Begin typing your search above and press return to search.

పైసా త‌గ్గించార‌ట‌.. పండ‌గ చేసుకోమంటున్నారు

By:  Tupaki Desk   |   30 May 2018 10:56 AM GMT
పైసా త‌గ్గించార‌ట‌.. పండ‌గ చేసుకోమంటున్నారు
X
మీకో అద్భుత‌మైన విష‌యం చెబుతాం. చెప్పినంత‌నే ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతారు. అంతేనా.. పండ‌గ చేసుకోవాల‌నుకుంటారన్న బిల్డ‌ప్ ఇచ్చిన‌ప్పుడు స‌హ‌జంగా ఏమ‌నుకుంటాం? భారీ శుభ‌వార్త ఏదో ఉంద‌నుకోవ‌టం ఖాయం. ఇంత హైప్ క్రియేట్ అయ్యాక‌.. అస‌లు విష‌యం వింటే ఒళ్లు మండ‌ట‌మే కాదు.. దీనికే పండ‌గ చేసుకోవాలా? అంటూ ఎట‌కారం చేసుకోవ‌టం ఖాయం.

తాజాగా అలాంటి ప‌రిస్థితే నెల‌కొంది. గ‌డిచిన ప‌ద‌హారు రోజులుగా నాన్ స్టాప్ గా పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌ల్ని పెంచేస్తున్న వైనం తెలిసిందే. ఈ పెంపుతో దేశ ప్ర‌జ‌లంతా గ‌గ్గోలు పెడుతున్నారు. ఈ భారీ బాదుడేంది మోడీ సార్ అంటూ మండి ప‌డుతున్న వారు లేక‌పోలేదు. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల నేప‌థ్యంలో బాదుడుకు కాస్త రెస్ట్ ఇచ్చిన దానికి ప్ర‌తిఫ‌లంగా.. ఎన్నిక‌ల్లో కీల‌క‌మైన పోలింగ్ పూర్తి అయిన నాటి నుంచి బాదుడు మీద బాదుడుతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. పెట్రోల్ మీద 60 పైస‌లు.. డీజిల్ మీద 56 పైస‌లు త‌గ్గిస్తున్న‌ట్లుగా చ‌మురు కంపెనీలు ఈ రోజు ప్ర‌క‌టించాయి. దీంతో.. చాలామంది సంతోషించారు. బాదుడు త‌ప్పించి వ‌రాలు ఇచ్చే విష‌యంలో మోడీది చిన్న మ‌న‌సు అనుకున్న వారంతా ఫ‌ర్లేదే అనుకున్న ప‌రిస్థితి.

అయితే.. ఈ ఆనందం ఎక్కువ‌సేపు నిల‌వ‌లేదు. ఒక్క రోజులో లీట‌రుకు యాభై పైస‌ల కంటే ఎక్కువ‌గా ధ‌ర త‌గ్గ‌టం ఇటీవ‌ల కాలంలో ఎప్పుడూ లేదు. అలాంటిది ఈ త‌గ్గింపుపై చాలామంది హ్యాపీగా ఫీలై.. రానున్న రోజుల్లో మ‌రింత త‌గ్తుతుంద‌నుకున్నారు. అయితే.. ఆ అంచ‌నాలు త‌ప్ప‌ని.. మోడీ మీద ప్ర‌జ‌ల న‌మ్మ‌కాన్ని వ‌న్ ప‌ర్సెంట్ కూడా త‌గ్గించ‌కూడ‌ద‌న్న ఆలోచ‌న‌లో ప్ర‌భుత్వం ఉంద‌న్న విష‌యం తాజాగా చేసిన ప్ర‌క‌ట‌న రుజువు చేసింది.

సాంకేతికంగా దొర్లిన త‌ప్పు కార‌ణంగా పైసా త‌గ్గిన పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌లు కాస్తా 60.. 56 పైస‌లు త‌గ్గిన‌ట్లుగా త‌ప్పుగా ప్ర‌క‌ట‌న వెలువ‌డింద‌ని.. సారీ అంటూ వెన‌క్కి తీసేసుకున్నారు. అంతేనా.. త‌గ్గించిన పైసాకు పండ‌గ చేసుకోవాల‌న్న‌ట్లుగా చెప్ప‌టంపై ప‌లువురు మండిప‌డుతున్నారు.

వెబ్ సైట్లో సాంకేతిక స‌మ‌స్య నెల‌కొంద‌ని.. ఈ కార‌ణంగా పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌లను పునఃస‌మీక్షిస్తున్న‌ట్లు చెప్పి.. ఇంధ‌న త‌గ్గుద‌ల‌ను పైసాకు ప‌రిమితం చేసింది. త‌గ్గించింది పైసా అయిన‌ప్పటికీ అదేదో ఘ‌న‌కార్యం చేసిన‌ట్లుగా ఆయిల్ కంపెనీలు వినియోగ‌దారుల‌కు ఊర‌ట క‌ల్పించిన‌ట్లుగా చెప్ప‌టంపై ప‌లువురు మండిప‌డుతున్నారు. త‌గ్గించింది పైసా.. మ‌ళ్లీ పండ‌గ చేసుకోవాలా? అంటూ చిరాకు ప‌డుతున్నారు.