Begin typing your search above and press return to search.

ఆంధ్రోడికి కడుపు మండే మాట చెప్పిన నీతి ఆయోగ్ పెద్ద మనిషి

By:  Tupaki Desk   |   17 Dec 2021 5:00 AM GMT
ఆంధ్రోడికి కడుపు మండే మాట చెప్పిన నీతి ఆయోగ్ పెద్ద మనిషి
X
సాక్ష్యాత్తు దేశ ప్రధాని పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చిన కీలక అంశాన్ని సింఫుల్ గా తూచ్ అనేయటం మన దేశంలోనే సాధ్యమేమో? తనకు ముందున్న ప్రధానమంత్రి ఇచ్చిన వరాన్ని.. తాను కొనసాగిస్తానన్న విషయాన్ని ఎన్నికల వేళలో నరేంద్ర మోడీ చెప్పకుంటే.. ఈ రోజున ఆయన్ను వేలెత్తి చూపించే హక్కు ఎవరికి ఉండేది కాదు.

ఏ దేశంలో అయినా.. కీలక అంశాల మీద అధికారంలో ఉండే వారు ఇచ్చే హామీని వ్యతిరేకిస్తే.. మొదట్నించి వ్యతిరేకించాలి. అందుకు భిన్నంగా వ్యవహరించిన మోడీ.. ఇప్పుడు ఏపీకి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా విషయంలో వ్యవహరిస్తున్న వైఖరి ఆంధ్రోడికి కడుపు మండేలా చేస్తోంది.

రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పిన నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ మాటను.. ఆ తర్వాత ప్రధాని కుర్చీలో కూర్చున్న మోడీ.. ఎన్నికల సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పటం మర్చిపోకూడదు. ఎన్నికల్లో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకున్నంతనే మాట మార్చేసిన మోడీ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినప్పటికి వాటిని పట్టించుకోకుండా తాము పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్న చందంగా వ్యవహరిస్తున్నారు.

ప్రత్యేక హోదా అన్నది ముగిసిన అధ్యాయమని.. పద్నాలుగో ఆర్థిక సంగం సిఫార్సు తర్వాత హోదా అంశం తెర మరుగైందని పదే పదే చెప్పే కేంద్రం.. తాజాగా అందుకు భిన్నమైన పల్లవిని వినిపించటం విశేషం.తాజాగా బిహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలన్న డిమాండ్ ను పరిశీలిస్తున్నట్లుగా నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ చేసిన ప్రకటన ఇప్పుడు ఆంధ్రోళ్లలో చురుకు పుట్టిస్తోంది.

గడిచిన ఏడున్నరేళ్లుగా ఎన్నోసార్లు.. ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించటం.. అదిప్పుడు సాధ్యం కాదని తేల్చేయటం.. ఆ మాటకు వస్తే.. దేశంలో ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి ఇచ్చేది లేదని చెప్పే మోడీ సర్కారుకు భిన్నంగా నీతి ఆయోగ్ పెద్దాయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలాన్ని రేపుతున్నాయి.

తాజాగా ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన.. గత దశాబ్దంగా బిహార్ లో డెవలప్ మెంట్ చెప్పుకోదగిన స్థాయిలో సాధించినప్పటికీ.. అంతకు ముందు ఆ రాష్ట్రంలో వెనుకుబాటుతనం నెలకొన్న కారణంగా ఇతర రాష్ట్రాలతో సమానంగా ముందంజ వేసేందుకు వీలుగా ప్రత్యేక హోదా అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు.విభజన కారణంగా ఏపీకి జరిగిన నష్టం అంతా ఇంతా కాదు.

ఒక విధంగా చెప్పాలంటే.. గంటకు అరవై కిలోమీటర్ల వేగంతో వెళ్లే వాహనం సడన్ బ్రేక్ వేస్తే ఎలాంటి పరిస్థితితో ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉంది. అంతే కాదు.. హైదరాబాద్ లాంటి మహానగరం రాజధానిగా మిస్ కావటం.. మరోరాజధాని నగరాన్ని నిర్మించుకోవాల్సి రావటం తెలిసిందే. ఇలాంటి వేళలో.. ప్రత్యేక హోదా ఏపీకి సంజీవినిగా మారుతుందన్న అభిప్రాయం అందరూ వ్యక్తం చేసేదే.

కానీ.. ప్రత్యేక హోదా ముగిసిన చాప్టర్ అని చెప్పే కేంద్రం తీరుకు భిన్నంగా నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ చేసిన కీలక వ్యాఖ్య ఇప్పుడు రాజకీయ వేడిని రగిల్చినట్లుగా చెప్పక తప్పదు. మరి.. ఏపీ అధికార.. విపక్షాలు ఈ వ్యాఖ్యపై ఏ రీతిలో రియాక్టు అవుతారో చూడాలి.