Begin typing your search above and press return to search.

కోత మొదలైంది.. కేసీఆర్ సర్కారుకు షాకిచ్చిన మోడీ సర్కార్

By:  Tupaki Desk   |   6 July 2022 3:29 AM GMT
కోత మొదలైంది.. కేసీఆర్ సర్కారుకు షాకిచ్చిన మోడీ సర్కార్
X
నువ్వు చేసేది నువ్వు చేస్తే.. నేను చేసేది నేను చేస్తానన్నట్లుగా ఇప్పటి రాజకీయం మొదలైంది. గతంలో రాజకీయం సిద్ధాంతాల విభేదాల సమాహారంగా ఉండేది. ఆ తర్వాతి రోజుల్లో వ్యక్తిగతంగా మారటం.. ఇప్పుడు కక్ష సాధింపు చర్యల వరకు వెళ్లిపోయిన వైనం తెలిసిందే. గతంలో రాజకీయాలు కింద స్థాయిలో ఎంత తేడాగా ఉన్న అగ్ర నాయకత్వం వరకు వచ్చేసరికి కొన్ని అంశాల్ని పరిగణలోకి తీసుకొని.. లైన్ దాట కుండా జాగ్రత్తలు తీసుకునేవారు. అందుకు భిన్నంగా ఇప్పుడు పరిస్థితి ఉంది. మర్యాదల్ని పక్కన పెట్టేసి.. ఎవరికి ఎంత అవకాశం ఉందో.. అంతలా టార్గెట్ చేసే వైనం ఎక్కువైంది.

కేంద్రం వర్సెస్ రాష్ట్రం అన్నట్లుగా సాగుతున్న తెలంగాణలో.. ఇటీవల బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్ని హైదరాబాద్ లో నిర్వహించటం.. ఆ సందర్భంగా మోడీ అండ్ కోకు కేసీఆర్ సర్కారు ఎంతలా చుక్కలు చూపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చివరకు తమ సమావేశాల్ని ప్రచారం చేసుకోవటానికి వీలుగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవటానికి చుక్కలు చూపించిన వైనం పెద్ద రచ్చగా మారింది. అంతేకాదు.. భారీ బహిరంగ సభ నిర్వహించిన పెరేడ్ గ్రౌండ్ కు దగ్గర్లో తమ పార్టీకి చెందిన బెలూన్లను ఎగిరేలా చేసిన టీఆర్ఎస్ తీరుపైనా బీజేపీ నేతలు తీవ్రంగా తప్పు పట్టారు.

హైదరాబాద్ లో నిర్వహించిన జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా చుక్కలు చూపించిన కేసీఆర్ సర్కారుకు మోడీ సర్కారు షాకులిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ వాదనను బలపరిచేలా ఈ ఆర్థిక సంవత్సరంలో కేసీఆర్ ప్రభుత్వం సేకరించాలని భావిస్తున్న అప్పుల్లో రూ.19వేల కోట్లకు మోడీ సర్కారు కోత పెట్టేసింది. విద్యుత్ ప్రాజెక్టులకు తప్పించి.. కార్పొరేషన్ల పేరిట రాష్ట్రం తీసుకోవాలనుకునే గ్యారెంటీ అప్పులకు ఉన్న అవకాశాల్ని కేంద్రం మూసేసింది.

ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.52,167 కోట్ల అప్పు తీసుకోవాలని కేసీఆర్ సర్కారు భావించింది. దీనికి సంబంధించిన వివరాల్ని పొందుపర్చింది. అయితే..ఇటీవల కాలంలో కేంద్రం.. రాష్ట్రం మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బ తినటం.. ఒకరిని ఒకరు దెబ్బ తీసుకునే పరిస్థితులు చోటు చేసుకోవటం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ అప్పులపై కేంద్రం తాజాగా సరికొత్త అంశాన్ని చేర్చింది.

దీని ప్రకారం గత రెండేళ్ల బడ్జెట్ అప్పుతో పాటు గ్యారంటీ అప్పులను కూడా ఎఫ్ఆర్ బీఎం చట్టపరిధిలోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది. దీంతో పరిమితికి మించిన చేసిన అప్పును లెక్కబెట్టి.. ఆ మొత్తాన్ని ఈ ఏడాది తీసుకోవాలని తలపెట్టిన బడ్జెట్ అప్పుట్లో కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఆంక్షల మెలికతో తెలంగాణ రాష్ట్రం అప్పులు చేసే అవకాశాన్ని కోల్పోతుంది.

తాజా విధానంలో జీఎస్డీపీలో 3.5శాతం మేర అప్పులు చేసేందుకు తెలంగాణ రాష్ట్రానికి రూ.42,728 కోట్ల వరకే అప్పు చేసే వీలుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ సర్కారు దాదాపు రూ.19వేల కోట్ల మేర అప్పులు తీసుకునే అవకాశం మిస్ అవుతుంది. ప్రస్తుత బడ్జెట్ లో ఇరిగేషన్ కార్పొరేషన్ పేరుతో తీసుకోవాలనుకున్న అప్పుకు అవకాశం లేదని.. విద్యుత్ సంస్థల ద్వారా తీసుకునే అప్పుకు మాత్రమే అవకాశం ఉందంటున్నారు.

మోడీ సర్కారు తాజా నిర్ణయంతో కేంద్రం.. రాష్ట్రాల మధ్య రచ్చ మరింత పెరగటం ఖాయమంటున్నారు. దీనికి కారణం దేశంలోని అన్ని రాష్ట్రాలకు జీఎస్డీడీపీలో అప్పు తీసుకునే శాతానికి సంబంధించి ఒకే విధానం ఉండాలని.. అందుకు భిన్నంగా ఒక్కో రాష్ట్రానికి ఒక్కో తీరును కేంద్రం అమలు చేస్తుందని సీఎం కేసీఆర్ మండిపడుతున్నారు. పంజాబ్ లాంటి రాష్ట్రాలు 60 శాతం మేర అప్పులు చేస్తుంటే.. తెలంగాణ అప్పులు 25 శాతం లోపే ఉన్నాయని.. అయినప్పటికీ కేంద్రం ఇలా పరిమితులు పెట్టి కక్ష సాధింపు చర్యలకు తెర తీస్తుందన్న ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం ఇచ్చిన తాజా షాక్ కు కేసీఆర్ ఎలాంటి కౌంటర్ ఇస్తారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.