Begin typing your search above and press return to search.

మోడీ సర్కార్ వార్నింగ్ కు ట్విటర్ తల వంచక తప్పలేదు

By:  Tupaki Desk   |   16 Jun 2021 9:30 AM GMT
మోడీ సర్కార్ వార్నింగ్ కు ట్విటర్ తల వంచక తప్పలేదు
X
మొండోడు రాజు కంటే బలవంతుడు అంటారు. మరి.. అలాంటిది మొండోడే రాజు అయితే.. ఆ రాజుకు అసమాన ప్రజాదరణ తోడైతే.. ఎలా ఉంటుంది? తాజాగా సోషల్ మీడియా దిగ్గజానికి ఆ విషయం బాగానే అర్థమైంది. ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయిన ట్విటర్ చెప్పే మాటలు ఎలా ఉన్నా.. తమ దేశ చట్టాలకు లోబడి పని చేయాలనే దేశాల మాటను లైట్ తీసుకోవటం బాగా తెలుసు. అదే రీతిలో భారత్ లో మోడీ సర్కారు విషయంలోనూ అలాంటి తప్పు చేసి.. అందుకు తగ్గ మూల్యాన్ని చెల్లించుకుంది.

మిగిలిన దేశాల మాదిరే.. తమ మొండితనంతో మోడీ సర్కారు ముందు కుప్పిగంతులు వేయాలని ట్రై చేసింది కానీ.. ఆ సంస్థకు మించిన మొండితనం మోడీ మాష్టారిదన్న విషయాన్ని కాస్త ఆలస్యంగా గుర్తించింది. దేశీయంగా ట్విటర్ కు సంబంధించి తలెత్తే సమస్యల్ని వెంటనే పరిష్కరించేందుకు వీలుగా ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని కేంద్రం కోరింది. అయితే.. అందుకు ట్విటర్ ససేమిరా అన్నది. ఆ తర్వాత సదరు అధికారిని నియమించినట్లు చెబుతూ.. మొయిల్ ఐడీ ఇచ్చింది. ఇలా తన తీరుతో చుక్కలు చూపించే ట్విటర్ కు మోడీ సర్కారు దిమ్మ తిరిగే షాకిచ్చింది.

మిగిలిన దేశాల్లో మాదిరి.. ప్రభుత్వాలు చెప్పే మాటల్ని పట్టించుకోకుండా ఉండటం భారత్ లో సాధ్యం కాదన్న విషయం ట్విటర్ కు అర్థమైంది. అందుకే.. కేంద్ర ప్రభుత్వం కోరిన తాత్కాలిక చీఫ్ కంప్లైయెన్స్ అధికారిని నియమించింది. అదే సమయంలో.. ఆ అధికారి వివరాల్ని వెల్లడిస్తానని పేర్కొంది.

కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఐటీ నిబంధనల్ని తక్షణమే పాటించటానికి చివరి అవకాశాన్ని ఇచ్చింది. ఒకవేళ తాము చెప్పినట్లు చేయకుంటే.. మొదటికే మోసం వస్తుందన్న విషయాన్ని అర్థం చేసుకుంది. అందుకే.. కేంద్రం నుంచి వెలువడిన సందేశంలోని తీవ్రతను గుర్తించిన ట్విటర్ .. వెంటనే ఒక అధికారిని నియమిస్తూనిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించింది. వారంలో సదరు అధికారికి సంబంధించిన అదనపు వివరాల్ని వెల్లడిస్తానని పేర్కొంది. మొత్తానికి ట్విటర్ మొడలు వంచటంలో కేంద్రంలోని మోడీ సర్కారు సక్సెస్ అయ్యిందనే చెప్పాలి.