Begin typing your search above and press return to search.

ఆ విష‌యంలో రాహుల్‌ ను కాపీ కొట్టేసిన బాబు

By:  Tupaki Desk   |   25 Oct 2018 1:30 AM GMT
ఆ విష‌యంలో రాహుల్‌ ను కాపీ కొట్టేసిన బాబు
X
ప్రతిష్టాత్మకమైన అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐలో చోటుచేసుకున్న పరిణామాలు దేశ‌వ్యాప్తంగానే కాకుండా ప్ర‌పంచ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేకెత్తిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుత డైరెక్ట‌ర్ల‌ను అక‌స్మాత్తుగా సెల‌వు మీద పంపించ‌డం - దాన్ని నిర‌సిస్తూ వారు కోర్టును ఆశ్ర‌యించ‌డం - కొత్త డైరెక్ట‌ర్‌ ను నియ‌మించ‌గా ఆయ‌నపై ప‌లువురు అవినీతి ఆరోప‌ణ‌లు చేయ‌డం వంటివి క‌ల‌క‌లంగా మారాయి. ఈ ఎపిసోడ్‌ లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ - ఏపీ ముఖ్య‌మంత్రి - తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు ఒకే త‌ర‌హా డైలాగ్‌ ను వినిపించ‌డం రాజ‌కీయ‌వర్గాల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

సీబీఐ డైరెక్ట‌ర్‌ ను సెల‌వుపై పంపించిన ఎపిసోడ్‌ పై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ స్పందిస్తూ రఫేల్ స్కాం రోజురోజుకు బీజేపీ పరువు బజారుకీడుస్తోందనే భయంతోనే మోడీ ప్రభుత్వం సీబీఐ డైరెక్టర్ ని సెలవుపై పంపిందని ఆరోపించారు. రఫేల్‌ యుద్ధ విమానాల డీల్ కు సంబంధించి సీబీఐ డైరెక్టర్ అలోక్‌ వర్మ ఇప్పటికే పలు పత్రాలను సేకరించే ప్రయత్నంలో ఉన్నాడని ఆయనను పదవి నుంచి తొలగించారని రాహుల్ విమర్శించారు. రఫేల్‌ ఒప్పందంపై ఆయన విచారణ జరుపుతారనే భయంతోనే ఈ పనిచేశారని పేర్కొన్నారు. ప్రధాని తీరు స్పష్టంగా తెలుస్తోందని విమర్శించారు. దేశం - దేశంలోని రాజ్యాంగం ప్రమాదంలో ఉందని రాహుల్ గాంధీ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

కాగా, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సైతం ఇదే త‌ర‌హా వ్యాఖ్య‌లు చేశారు. రాఫెల్‌ కుంభకోణంపై విచారణ చేస్తారనే భయంతోనే సీబీఐ డైరెక్టర్‌ ను తొలగించేశారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. దీని ద్వారా రాఫెల్ స్కామ్‌ తో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం ఉందనేది స్పష్టంగా రుజువు అవుతోందన్నారు. సీబీఐలో నెలకొన్న ప్రస్తుత దుష్పరిణామాలకు ప్రధానమంత్రి బాధ్యత వహించాలని.. జాతికి ప్రధాని సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. అవినీతిని పట్టుకోవాల్సిన వాళ్లే అవినీతిలో భాగస్వాములు కావడం పతనానికి పరాకాష్టని అన్నారు. సీబీఐ మొత్తం అవినీతి ఊబిలో కూరుకుపోయిందన్న ఆయన.. సీబీఐ వ్యవహారాల్లో రాజకీయా నాయకుల జోక్యం ఉండకూడదన్నారు. కానీ మోడీ ప్రభుత్వం వ్యవస్థలను భ్రష్టు పట్టించిందని విమర్శించారు. 'ఏ చట్టం కింద - ఏ అధికారం కింద సీబీఐ డైరెక్టర్‌ ను తొలగించారు..? ఇది సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమే.. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ప్రజాస్వామ్య మనుగడకు పెనుముప్పు' అని అన్నారు.

సీబీఐఈ డైరెక్టరు ను నిన్న అర్ధరాత్రి విధుల నుంచి తొలగించడం చూస్తే.. ఏ వ్యవస్థా స్వతంత్రంగా పని చేయడం బీజేపీకి ఇష్టం లేదనిపిస్తోందని చంద్ర‌బాబు అన్నారు. దర్యాప్తు సంస్థలకు స్వతంత్ర ప్రతిపత్తినిస్తూ సుప్రీంకోర్టు వినీత్ నారాయణ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో స్పష్టమైన ఆదేశాలను ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రధానమంత్రి - లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు - సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సభ్యులుగా ఉన్న కమిటీ సీబీఐ డైరెక్టరును ఎంపిక చేస్తుంది' అని బాబు అన్నారు. కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం.. వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తోందని చంద్ర‌బాబు ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ నేతలు ఒక తప్పు చేసి దానిని కప్పిపుచ్చబోయి తప్పుమీద తప్పులు చేస్తున్నారని విమర్శించారు. ప్రశ్నించేవారిని దాడులతో భయపెట్టాలని చూస్తోందని బాబు వ్యాఖ్యానించారు.