Begin typing your search above and press return to search.

మాంద్యం పేరుతో కోత కోసి కారం పెట్టినంత పని చేశారుగా

By:  Tupaki Desk   |   22 Nov 2019 9:37 AM GMT
మాంద్యం పేరుతో కోత కోసి కారం పెట్టినంత పని చేశారుగా
X
రాష్ట్రాలతో మనకెందుకొచ్చిన పేచీ అన్నట్లుగా వ్యవహరిస్తూ వివాదాస్పద నిర్ణయాలు తీసుకునే సంకీర్ణ ప్రభుత్వాలకు కాలం చెల్లిపోయింది. మోడీకి ఉన్న ఛరిష్మాతో కేంద్రంలో తిరుగులేని బలంతో ప్రభుత్వాల్ని వరుస పెట్టి ఏర్పాటు చేస్తునన వైనం తెలిసిందే. ఇలాంటి వేళ రాష్ట్రాల మీద మరింత పట్టు సాధించేందుకు.. నిధుల కోసం కేంద్రం వైపు ఆశగా ఎదురుచూసేలా చేయటం కోసం ప్రధాని మోడీ వేసే ఎత్తుల గురించి తెలియంది కాదు.

రాష్ట్రాల నుంచి వచ్చే ఆదాయాన్ని.. తిరిగి రాష్ట్రాలకు ఇచ్చే విషయంలో మోడీ సర్కారు అనుసరించే తీరు కాస్త సిత్రంగా ఉంటుందనే చెప్పాలి. బీజేపీ పాలిత రాష్ట్రాలకు నిధుల కేటాయింపు విషయంలో ప్రత్యేక ఆసక్తిని ప్రదర్శించే మోడీ మాష్టారు.. ఇతర రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నిధుల విషయంలో ఎంతలా తిప్పుకుంటారో తెలిసిన విషయమే.

కేంద్రం ఇస్తున్న నిధులతో రాష్ట్రాలు ప్రత్యేక పథకాల్ని ప్రవేశ పెట్టి.. క్రెడిట్ అంతా కొట్టేస్తున్నాయన్నట్లు ఫీలయ్యే మోడీ మాస్టారు.. రాష్ట్రాలకు చుక్కలు కనిపించేలా తాజాగా ఒక నిర్ణయం తీసుకున్నారా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఢిల్లీ సర్కిల్స్ వారి నుంచి అందుతున్న సమాచారం ప్రకారం కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందే పన్నుల వాటాలో కోత పెట్టే దిశగా మోడీ మాష్టారు ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు.

ఇప్పటివరకూ కేంద్రం నుంచి రాష్ట్రాలకు 42 శాతం వాటా వస్తున్న పరిస్థితి. దీన్ని 33 శాతానికి తగ్గించేలా మోడీ సర్కారు నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఉన్నట్లుండి.. తొమ్మిది శాతం నిధుల్లో కోత పెడతారంటే రాష్ట్రాలు ఒప్పుకోవు. అందుకే దానికి మాంద్యం కవర్ వేసేందుకు రంగం సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది.

తన ఆలోచనలకు తగ్గట్లే 15వ ఆర్థిక సంఘానికి కేంద్రం మెమొరాండం ఇవ్వటమే కాదు.. రాష్ట్రాలకు ఇచ్చే వాటాలో ఎంత భాగాన్ని తగ్గించాలన్న విషయం మీద క్లారిటీ ఇవ్వలేదు. కాకుంటే వీలైనంత మేర తగ్గించేలా ప్రయత్నాలు సాగుతున్నాయి. మరోవైపు.. కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందే నిధుల శాతాన్ని పెంచాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తోపాటు పశ్చిమబెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి దీదీతో సహా పలువురు కోరుతున్నారు.
ఓవైపు రాష్ట్రాలు తమకు ఇచ్చే నిదుల వాటాను పెంచాలని డిమాండ్ చేస్తున్న వేళ.. మరోవైపు అనూహ్యంగా కేంద్రం నుంచి వచ్చే నిధుల వాటాకు కోత కోస్తూ.. కారం రాసేలా మోడీ సర్కారు చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. దీంతో.. రాష్ట్రాలు కుతకుతలాడిపోయే పరిస్థితి.

కేంద్రం నుంచి వచ్చే నిధుల్ని పెంచుకోవటం ద్వారా ఆయా రాష్ట్రాలు తమ ప్రభుత్వ మైలేజీ పెరిగేలా ప్రభుత్వ పథకాల్ని అమలు చేయాలని పలు రాష్ట్రాలు ఆలోచిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. కేంద్రం నుంచి నిధుల రాక తగ్గితే.. రాష్ట్రాలు నిధుల సమస్యల్ని ఎదుర్కోవటంతో పాటు.. తాము అమలు చేస్తున్న పలు పథకాలకు అవసరమైన నిధుల్ని సమకూర్చుకోవటంలో ఇబ్బందికరంగా మారుతుందంటున్నారు.

గురి చూసి కొట్టిన రీతిలో.. మాంద్యం పేరుతో రాష్ట్రాలు సైతం నోరు విప్పేందుకు వీలు లేని రీతిలో మోడీ మాస్టారు అస్త్రం ప్రదర్శించారని చెబుతున్నారు. మోడీ సర్కారు సూచనను ఆర్థిక సంఘం కానీ అంగీకరించిన పక్షంలో రాష్ట్రాలకు వచ్చే నిధుల్లో పెద్ద ఎత్తున కోత పడటం ఖాయం. అదే జరిగితే.. ఎన్నికల వేళ ఆయా రాష్ట్రాల్లోని అధికారపక్షాలు ఎవరికి వారుగా తమ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చుకోలేని పరిస్థితి ఏర్పడుతుందంటున్నారు. మరీ అంశంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ రీతిలో రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు. మొత్తంగా చూస్తే.. రాష్ట్రాలంతా ఎంతో ఆశగా ఎదురుచూసే కేంద్రం నిధుల్లో కోత పెడుతూ మమ అనిపిస్తే.. కేంద్ర.. రాష్ట్రాల మధ్య రచ్చ రాజుకుంటుందన్నది చెప్పక తప్పదు.