Begin typing your search above and press return to search.

మోడీ బ్రాండ్ బాజాకు 35 కోట్లు

By:  Tupaki Desk   |   2 Aug 2016 8:00 AM GMT
మోడీ బ్రాండ్ బాజాకు 35 కోట్లు
X
రాజకీయ నాయకులు - ప్రభుత్వాధినేతలు సొంత డబ్బా కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వ ఖజానా నుంచి కోట్లు ఖర్చు చేసి ప్రచారం చేసుకుంటున్నారు. సందర్భం దొరికితే చాలు పత్రికల్లో మొదటి పేజీలు నింపేస్తున్నారు. టీవీల్లో రోజంతా ఊదరగొట్టేస్తున్నారు. రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు - కేంద్రంలో ప్రధాన మంత్రి.. మంత్రులు.. ఇలా అందరిదీ ఇదే పంథా. కొద్దిరోజుల కిందట కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి రెండేళ్లు పూర్తయిన సందర్భంలోనూ భారీగా ప్రకటనలిచ్చారు. అందుకు అయిన ఖర్చు అక్షరాల 35 కోట్లట. అది కేవలం ప్రింటు మీడియాలో ఇచ్చిన ప్రకటనలకు చేసిన ఖర్చు మాత్రమే.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రింట్ మీడియా అడ్వర్టైజ్‌మెంట్ల కోసం చేసిన ఖర్చు 35 కోట్ల రూపాయాలు. సమాచార హక్కు చట్టం కింద అనిల్ గల్గానీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలను కేంద్రం అందజేసింది. 11,236 వార్తా పత్రికల్లో అడ్వర్‌ టైజ్‌ మెంట్లు ఇచ్చినట్లు డిఎవిపికి చెందిన పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారి రూపావేది ఈ వివరాలను అందించారు.

‘ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా’ - ‘వికాస్ కీ రఫ్తార్’ - ‘బద్ధకారోబార్’ - ‘జన్ జన్ కా ఉధార్’ అనే నినాదాలతో వివిధ జాతీయ పత్రికలతోపాటు - ప్రాంతీయ పత్రికల్లోనూ భారీగా ప్రకటనలు గుప్పించారు. అయితే.. మోడీ కంటే ముందు ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్నప్పుడు మాత్రం ఇలా ఖర్చు చేయలేదట. ఒక్క రూపాయి కూడా ప్రకటనల కోసం ఖర్చు చేయలేదట. అడపాదడపా ఆయా మంత్రిత్వ శాఖలు ప్రకటనలిచ్చినా స్వయంగా మన్మోహన్ ఇలా రెండేళ్లకు - మూడేళ్లకు అంటూ ప్రకటనలిచ్చే అలవాటు చేసుకోలేదట. ఈ విషయంలో మోడీ మాత్రం ఇంతకుముందరి ప్రధానులందరి కంటే భారీగా ఖర్చు చేస్తున్నారట.