Begin typing your search above and press return to search.

మోడీ సర్కార్ ‘లవ్ లెటర్’ ఆ రాష్ట్ర సర్కారుకు అందిందట

By:  Tupaki Desk   |   14 Sep 2021 3:05 AM GMT
మోడీ సర్కార్ ‘లవ్ లెటర్’ ఆ రాష్ట్ర సర్కారుకు అందిందట
X
తమ రాజకీయ లక్ష్యాల కోసం విచారణ సంస్థల్ని అస్త్రాలుగా వాడే కేంద్ర ప్రభుత్వాలు ఈ దేశానికి కొత్తేం కాదు. కాకుంటే.. గతంలోని కేంద్రంలో కొలువు తీరిన ప్రభుత్వాలు చేయలేని పనుల్ని మోడీ సర్కారు అలవోకగా చేసేస్తుందన్న అపప్రదను మాత్రం మూటగట్టుకున్నారు. తాము టార్గెట్ చేసిన రాష్ట్రాల్లోని ప్రభుత్వాలకు.. ఏదో కారణాన్ని సాకుగా చూపించి ఈడీ చేత నోటీసులు ఇప్పించటం ఎక్కువైందని.. తమ రాజకీయ శత్రుత్వానికి బహుమతిగా ఈడీని బరిలోకి దించటం మామూలుగా మారిందన్న మాట పలువురు చేస్తున్న పరిస్థితి. ఇలాంటివేళ.. ఈడీ నుంచి అందే నోటీసులపై బీజేపీయేతర ఏలుబడిలో ఉండే రాష్ట్ర ప్రభుత్వాలు సరికొత్తగా రియాక్టు అవుతున్నాయి.

తాజాగా అదే బాటలో నడుస్తోంది ఢిల్లీ రాష్ట్ర సర్కారుగా ఉన్న ఆప్ ప్రభుత్వం. తాజాగా ఆ పార్టీ నేత ఒకరు వ్యంగ్యంగా స్పందించారు. కేంద్ర సర్కారు నుంచి తమ పార్టీకి (కేజ్రీవాల్ కు చెందిన ఆమ్ ఆద్మీ) ప్రేమలేఖ అందినట్లుగా ఆ పార్టీకి చెందిన రాఘవ్ చద్దా పేర్కొన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నుంచి ఆప్ కు నోటీసు రావటంపై ఆయనీ విధంగా రియాక్టు అయ్యారు. ఆయన సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేశారు.

అందులో.. ‘తొలుత మోడీ సర్కారుకు ఇష్టమైన ఎన్ ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ నుంచి ఆప్ ప్రభుత్వానికి ప్రేమలేఖ అందింది. ఈ మధ్యాహ్నం (సోమవారం) ఢిల్లీలోని ఆప్ ప్రధాన కార్యాలయంలో నేనో ముఖ్యమైన మీడియా సమావేశాన్ని నిర్వహించనున్నాను. అందులో బీజేపీ రాజకీయ కుట్రల్ని బహిర్గతం చేయనున్నాను’ అని వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం రాజకీయ నేతలకు దర్యాఫ్తు సంస్థ నోటీసులు ప్రేమలేఖలే కానీ డెత్ వారెంట్లు కావని మహారాష్ట్ర అధికారపక్షమైన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించటం తెలిసిందే.

అదే ప్రేమలేఖ మాటను తాజాగా ఆప్ నేత చద్దా ప్రస్తావించటం చూస్తుంటే.. కేంద్రంలోని మోడీ సర్కారు తమను టార్గెట్ చేస్తున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటానికి వీలుగా ‘గాంధీగిరి’ని షురూ చేశారన్న భావన కలుగక మానదు. తీవ్ర వ్యాఖ్యలు చేస్తే.. రాజకీయంగా మారుతుంది. అందుకు భిన్నంగా ‘లవ్ లెటర్’ లాంటి పదాల్ని ప్రస్తావించటం ద్వారా..మోడీ సర్కారుకు ‘పంచ్’ గా మారుతుందన్నట్లుగా రాజకీయ పార్టీల ఆలోచనగా చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఈ ప్రేమలేఖల వ్యవహారం మోడీ సర్కారును ఏ తీరుకు చేరుస్తుందో చూడాలి.