Begin typing your search above and press return to search.

మోడీ సర్కార్ రిలాక్స్ అయ్యే కీలక ప్రకటన వారు ఇవాళ చేయనున్నారా?

By:  Tupaki Desk   |   8 Dec 2021 7:34 AM GMT
మోడీ సర్కార్ రిలాక్స్ అయ్యే కీలక ప్రకటన వారు ఇవాళ చేయనున్నారా?
X
కీలక పరిణామానికి ఈ రోజు సాక్ష్యం కానుందా? సుదీర్ఘకాలంగా సాగి.. యావత్ దేశాన్ని ఆకర్షించి.. మోడీ సర్కారు మొండితనాన్ని వేలెత్తి చూపించటమే కాదు.. అంతటి మోడీని కిందకు లాగి.. తమ మార్గాన తెచ్చుకున్న ఘనత దేశ రాజధాని నగర సరిహద్దుల్లో నెలల తరబడి సాగుతున్న రైతు ఉద్యమానికి ఈ రోజు ముగింపు కార్డు పడే అవకాశం ఉందంటున్నారు. దీనికి సంబంధించిన కీలక ప్రకటనను సంయుక్త కిసాన్ మోర్చా చేస్తుందన్న మాట వినిపిస్తోంది.

రైతు సంఘాలు లేవనెత్తిన అన్ని డిమాండ్లకు కేంద్రం దాదాపుగా సానుకూలంగా స్పందించిందని.. మున్ముందు లేవనెత్తాల్సిన సమస్యలు.. ఆందోళనపై రైతు సంఘాల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్లుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో 40 రైతు సంఘాలతో కూడిన ప్రతినిధులు తాజాగా సమావేశమై.. ఆందోళనను విరమించే దిశగా చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది.

అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ రోజు (బుధవారం) వారి నుంచి మోడీ సర్కారు కోరుకుంటున్న సానుకూల ప్రకటన ఒకటి వస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.

అదే జరిగితే ఇంతకాలం మోడీ సర్కారుకు శిరోభారంగా మారిన సమస్య ఒక కొలిక్కి రావటమే కాదు.. ముగింపు పలికినట్లు అవుతుందని భావిస్తున్నారు.అయితే.. ఈ కీలక సమావేశంలో రైతు ఉద్యమ నేత రాకేశ్ టికాయిత్ పాల్గొనకపోవటంతో.. సమావేశంలో జరిగిన చర్చకు సంబంధించిన అంశాల్ని ఆయనతో చర్చించిన అనంతరం.. సానుకూల ప్రకటన వెలువడే వీలుందన్న మాట వినిపిస్తోంది.

మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించటంపై ప్రభుత్వ విధానంపై మాత్రం వారికి అభిప్రాయ బేధం ఉంది. దీనికి సంబంధించిన రాజీ పడటమో.. ప్రభుత్వమే వారు తగ్గట్లుగా వెనక్కి తగ్గటమో చేస్తే సరిపతుందని చెబుతున్నారు. ఏమైనా.. రైతు ఉద్యమ సంఘాలు తమ ఆందోళనను విరమిస్తే.. సుదీర్ఘ కాలంగా సాగుతున్న ఉద్యమం ముగియటం.. మోడీ సర్కారుకు సుదీర్ఘ నిట్టూర్పు విడిచే అవకాశం ఉందని చెప్పక తప్పదు.