిమ బెంగాల్ లో ముఖ్యమంత్రి మమతకు.. ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ థడ్కర్ కు మధ్యనున్న రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల ఎన్నికల ఫలితాలు వెల్లడి కావటమే కాదు.. అంచనాలకు మించి 200 మార్కు దాటేసిన మమత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో.. సాధారణంగా గవర్నర్లు మౌనంగా ఉంటారు.

అందుకు భిన్నంగా అప్పుడెప్పుడో కేసైన నారదా స్కాంలో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులతో పాటు.. టీఎంసీకి చెందిన నేతలపై సీబీఐ విచారణకు గవర్నర్ నిర్ణయం తీసుకోవటం పెను దుమారాన్ని రేపింది. సాధారణంగా ఇలాంటి నిర్ణయాల్ని ముఖ్యమంత్రితో చర్చిస్తారు. అందుకు భిన్నంగా వ్యవహరిస్తునన బెంగాల్ గవర్నర్ తీరుపై మమత తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

మహారాష్ట్రలో తమ వైరి వర్గం అధికారంలో ఉన్న వేళ.. ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రంలోని మోడీ సర్కారు పలు అంశాల్లో చుక్కలు చూపిస్తుందని చెబుతున్నారు. ఇటీవల తుఫాను నేపథ్యంలో భారీగా నష్టపోయినప్పటికి గుజరాత్ కు నష్ట పరిహారానికి మోడీ సర్కారు ప్రకటన చేశారే తప్పించి.. మహారాష్ట్రకు అందించే సాయం గురించి పెదవి విప్పలేదు. దీనిపై తీవ్ర విమర్శలకు తావిస్తోంది. అంతేకాదు.. మహారాష్ట్ర గవర్నర్ వ్యవహారశైలి మీదా విమర్శలు వినిపిస్తున్నాయి.

12 మంది ఎమ్మెల్సీలను నామినేట్ చేయాలని మహా సీఎం ఉద్దవ్ ఠాక్రే..ఒక జాబితాను గవర్నర్ వద్దకుపంపారు. అది కూడా పోయిన నవంబర్లో. ఇప్పటివరకు ఆ ఫైల్ మీద నిర్ణయం తీసుకోలేదు మహా గవర్నర్ హోషియారీ. సాధారణంగా ఇలాంటి వాటిని ఒకట్రెండు రోజుల్లో కాదంటే వారంలో క్లియర్ చేసి పంపుతారు. నామినేటెడ్ పదవుల గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయాన్ని వ్యతిరేకించేందుకు గవర్నర్లు ఇష్టపడరు.అందుకు భిన్నంగా..ఏడు నెలల నుంచి ఎమ్మెల్సీ నామినేటె చేసే అంశానికి రబ్బర్ స్టాంపు వేయకుండా తన వద్దే ఉంచుకున్న వైనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇలా తమ ప్రభుత్వాలు లేని రాష్ట్రాల్లో.. తమ పార్టీ బలంగా ఉన్న చోట్ల గవర్నర్ తో కలిపి కేంద్రంలోని మోడీ సర్కారు చుక్కలు చూపిస్తోందన్న మాట వినిపిస్తోంది.