Begin typing your search above and press return to search.

సంపన్నులకు షాకిచ్చేలా మోడీ సర్కారు నిర్ణయం

By:  Tupaki Desk   |   27 April 2020 5:30 AM GMT
సంపన్నులకు షాకిచ్చేలా మోడీ సర్కారు నిర్ణయం
X
కరోనా పుణ్యమా అని ప్రపంచ దేశాల ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైంది. ఏ మాత్రం ముందస్తు హెచ్చరికలు లేకుండా మీద పడిన కరోనా మహమ్మారి నుంచి బయటపడటం ఎలా అన్నదిప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. కరోనా ఉత్పాతానికి అన్ని దేశాల్లో ఆదాయం భారీగా దెబ్బ పడింది. ఇందుకు భారత్ సైతం మినహాయింపు కాదు. దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్ డౌన్ కారణంగా పన్ను ఆదాయంతో పాటు.. పన్నేతర ఆదాయానికి సైతం గండి పడింది. దీంతో.. తీవ్రమైన నిధుల సమస్యను ఎదుర్కొంటోంది.

ఇలాంటివేళ.. ఆదాయాన్ని తాత్కాలికంగా పెంచుకునేందుకు వీలుగా మోడీ సర్కారు కొత్త ఆలోచనలు చేస్తుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. కేంద్రానికి చెందిన కొందరు అధికారుల అంచనా ప్రకారం.. రానున్న రోజుల్లో కొత్త పన్నును విధించటం ద్వారా నిధుల సమీకరణ చేపట్టాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా సంపన్న వర్గాలు.. అధిక ఆదాయాలు ఉన్న వారిపై నలభై శాతం పన్నును విధించటంతో పాటు.. విదేశీ కంపెనీలపై అధిక లెవీ విధిస్తే బాగుంటుందన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.

ఇప్పటివరకూ అమల్లో ఉన్న విధానం ప్రకారం కోటికి పైగా వార్షిక ఆదాయం ఉన్న వారిపై 30 శాతంగా ఉన్న ఆదాయపన్నును నలభై శాతంగా పెంచాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. అదే సమయంలో వార్షిక ఆదాయం రూ.5 కోట్లకు పైబడి ఉండే వారిపై సంపద పన్నును ప్రవేశ పెట్టాలన్న యోచనలో కేంద్రం ఉన్నట్లు చెబుతున్నారు.

అయితే.. ఈ విధానం దీర్ఘకాలం కాకుండా స్వల్ప కాలానికి మాత్రమే పరిమితం చేయాలన్న భావనలో ఉన్నట్లు చెబుతున్నారు. మహా అయితే మూడు నుంచి ఆర్నెల్ల వ్యవధికే పరిమితం చేద్దామన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన నివేదికను సైతం అధికారులు సిద్ధం చేశారు. అయితే.. దీనిపై మోడీ సర్కారు ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటిస్తుందన్నది ఇప్పుడు ఉత్కంట రేపుతోంది.