Begin typing your search above and press return to search.

మోడీ సర్కారా? మజాకానా?.. ఆ మాజీ సీఎంల విడుదల ఎప్పుడో చెప్పలేరట

By:  Tupaki Desk   |   5 Dec 2019 5:41 AM GMT
మోడీ సర్కారా? మజాకానా?.. ఆ మాజీ సీఎంల విడుదల ఎప్పుడో చెప్పలేరట
X
అందరూ చేసే పని చేస్తే ఆయన్ను నరేంద్ర మోడీ ఎందుకంటారు? తనకంటూ ఒక స్టైల్ ఉంటానికి ఇష్టపడతారు. మోడీ లాంటి బలమైన ప్రజాకర్షక నాయకుడికి రాజకీయాల్లో తన మార్క్ వేయాలనుకోవటం తప్పేం కాదు. జంకు లేకుండా కీలక నిర్ణయాల్ని అదే పనిగా తీసుకోవటంలో తనకు సాటి మరెవ్వరూ ఉండరన్న విషయాన్ని ఇటీవల పరిణామాలు స్పష్టం చేశాయని చెప్పాలి.

ఆర్టికల్ 370 నిర్వీర్యం చేస్తూ నిర్ణయం తీసుకోవటం.. తదనంతర పరిణామాల్ని ఫేస్ చేయటం మాటలు కాదు. ఇలాంటి విషయాల్ని మోడీ డీల్ చేసే విధానం కఠినంగా ఉండటమే కాదు..మొండిగా వ్యవహరిస్తారన్న పేరుంది. ఆర్టికల్ 370 నిర్వీర్యం చేస్తూ జమ్ముకశ్మీర్ కు కల్పించినప్రత్యేక హోదాను రద్దు చేసి.. దేశంలోని మిగిలిన రాష్ట్రాల సరసన చేర్చిన ఘనత మోడీదే అవుతుంది.

ఈ నిర్ణయంపై కశ్మీరీలు గుర్రుగా ఉన్నప్పటికీ ఆయన వెనక్కి తగ్గటం లేదు. ఇదిలా ఉంటే.. ఆర్టికల్ 370 నిర్వీర్యం చేస్తూ నిర్ణయం తీసుకున్న వేళలోనే ఆ రాష్ట్రానికి చెందిన మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా.. మెహబూబా ముఫ్తీలతో పాటు మరికొందరు వేర్పాటు నేతల్ని.. రాజకీయ నేతల్ని అరెస్టు చేసిన వైనం తెలిసిందే.

అధికారికంగా జమ్ముకశ్మీర్ లో మొత్తం 5161మందిని ఆగస్టు 4న నిర్బందంలోకి తీసుకున్నట్లు చెబుతారు. వీరిలో మాజీ ముఖ్యమంత్రులు మొదలుకొని రాళ్ల దాడికి పాల్పడిన వారూ లేకపోలేదు. అందరిని ఒకే గాటున కట్టకున్నా.. మాజీ ముఖ్యమంత్రులకుప్రత్యేక మినహాయింపులేమీ లేవన్న విషయాన్ని మోడీ సర్కారు తన చేతలతో చేసి చూపించిందని చెప్పాలి.

తాజాగా లోక్ సభలో మాజీ ముఖ్యమంత్రులు ఒమర్.. మెహబూబాలను ఎప్పుడు విడుదల చేస్తామన్నది తాము ఇతిమిద్దంగా అయితే చెప్పలేమని కేంద్రం స్పష్టం చేయటం సంచలనంగా మారింది. కశ్మీర్ లో పరిస్థితులు చక్కబడ్డట్లు ఒకపక్క చెబుతూనే.. మరోవైపు వారిని నిర్భందంలో ఉంచటంలో అర్థమేమైనా ఉంటుందా? అన్న చర్చ జరుగుతున్న వేళ.. అందుకు భిన్నంగా ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల విడుదల గడువును చెప్పటం సాధ్యం కాదని తేల్చేసింది. ఇంత కఠినంగా వ్యవహరించటం మోడీ సర్కారుకు మాత్రమే సాధ్యమవుతుందేమోనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.