Begin typing your search above and press return to search.

బాబుకు నోట మాట రాకుండా చేసిన మోడీ

By:  Tupaki Desk   |   9 Aug 2017 10:29 AM GMT
బాబుకు నోట మాట రాకుండా చేసిన మోడీ
X
అందుకే అనేది.. ఒక‌సారి వంగ‌టం మొద‌లైతే.. ఆ వంగ‌టం ఎక్క‌డికో తీసుకెళుతుంద‌నేది. ప్ర‌ధాని మోడీకి బాబు ఎందుకు భ‌య‌ప‌డ‌తారో.. మ‌రెందుకు నోరు విప్ప‌రో తెలీదు కానీ..ఆయ‌న తీరుతో ఏపీకి ఎంత న‌ష్టం జ‌ర‌గాలో అంత న‌ష్టం జ‌రుగుతుంద‌న‌టంలో సందేహం లేదు. ఇప్ప‌టికే ప్ర‌త్యేక హోదా విష‌యంలో బాబు రాజీ పుణ్య‌మా అని భారీ న‌ష్టం వాటిల్లింది. హోదాను ప్ర‌త్యేక ప్యాకేజీ పేరు చెప్పి ఏపీ ప్ర‌జ‌ల‌కు స‌ర్ది చెప్పేందుకు బాబు చేసిన ప్ర‌య‌త్నాలు అన్నిఇన్ని కావు.

హోదా విష‌యంలో ఏపీకి జ‌రిగిన న‌ష్టం మీద ఇప్ప‌టికీ ఆంధ్రోళ్లు తీవ్ర ఆగ్ర‌హంతోనూ.. ఆవేద‌న‌తో ఉన్నారు. ఇది స‌రిపోద‌న్న‌ట్లుగా తాజాగా ఏపీకి మోడీ మ‌రో భారీ షాకిచ్చిన‌ట్లుగా చెప్పాలి. విభ‌జ‌న హామీల్లో భాగంగా ఏపీకి ఇవ్వాల్సిన రెవెన్యూ లోటు మీద మోడీ స‌ర్కారు చెబుతున్న లెక్క‌లు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు ఓప‌ట్టాన మింగుడుప‌డ‌ని రీతిలో మారాయి.

2014-15కు సంబంధించిన రెవెన్యూ లోటుకు సంబంధించి ఏపీ స‌ర్కారు చెప్పే లెక్క‌కు.. మోడీ స‌ర్కారు చెప్పే లెక్క‌కు పొంత‌న కుద‌ర‌ని ప‌రిస్థితి. రెవెన్యూ లోటును రూ.16వేల కోట్లుగా ఏపీ స‌ర్కారు తేలిస్తే.. అస‌లు అంత లేద‌ని చెబుతూ.. మొత్తం రూ.4,117.89 కోట్లు మాత్ర‌మేన‌న్న లెక్క చెబుతోంది. దీనిపై ఇప్ప‌టికే చేసిన అభ్య‌ర్థ‌న‌ల్ని తోసిపుచ్చుతూ వ‌స్తోంది.

లెక్క‌ల విష‌యంలో మేమంత ప‌క్కానో తెలుసా? అన్న‌ట్లుగా ఏపీ స‌ర్కారు ఇప్ప‌టివ‌ర‌కూ చేసింది లేదు. కేంద్రం తీరును తూర్పార ప‌ట్టేలా ప్ర‌క‌ట‌న‌లు చేసింది లేదు. ఇందుకే కాబోలు.. దొరికించే ఛాన్స్ అన్న‌ట్లుగా తాజాగా ఏపీకి ఇవ్వాల్సిన రెవెన్యూ లోటు విష‌యంపై కేంద్రం తేల్చేసింది. దాదాపు మూడేళ్ల త‌ర్వాత ఏపీ స‌ర్కారు చెప్పిన రూ.16వేల కోట్ల లెక్క‌తో త‌మ‌కు సంబంధం లేద‌ని తేల్చేసింది.

తాము గ‌తంలో చెప్పిన‌ట్లే రూ.4,117.89 కోట్ల‌కు ఫిక్స్ అయిన కేంద్రం.. ఇప్ప‌టికే తాము రూ.2,303 కోట్ల‌ను మంజూరు చేశామ‌ని.. మిగిలిన మొత్తాన్ని ఇస్తామ‌ని చెప్పింది. విభ‌జ‌న త‌ర్వాత కొత్త ప్రాజెక్టుల‌కు ఖ‌ర్చు చేసిన మొత్తాన్ని లోటుగా తాము ఒప్పుకోలేమ‌న్న మాట‌ను తేల్చి చెప్పిన‌ట్లుగా చెబుతున్నారు. కేంద్రం మాట‌కు బాబు స‌ర్కారు మౌనంగా ఉందే త‌ప్పించి.. ఇదెక్క‌డి అన్యాయం అంటూ అడిగింది లేదు. కేంద్రం ఏపీ ప‌ట్ల ఎంత దారుణంగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌న్న నోటి మాట కూడా లేదు. మూడేళ్ల లేక్క‌ను ఇప్పుడు తేల్చ‌టం ఏమిటి? ఇంకా లోటు మొత్తాన్ని ఎందుకు ఇవ్వ‌లేద‌న్న న్యాయ‌ప‌ర‌మైన ప్ర‌శ్న‌లు వేయ‌ని ఏపీ తీరు చూస్తే.. మోడీకి మ‌రీ అంత దాసోహం కావాల్సిన అవ‌స‌రం ఉందా? సందేహం మ‌న‌సుకు క‌ల‌గ‌టం ఖాయం.