Begin typing your search above and press return to search.

మోడీ సర్కారు భారీ తప్పు.. టీకాపై సుప్రీం జోక్యం చేసుకోకూడదా?

By:  Tupaki Desk   |   12 May 2021 5:30 AM GMT
మోడీ సర్కారు భారీ తప్పు.. టీకాపై సుప్రీం జోక్యం చేసుకోకూడదా?
X
కాలం మారింది. అందుకు తగ్గట్లు.. మనుషులు.. మనసులు మారాలి. అన్నింటికి మించి మైండ్ సెట్ మారటం మంచిది. గతంలో తప్పుల్ని చేసి.. వాటిని కవర్ చేసుకుంటే సర్లెమని ఊరుకునేవారు. ఇప్పుడు అందుకు భిన్నం.. తప్పు జరగొచ్చు.. కానీ ఆ విషయాన్ని ఓపెన్ గా అంగీకరించి.. తామిక తప్పు చేయమని నిజాయితీగా చెప్పాలే కానీ.. ప్రజలు అక్కున చేర్చుకుంటున్నారు.. వాస్తవాన్ని అర్థం చేసుకుంటున్నారు. దేశ ప్రజల్లో వాస్తవాలని అర్థం చేసుకొని అంగీకరించే పరిస్థితిలో ఉన్నప్పుడు.. పాలకులు మరింత పారదర్శకంగా పని చేయాల్సి ఉంటుంది.

గతంలో పన్ను మోత మోగితే.. ప్రభుత్వాన్ని ఇష్టారాజ్యంగా తిట్టే వారు. కానీ.. ఇటీవల కాలంలో ప్రభుత్వాలు మాత్రం ఏం చేస్తాయని సర్దుకుంటున్నారు తప్పించి.. గతంలో మాదిరి హాహాకారాలు చేసే పరిస్థితి లేదు. ఇలాంటివేళ.. కేంద్రంలోని మోడీ సర్కారు అనుసరిస్తున్న విధానాలు చూస్తే.. నోట మాట రాని పరిస్థితి. వ్యాక్సినేషన్.. ఆక్సిజన్ కొరత మీద బాధ్యత కలిగిన ప్రభుత్వంగా ప్రజలకు జరిగిన తప్పుల్ని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది.

అందుకు భిన్నంగా ఇప్పటివరకు నోరు విప్పకుండా ఉండిపోతున్నారు. ఈ సమయంలో సుప్రీంకోర్టు ఈ అంశాల్ని సుమోటోగా తీసుకొని.. కేంద్రాన్ని వివరణ ఇవ్వాలని అడిగితే.. అందుకు కేంద్రం నుంచి వచ్చిన సమాధానం వింటే అవాక్కు అవ్వాల్సిందే. ఎందుకంటే.. కరోనాసెకండ్ వేవ్ సంక్షోభసమయంలో వ్యాక్సినేషన్ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం అవసరం లేదని కేంద్రం తేల్చి చెప్పటం గమనార్హం.

ఒకవేళ అలాంటి భావన ఉంటే.. ఈ రోజున దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ఇంత దారుణంగా నడవకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సింది. పాలకులు పని చేయనప్పుడు ప్రశ్నించే న్యాయస్థానానికి మోడీ సర్కారు హెచ్చరికలు చేయటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. చేయకూడని తప్పు ఏదో సుప్రీం చేస్తుందన్న భావన కలిగేలా కేంద్రం వ్యాఖ్యలు ఉండటం గమనార్హం. తామింత చెప్పిన తర్వాత కూడా సుప్రీంకోర్టు వినకుండా జోక్యం చేసుకుంటే.. ముందెన్నడూ చూడని అనాలోచిన పరిణామాల్ని చూడాల్సి వస్తుందని చేసిన వ్యాఖ్య.. కచ్ఛితంగా హెచ్చరికతో కూడుకున్నదే అవుతుంది.

నిజానికి దేశంలో సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా ఉంటుందని.. లాక్ డౌన్ పెట్టాలని.. టీకా కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించాలని ఇప్పటికే దేశీయంగా పలు వైద్య.. పరిశోధనా సంస్థలు నెత్తి నోరు కొట్టుకున్నా స్పందించింది లేదు మోడీ సర్కారు. అందుకు భిన్నంగా ఇప్పుడు సుప్రీంకోర్టులో టీకాలు.. వ్యాక్సినేషన్ అంశంపై దాఖలు చేసిన పిటిషన్ పై విచారణకు కేంద్రం నుంచి వివరణ కోరగా.. ఈ తరహా సమాధానం రావటం చర్చనీయాంశంగా మారింది.

మోడీ సర్కారు తన వైఫల్యాల్ని కప్పి పుచ్చుకోవటానికే ఇలాంటి ఎత్తుగడ వేసి ఉంటారని భావిస్తున్నారు. ఏమైనా.. ఇప్పటికే ఈ ఎపిసోడ్ లో తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్న మోడీ సర్కారు.. సుప్రీంకోర్టుకు ఇచ్చిన సమాధానంలో ఇలా వ్యవహరించకుండా ఉండాల్సిందన్న అభిప్రాయం పలువురి నోట వినిపిస్తోంది. ఈ దేశ ప్రజలు దేనినైనా భరిస్తారు కానీ.. పాలకుల్లో అహంకారన్ని.. వ్యవస్థల్ని నియంత్రించాలనే తీరును అస్సలు తట్టుకోలేరు. మోడీషాలు ఈ పాయింట్ ను ఎందుకు మిస్ అవుతున్నట్లు?