Begin typing your search above and press return to search.

2019 వ‌ర‌కూ మోడీ ఆగేట‌ట్లు లేర‌ట‌

By:  Tupaki Desk   |   15 Aug 2017 3:46 AM GMT
2019 వ‌ర‌కూ మోడీ ఆగేట‌ట్లు లేర‌ట‌
X
సంచ‌ల‌న క‌థ‌నాన్ని ప్ర‌చురించిందో జాతీయ ప‌త్రిక ఒక‌టి. ముంద‌స్తు ఎన్నిక‌ల విష‌యంపై స‌ద‌రు ప‌త్రిక ప్ర‌చురించిన క‌థ‌నం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షించ‌టంతో పాటు.. ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. స‌ద‌రు మీడియా సంస్థ చెప్పిన దాని ప్ర‌కారం 2019లో జ‌ర‌గాల్సిన సార్వ‌త్రిక ఎన్నిక‌లు కొన్ని నెల‌ల ముందే 2018 చివ‌ర్లో జ‌రిగే అవ‌కాశం ఉంద‌న్న మాట వినిపిస్తోంది. షెడ్యూల్‌ కు భిన్నంగా సాగే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల మీద స‌ద‌రు ప‌త్రిక చెబుతున్న మాట ప్రకారం 2018 చివ‌ర్లో మోడీ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లిపోతారంటున్నారు.

అదే స‌మ‌యంలో మూడు రాష్ట్రాల‌కు జ‌రిగే ఎన్నిక‌లు కూడా ఉన్న విష‌యాన్ని వారు ప్ర‌స్తావిస్తున్నారు. తాము వెల్ల‌డించిన అంశంపై ప్ర‌ధాని మోడీ తీవ్రంగా క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. మూడు బీజేపీ పాలిత రాష్ట్రాలకు (మ‌ధ్య‌ప్ర‌దేశ్‌.. ఛ‌త్తీస్ గ‌ఢ్‌.. మిజోరాం) 2018 చివ‌ర్లో ఎన్నిక‌లు నిర్వ‌హించాల్సి ఉంది.

ఈ నేప‌థ్యంలో పాక్షిక జ‌మిలి ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని భావిస్తున్న మోడీ.. ప‌నిలో ప‌నిగా సార్వ‌త్రిక ఎన్నిక‌ల్ని కూడా ముంద‌స్తుకు జ‌రిపితే బాగుంటుంద‌న్న ఆలోచ‌న‌లో ఆయ‌న ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. 2024 నాటికి దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ఎన్నిక‌ల‌తో పాటు.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్ని ఒకేసారి నిర్వ‌హించాల‌న్న ఆలోచ‌న‌లో మోడీ స‌ర్కారు ఉండ‌టం తెలిసిందే. ఇదిలా ఉంటే.. 2024 ముందే ప్ర‌యోగాత్మ‌కంగా కొన్ని రాష్ట్రాల ఎన్నిక‌ల‌తో పాటు.. సార్వ‌త్రిక ఎన్నిక‌లు క‌లిపి నిర్వ‌హిస్తే ఎలా ఉంటుంద‌న్న ఆలోచ‌న‌లో మోడీ ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ఈ అంశంపై రాజ్యాంగ నిపుణుల‌తో మోడీ చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ని.. అదే స‌మ‌యంలో పార్టీ సీనియ‌ర్ నేత‌ల అభిప్రాయాన్ని సేక‌రిస్తున్న‌ట్లుగా పేర్కొంది. ఆరు నెల‌ల ముందు ఎన్నిక‌లు నిర్వ‌హించుకోవ‌టానికి రాజ్యాంగం వీలు క‌ల్పిస్తున్న నేప‌థ్యంలో మూడు రాష్ట్రాల ఎన్నిక‌ల‌తో పాటు.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌ను నిర్వ‌హిస్తే బాగుంటుంద‌న్న ఆలోచ‌న‌లో ఉన్నట్లుతెలుస్తోంది. అదే స‌మ‌యంలో 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ‌లో ఏపీ.. తెలంగాణ‌.. ఒడిసా.. సిక్కిం అసెంబ్లీకి కూడా ఎన్నిక‌లు జ‌రిగాయి. ఈ రాష్ట్రాల్లో కూడా ముంద‌స్తు ఎన్నిక‌లు వెళ్ల‌టం ద్వారా.. త‌న క‌ల అయిన జ‌మిలి ఎన్నిక‌ల‌కు సంబంధించి ముంద‌స్తు ప్ర‌య‌త్నంగా 2018లోనే చేస్తేబాగుంటుంద‌న్న ఆలోచ‌న‌లో మోడీ ఉన్న‌ట్లు తెలుస్తోంది. వీలైతే.. బీజేపీ అధికారంలో ఉన్న మ‌హారాష్ట్ర.. హ‌ర్యానా.. బిహార్.. ఉత్త‌రాఖండ్ లాంటి రాష్ట్రాల ఎన్నికలు సైతం 2018 చివ‌రి నాటికి నిర్వ‌హించ‌టం ద్వారా.. ఒకేసారి సార్వ‌త్రిక ఎన్నిక‌లతో పాటు.. దాదాపు 11 రాష్ట్రాల ఎన్నిక‌లు ఒకేసారి నిర్వ‌హించాల‌న్న అంశంపై మోడీ తీవ్రంగా దృష్టి సారించిన‌ట్లుగా చెబుతున్నారు. మ‌రి.. ఈ క‌థ‌నంపై బీజేపీ ముఖ్య‌నేత‌లు స్పందించాల్సి ఉంది.