Begin typing your search above and press return to search.

లక్ష్మణ రేఖను మోడీ దాటేశారా?

By:  Tupaki Desk   |   3 Oct 2020 3:30 AM GMT
లక్ష్మణ రేఖను మోడీ దాటేశారా?
X
చాలామంది నమ్మరు కాని నిజమిది. వ్యవస్థలు కావొచ్చు.. వ్యక్తులు కావొచ్చు.. అందరికి కొన్ని లక్షణ రేఖలు ఉంటాయన్నది మర్చిపోకూడదు. వ్యక్తులు లక్ష్మణరేఖల్ని దాటితే జరిగే నష్టం పరిమితంగా ఉంటుంది. కానీ.. వ్యవస్థలు అలాంటి తప్పే చేస్తే.. అందుకు మూల్యం భారీగా చెల్లించుకోవాల్సి ఉంటుంది. దురదృష్టవశాత్తు ఇటీవల కాలంలో తమ పరిమితుల్ని మర్చిపోతున్న వైనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికిప్పుడు ఏమీ జరగకున్నా.. రానున్న రోజుల్లో ఇదో దుష్ట సంప్రదాయంగా మారి.. మరిన్ని విపరిణామాలకు తెర తీస్తుందని చెప్పాలి. కాంగ్రెస్ అగ్రనేతల్లో ఒకరు.. అన్ని కలిసి వస్తే.. ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్న రాహుల్ గాంధీకి గురువారం ఎదురైన చేదు అనుభవం ఆయన ఆలోచన తీరును మార్చే అవకాశం ఉందని చెప్పాలి.

అధికారం అరచేతిలో ఉన్నప్పుడు.. దాన్ని పూర్తిస్థాయిలో అనుభవించేందుకు సిద్ధంగా లేని ఆయన.. ఇప్పుడు అదే అధికారాన్ని తిరిగి సొంతం చేసుకోవటానికి ఇప్పటివరకు ఎప్పుడు చేయనంతగా శ్రమిస్తున్నారు. జాతీయస్థాయి నేతలు నిరసన చేపట్టే పరిస్థితే వస్తే.. పోలీసులు.. అధికారులు అత్యంత సంయమనంతో వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ.. తాజా పరిణామాల్ని చూసినప్పుడు అలాంటిదేమీ కనిపించదు.
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన హత్రస్ గ్యాంగ్ రేప్ బాధిత కుటుంబాన్ని కలవటానికి వెళుతున్న రాహుల్ ను అడ్డుకున్నారు. పందొమ్మిది సంవత్సరాల దళిత అమ్మాయిని అగ్రవర్ణాలకు చెందిన నలుగురు గ్యాంగ్ రేప్ చేసి చంపిన ఆరోపణలు ఉన్నాయి. ఈ చావు కూడా ఎంత భయంకరంగా ఉందన్న విషయాన్ని ఇప్పటికే మీడియాలో భారీ స్థాయిలో వచ్చింది. ఈ ఉదంతం నేపథ్యంలో బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు రాహుల్.. ఆయన సోదరి ప్రియాంక ఇద్దరు బయలుదేరారు.

ఈ ఉదంతంతో ఇరుకున పడ్డ యూపీ సర్కారు.. రాహుల్.. ప్రియాంక ద్వయం పరామర్శతో మరింత వేడెక్కిపోవటమే కాదు.. రాజకీయంగా ఇబ్బందిగా మారుతుందని భావించారేమో కానీ.. వారిని వెళ్లకుండా ఆపారు. వారి పరామర్శ కార్యక్రమాన్ని పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని వారు అడిగారు. అందుకు చెప్పిన కారణం.. నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని. నలుగురు అంతకంటే ఎక్కువమంది గుమిగూడటం నిబంధనలకు విరుద్ధమన్నారు. దీంతో.. వారు వాహనాలు దిగి.. నూటయాభై కిలోమీటర్లు దూరాన ఉన్న హాస్రత్ కు నడిచి వెళతామని చెప్పి నడక మొదలెట్టారు.

రాహుల్ - ప్రియాంకలను వందలాది మంది కార్యకర్తలు అనుసరించారు. ఇదే సమయంలో పోలీసులు వారిని బలవంతంగా ఆపేయటం వివాదంగా మారింది. నిజంగానే శాంతిభద్రతల సమస్య ఉందంటే.. రాహుల్.. ప్రియాంకతో పాటు..ఎంపిక చేసిన కొందరిని పంపుతామన్న రాయబారాన్ని చేయొచ్చు. అందుకు రాహుల్ నో చెబితే.. వారిది తప్పు అవుతుంది. అందుకు భిన్నంగా అలాంటిదేమీ లేకుండా..రాహుల్ విషయంలో దురుసుగా వ్యవహరించటం.. ఆయన్ను బలవంతంగా ఆపటం.. లాల్చీని.. భుజాల్నిగట్టిగా పట్టుకోవటం దేనికి నిదర్శనం.

రాహుల్ నచ్చని వారికి ఈ వాదనను అంగీకరించరు. అలాంటి వారు రాహుల్ ను కాకుండా.. ఒక జాతీయ పార్టీకి కీలక నేతగా చదివినా.. లేదంటే.. భవిష్యత్తులో ఏదైనా ఉదంతంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు అప్పటికి విపక్ష నేతగా ఉన్న మోడీ వెళుతున్నారనుకోండి. అప్పుడు ఇలానే జరిగితే? అన్నది ఊహించుకుంటే.. విషయం ఇట్టే అర్థమయ్యే అవకాశం ఉంది.

రాహుల్.. ప్రియాంక లాంటి నేతల్ని సైతం పోలీసులు ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించటం.. పెనుగులాటలో ఆయన కింద పడిపోయేలా చేయటం.. వారి పట్ల దురుసుగా వ్యవహరించటం చూస్తే.. గౌరవ మర్యాదల్ని మర్చిపోతున్నామా? అన్న భావన రాక మానదు.

ఎవరైనా సరే అధికారంలో ఉంటే చాలు.. వారి ఆదేశాల్ని తూచా తప్పకుండా పాటించే ధోరణి దేశానికి మంచిది కాదు. చేతిలో అధికారం లేకుంటే చాలు.. ఎవరికైనా సరే అర్థం లేని పరిమితులు విధించేయొచ్చు అన్న ధోరణి ఈ దేశానికి ఏ మాత్రం మంచిది కాదన్నది మర్చిపోకూడదు. జరిగిన ఉదంతంపై విపక్ష నేతలు విరుచుకుపడ్డారు. కానీ.. ఇదంతా అధికారపక్షం సంకేతాలు ఇవ్వకుండా జరుగుతాయా? ఇలాంటివన్ని వ్యక్తిత్వ వికాస నిపుణుడ్ని తలదన్నేలా మాటలు చెప్పే మోడీ సర్కారు హయాంలో చోటుచేసుకోవటాన్ని మర్చిపోకూడదు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో రాహుల్ ఉండొచ్చు. రేపు మరొకరు ఉండొచ్చు. కానీ.. పరామర్శకు వెళ్లే వారి పట్ల ఇంత దారుణంగా వ్యవహరించటం చూస్తే.. లక్ష్మణ రేఖల్ని వ్యవస్థలు దాటేయటం దేశానికి క్షేమకరం కాదు. ఎందుకంటే.. ఇవాల్టి ప్రతిపక్షం రేపటి రోజున కాకున్నా.. ఏదో రోజున అధికారపక్షంగా మారుతుంది. ఆ వేళ.. తమకు ఎదురైన అనుభవాలతో మరింత కర్కసంగా వ్యవహరించేలా వ్యవస్థల్ని సిద్ధం చేస్తే.. దేశం ఎటు వెళుతుంది? అందుకే.. ఇలాంటి వాటికి సంబంధించి ఎవరున్నా.. తప్పు పట్టటం చాలా అవసరం.