Begin typing your search above and press return to search.

ఏది నిజం: ఆర్టికల్ 370 రద్దు అయినట్లా? కాదా?

By:  Tupaki Desk   |   6 Aug 2019 5:20 AM GMT
ఏది నిజం: ఆర్టికల్ 370 రద్దు అయినట్లా?  కాదా?
X
జమ్ము-కశ్మీర్ సమస్యకు పరిష్కారంగా మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ఒక విషయంలో కాస్తంత క్లారిటీ మిస్ అయ్యిందని చెప్పాలి. ఆర్టికల్ 370ను రద్దు చేసినట్లుగా పలువురు పేర్కొంటున్నారు. చాలా మీడియా సంస్థలు ఇదే విషయాన్ని పేర్కొన్నాయి. ఇక్కడే అందరూ తప్పులో కాలేశారని చెప్పాలి. చాలా మీడియా సంస్థలు పేర్కొంటున్నట్లుగా ఆర్టికల్ 370ను మోడీ సర్కారు రద్దు చేయలేదు. మరేం చేశారంటారా? అక్కడికే వస్తున్నాం. ఆర్టికల్ 370ను రద్దు కాకుండా దానికున్న కోరల్ని పీకేసి.. నిర్వీర్యం చేశారు.

అంటే.. ఆర్టికల్ 370 ఉంటుంది. కానీ.. నిన్నటి వరకు కశ్మీర్ కు రక్షణ కవచంగా నిలిచిన ఆర్టికల్ 370లోని కీలక అంశాలకు మార్పులు చేశారు. భారత్ కు పూర్తి సొంతం కాకుండా ఉండేలా చేసే కొన్ని అంశాలకు సవరణలు చేపట్టారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. మోడీ సర్కారు తీసుకున్న తాజా నిర్ణయాల తర్వాత కూడా ఆర్టికల్ 370 ఉంటుంది. కానీ.. అందులోని అంశాల్ని మార్చేయటం వల్ల.. జమ్ముకశ్మీర్ కు ఉండే స్వయం ప్రతిపత్తి అలా నిలిచిపోతుంది.

ఆర్టికల్ 370ను రద్దు చేయాలంటే రాజ్యాంగ సవరణ అవసరం. అది చాలా కష్టమైన.. క్లిష్టమైన ప్రక్రియ. దీర్ఘ కాలం సాగే అవకాశం ఉంది. అందుకే.. దాని జోలికి వెళ్లని మోడీ సర్కారు.. ఆర్టికల్ 370ను రద్దు చేయకుండా.. దానికి కొన్ని సవరణలు చేయటం ద్వారా.. దాని కోరలు పీకేసింది. ఇంతకాలం ఏ ఆర్టికల్ 370 కారణంగా జమ్ముకశ్మీర్ భారత్ కు పూర్తిస్థాయిలో సొంతం కాకుండా చేసిందో.. ఇప్పుడు అదే ఆర్టికల్ 370 భారత్ లో కలిసిపోయేలా మేజిక్ చేశారు మోడీ అండ్ టీం.