Begin typing your search above and press return to search.

మోడీ సర్కారు రియాక్టు కాకున్నా.. సుప్రీం మాత్రం విచారణకు రమ్మంది

By:  Tupaki Desk   |   7 Oct 2021 2:07 AM GMT
మోడీ సర్కారు రియాక్టు కాకున్నా.. సుప్రీం మాత్రం విచారణకు రమ్మంది
X
ప్రజాస్వామ్య దేశంలో నిరసనలు.. ఆందోళనలు చాలా కామన్. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ఎప్పుడైనా ప్రజాభిప్రాయాన్ని.. ప్రజాగ్రహానికి విలువ ఇవ్వాల్సిన అవసరం ఉంది. రాజకీయంగా నష్టం వాటిల్లే ఆందోళనల్ని ఎదుర్కోవాలే కానీ.. హింస పురికొల్పేలా వ్యవహరించటం ఏ మాత్రం సరికాదు. అందుకు భిన్నంగా యూపీలో చోటు చేసుకున్న ఉదంతం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కుమారుడు.. నిరసనల్లో పాల్గొన్న రైతులపై ఖరీదైన తన కారుతో తొక్కేస్తూ దూసుకెళ్లిన వైనం గురించి వార్తలు వస్తే చాలామందికి తీవ్రత అర్థం కాలేదు. ఎప్పుడైతే ఆ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు రావటంతో.. ఆ ఆరాచకం ఏ స్థాయిలో ఉందన్న విషయం స్పష్టమైంది.

ఈ ఉదంతం కాస్తా ఇప్పుడు సంచలనంగా మారటమే కాదు.. కేంద్రంలోని మోడీ సర్కారుకు ఇప్పుడీ వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది. ఎప్పటిలానే జరిగిన దారుణం గురించి మాట్లాడకుండా.. ఆ మాటకు వస్తే అసలేమీ లేదన్న రీతిలో వ్యవహరించటం మోడీ సర్కారుకే సాధ్యమవుతుందేమో? కేంద్ర సహాయమంత్రి కుమారుడు.. అధికార మదంతో డ్రైవింగ్ చేసిన వైనం వీడియోలో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. ఇలాంటి వేళలో.. కేంద్రంలో ఉండే ఏ ప్రభుత్వమైనా పార్టీలకు అతీతంగా చర్యలు తీసుకునేందుకు వెనుకాడదు. అందుకు భిన్నంగా మోడీ సర్కారు మాత్రం అసలేం తెలీదన్నట్లుగా ఉండిపోవటం ఏమిటన్నది ప్రశ్నగా మారింది.

రాజకీయాల్ని పక్కన పెడితే.. ప్రజాస్వామ్య భారతంలో ఈ తరహా ఉదంతాల్ని అసలే మాత్రం సహించకూడని పరిస్థితి. వాస్తవానికి.. ఈ ఉదంతానికి కారణమైన కేంద్రమంత్రి కుమారుడ్ని అదుపులోకి తీసుకోవటంతో పాటు.. కేంద్రమంత్రిని ఇంటికి పంపించాల్సిన అవసరం ఉంది. కానీ.. అలాంటిదేమీ లేకుండా ఉండిపోవటం.. ఈ ఉదంతంపై విపక్షాలు విరుచుకు పడుతున్నా.. అసలేం పట్టనట్లుగా వ్యవహరించటం కనిపిస్తోంది.

ఇలాంటివేళ.. అనూహ్యంగా సీన్లోకి వచ్చింది దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. ఈ దారుణ ఘటనకు సంబంధించి గురువారం ఉదయం పదకొండు గంటలకు తాము వాదనలు వింటామని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ కేసును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. ఆందోళన చేస్తున్న రైతుల్ని కేంద్ర మంత్రి కుమారుడు కారున నడుపుతూ ఢీ కొట్టి.. వారి మరణానికి కారణమయ్యారు. అదేసమయంలో.. తీవ్ర ఆగ్రహానికి గురైన స్థానికులు ముగ్గురు బీజేపీ కార్యకర్తల్ని.. ఒక విలేకరి చనిపోవటం తెలిసిందే.

దీనిపై రాజకీయ పార్టీలు ఆందోళనలు చేపట్టిన వేళ.. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవటం ఆసక్తికరంగా మారింది. ఇదంతా చూసినప్పుడు మోడీ సర్కారు ఈ ఉదంతాన్ని లైట్ తీసుకున్నా.. సుప్రీం మాత్రం సీరియస్ గా తీసుకోవటం ఇప్పుడు సంచలనంగా మారింది. మరేం జరుగుతుందో చూడాలి.