Begin typing your search above and press return to search.

మోడీ సంచ‌ల‌నం: ఇక‌.. ట‌్రిపుల్ త‌లాక్ శిక్షార్హం!

By:  Tupaki Desk   |   19 Sep 2018 10:39 AM GMT
మోడీ సంచ‌ల‌నం: ఇక‌.. ట‌్రిపుల్ త‌లాక్ శిక్షార్హం!
X
త‌గ్గుతున్న ఇమేజ్ ను పెంచుకోవ‌టానికి మోడీ ఏం చేస్తారు? పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌లు భారీగా పెరిగి.. లీట‌రు పెట్రోల్ ధ‌ర రూ.వంద‌కు చేరుకుంటున్న వేళ‌.. మోడీ స‌ర్కారుకు మూడింద‌న్న వాద‌న‌లు జోరందుకున్న వేళ‌.. అస‌లు చ‌ర్చ‌ను మొత్తం మార్చేలా.. ప్రాధామ్యాలు మారిపోయేలా మోడీ స‌ర్కారు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది.

ట్రిఫుల్ త‌లాక్ శిక్షార్హ‌మైన నేరంగా తేల్చింది. దీనికి సంబంధించి కేబినెట్ నిర్ణ‌యం తీసుకుంది. దీనికి సంబందించిన ఆర్డినెన్స్ ను ఓకే చేయ‌టం ద్వారా ట్రిఫుల్ త‌లాక్ బిల్లును చట్టంగా మార్చే ప్ర‌క్రియ‌ను చేప‌ట్టిన‌ట్లైంది.

వాస్త‌వానికి ముస్లిం మ‌హిళ‌ల‌కు అండ‌గా నిలుస్తుంద‌ని భావిస్తున్న ట్రిఫుల్ త‌లాక్ బిల్లును గ‌త పార్ల‌మెంటు స‌మావేశ కాలంలో బిల్లు రూపంలో పెట్టారు. కానీ.. ఇది ముందుకు పోలేదు. ఈ నేప‌థ్యంలో కేంద్రం త‌న చేతుల్లో ఉన్న ఆర్డినెన్స్ అస్త్రాన్ని ఉప‌యోగించుకొని ట్రిపుల్ త‌లాక్ ను చ‌ట్టంగా మార్చేసింది.

త‌లాక్ చెప్ప‌టం ద్వారా భార్య‌కు విడాకులు ఇచ్చే విధానం ముస్లింల‌లో ఎంతోకాలంగా సాగుతోంది. దీనికి చెక్ పెట్టేందుకు వీలుగా ముస్లిం మ‌హిళ‌ల బిల్లు 2017ను గ‌త డిసెంబ‌రు 28న లోక్ స‌భ‌లో ఆమోదించారు. అయితే.. రాజ్య‌స‌భ‌లో ఆమోదం పొందలేదు. ఈ బిల్లులో స‌వ‌ర‌ణ‌లు చేయాల‌ని కాంగ్రెస్ తో స‌హా ప‌లు ప్ర‌తిప‌క్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఇక‌.. ఈ మ‌ధ్య‌న జ‌రిగిన వ‌ర్షాకాల స‌మావేశాల్లోనూ ఈ బిల్లుపై చ‌ర్చ జ‌ర‌గ‌లేదు.

ఈ నేప‌థ్యంలో కేంద్రం ఆర్డినెన్స్ బాట ప‌ట్టి.. బిల్లును చట్టంగా మారుస్తూ నిర్ణ‌యం తీసుకుంది. దీనికి రాష్ట్రప‌తి ముద్ర ప‌డితే.. అధికారిక ఉత్త‌ర్వుల ద్వారా చ‌ట్టంగా మారుతోంది. మోడీ కేబినెట్ ఆమోదించిన తీర్మానాన్ని రాష్ట్రప‌తి కోవింద్ వ్య‌తిరేకించే అవ‌కాశం లేనందున‌.. ట్రిఫుల్ త‌లాక్ ఇక శిక్షార్హ‌మైన నేరంగా మార‌నుంది.

తాజాగా కేంద్రం తీసుకొచ్చిన ట్రిఫుల్ త‌లాక్ ఆర్డినెన్స్ పై కేంద్ర న్యాయ‌శాఖామంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ స్పందించారు. బాధితురాలైన భార్య లేదంటే ఆమెకు సంబంధించిన వారు ఫిర్యాదు చేసి.. అది కాస్తా ఎఫ్ ఐఆర్ గా న‌మోదు చేసిన‌ప్ప్ఉడు మాత్ర‌మే నేరంగా ప‌రిగ‌ణిస్తార‌నిచెప్పారు.

మేజిస్ట్రేట్ నిర్దారించిన నిర్దిష్ట ష‌ర‌తుల‌కు.. నిబంధ‌న‌ల‌కు బాధితురాలు ఒప్పుకుంటేనే రాజీ అనేది ఉంటుంద‌ని చెప్పారు. బాధితురాలిని విచారించిన త‌ర్వాతే మెజిస్ట్రేట్ బెయిల్ ఇచ్చే అవ‌కాశం ఉంది. మైన‌ర్ పిల్ల‌లు బాధితురాలైన భార్య ద‌గ్గ‌రే ఉంటార‌ని.. న్యాయ‌మూర్తి తీసుకునే నిర్ణ‌యానికి త‌గ్గ‌ట్లు మొయింటెనెన్స్ మొత్తాన్ని భ‌ర్త ఇవ్వాల్సి ఉంటుంది.