Begin typing your search above and press return to search.

అంచనాలకు భిన్నంగా దుబ్బాక పోలింగ్ తర్వాతి రోజున మోడీ సర్కార్ సర్ ప్రైజ్

By:  Tupaki Desk   |   4 Nov 2020 2:50 PM GMT
అంచనాలకు భిన్నంగా దుబ్బాక పోలింగ్ తర్వాతి రోజున మోడీ సర్కార్ సర్ ప్రైజ్
X
అంచనాలకు భిన్నంగా వ్యవహరించటం ప్రధాని మోడీకి అలవాటే. దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో కేంద్రం తీరుపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే కాదు.. ఆయన కుమారుడు కమ్ మంత్రి కేటీఆర్ సైతం పెద్ద ఎత్తున రియాక్టు అయ్యారు. ఆ మధ్యన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన సందర్భంగా ఓపిక నశిస్తే.. ప్రధాని మోడీని సైతం నిలదీస్తామంటూ ఘాటు వ్యాఖ్య చేశారు.

దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం భారీగా చోటు చేసుకోవటమే కాదు.. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. అన్నింటికి మించి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడ్ని అరెస్టు చేసిన వైనంపై బీజేపీ నేతలంతా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కేసీఆర్ సర్కారు తీరును తీవ్రంగా తప్పు పట్టటమే కాదు.. వ్యక్తిగత విమర్శలు చేశారు తెలంగాణ బీజేపీ నేతలు.

దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనటమే కాదు.. రానున్న రోజుల్లో తెలంగాణ అధికారపక్షానికి కమలనాథులకు మధ్య మరిన్ని ఉద్రిక్తతలకు అవకాశం ఉందన్న మాట వినిపించింది. పోలింగ్ పూర్తయి.. దుబ్బాక ఉప ఎన్నికల ఫలితం ఈవీఎంలలో నిక్షిప్తమైన.. గెలుపుపై ఎవరికి వారు అంచనాలు వేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రంలోని మోడీ సర్కారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఊహించని రీతిలో సర్ ప్రైజ్ గిప్టు ఇచ్చారు.

ఢిల్లీ వసంత్ విహార్ లో టీఆర్ఎస్ కార్యాలయ నిర్మాణానికి 1100 చదరపు మీటర్ల భూమిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. భూమి అప్పగింత పనిని కేంద్రం ఈ రోజు పూర్తి చేసింది. అనుకోకుండా జరిగిన ఈ విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఉప ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ - బీజేపీ ఒక్కటేనని.. రెండుపార్టీల మధ్య అనుబంధం ఉందంటూ కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఉప ఎన్నిక పూర్తి అయ్యిందో లేదో టీఆర్ఎస్ పార్టీకి ఇంత భారీ ఎత్తున ఢిల్లీలో స్థలాన్ని కేటాయిస్తే కేంద్రం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.