Begin typing your search above and press return to search.

ఇండియాను చూసి వణుకుతున్న దావూద్

By:  Tupaki Desk   |   18 May 2016 7:06 AM GMT
ఇండియాను చూసి వణుకుతున్న దావూద్
X
ఒకప్పుడు ఇండియాను గడగడలాడించిన అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఇప్పుడు ఇండియాను చూసి వణుకుతున్నాడట. ఏ క్షణమైనా తనను ఇండియాకు తీసుకువెళ్లిపోయే ప్రమాదముందని ఆందోళన చెందుతున్నాడట. 1993లో ముంబైలో మారణహోమం సృష్టించి పాక్ పారిపోయిన అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను దేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలే అందుకు కారణం.

ఇంతకుముందు కూడా దావూద్ ను ఇండియాకు తెచ్చేందుకు ప్రయత్నాలు చేసినా ఈస్థాయిలో ఎన్నడూ లేవు. ఒకట్రెండు సార్లు ప్రయత్నాలు ఫలించినట్లే ఫలించి ఆగిపోయాయి. దీంతో ఈసారి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అతడిని దెబ్బకొట్టేందుకు సరికొత్త మార్గం ఎంచుకుంది. ఇందులో భాగంగా ఆర్థిక మూలాలపై దృష్టి సారించిన ఈడీ... వాటిని స్తంభింపజేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అన్ని మార్గాలనూ మూసేసి దావూద్ ను దారికి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తోంది.

తొలుత అతణ్ని ఆర్థికంగా దెబ్బతీస్తే అతని నేర సామ్రాజ్యం కుప్పకూలుతుంది. అప్పుడు పాకిస్థాన్ వంటి దేశాలకు అతనితో పనుండదు.. ఆయనకు మద్దతిచ్చేవారు తగ్గిపోతారు. రక్షించి - ఆశ్రయమిచ్చేందుకు వెనకాడుతారు. ఫలితంగా ఇండియాకు రప్పించే ప్రయత్నాలు సులభమవుతాయి. ఈ వ్యూహంతో వెళ్తున్న ఇండియాకు అంతా సానుకూల వాతావరణం ఎదురవుతోంది. దావూద్ ఆస్తులను స్తంభింపచేయాలని వివిధ దేశాలకు ఇండియా రాసిన లేఖలకు ఆయా దేశాల నుంచి సానుకూల స్పందనే కనిపిస్తోంది. దావూద్ వివిధ దేశాల్లో దావూద్ పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టినట్లు పక్కా ఆధారాలు సేకరించిన ఈడీ వాటిని స్తంభింపజేస్తోంది.

ఇందులో భాగంగా తొలి విడత కింద ఆరు దేశాలకు లెటర్ రొగేటరీలను రాసిన ఈడీ... ఆయా దేశాల్లోని దావూద్ ఆస్తులను స్తంభింపజేయాలని కోరింది. దౌత్య సంబంధాల నేపథ్యంలో భారత్ రాసిన ఈ లెటర్లకు ఆయా దేశాలు సానుకూలంగా స్పందించక తప్పని పరిస్థితి నెలకొంది. వెరసి ఆయా దేశాల్లో దావూద్ కూడబెట్టిన ఆస్తులు అతడికి దక్కకుండాపోవడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇదే జరిగితే దావూద్ నెలకొల్పిన నేర సామ్రాజ్యం ఛిన్నాభిన్నం కావడం ఖాయమే. భారత్ రాసిన లేఖల విషయం తెలుసుకున్న దావూద్ బెంబేలెత్తిపోతున్నాడని సమాచారం.