Begin typing your search above and press return to search.

విద్యావ్యవస్థను అస్తవ్యస్తం చేయనున్న మోడీ!

By:  Tupaki Desk   |   12 Sep 2015 4:37 AM GMT
విద్యావ్యవస్థను అస్తవ్యస్తం చేయనున్న మోడీ!
X
మోడీ గద్దె ఎక్కుతున్నారంటేనే.. దేశంలో పలు కీలక రంగాల్లో.. సమూలమైన మార్పులు ఉంటాయని.. చాలా మంది అంచనా వేశారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాల మీద నిత్యం ఆధారపడి ఉండే దుస్థితితో కాకుండా.. భాజపాకు కూడా పూర్తిమెజారిటీ ఉన్న ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడినప్పుడు.. ఇక కొన్ని దశాబ్దాలుగా ఈ దేశంలో నిద్రాణ స్థితిలో ఉన్న కాషాయ ఎజెండా ఒళ్లు విరుచుకుంటుందని.. కేంద్రం ద్వారా అమల్లోకి వస్తుందని అంతా భయపడ్డారు. ఈ ఏడాది కాలం పాటూ మోడీ తన విశ్వరూపం చూపించలేదు గానీ.. ఇప్పుడిప్పుడే.. ఒక్కొక్కటిగా కాషాయ అమ్ములపొదిలోంచి అస్త్రాలను బయటకు తీస్తున్నారు. ప్రధానంగా విద్యారంగం మీద కేంద్రం కన్నేసినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే భాజపా పాలిత రాష్ట్రాలలో విద్యను భారతీయతకు అనువుగా తీర్చిదిద్దడం పేరిట కాషాయీకరించడానికి ప్రయత్నాలు జరిగిపోతున్నాయి. మోడీకి విధేయంగా ఉండే స్మృతి ఇరానీ సారథ్యంలోని శాఖ ద్వారా హిందూత్వ ఎజెండాలు చొరబడిపోతున్నాయి.

తాజాగా దేశవ్యాప్త విద్యారంగానికి మరో పెద్ద కుదుపు లాంటి ఆలోచనను కేంద్రం రాష్ట్రాల్తో పంచుకుంటున్నది. విద్యారంగంలో మళ్లీ డిటెన్షన్‌ విధానాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. డిటెన్షన్‌ విధానం అంటే.. ప్రతి తరగతిలోనూ పబ్లిక్‌ పరీక్షే ఉంటుందన్నమాట. ఎక్కడ తప్పినా విద్యార్థికి ఆ సంవత్సరం వృథా అయినట్లే. అది పాసయిన తర్వాతే నెక్స్ట్‌ తరగతికి వెళ్లాలి. గతంలో దేశంలో ఇలాంటి వ్యవస్థే ఉండేది. అసలే మారుమూల వెనుకబడిన ప్రాంతాలు అత్యధికంగా ఉండే మన దేశీయ వ్యవస్థలో.. ఉన్నతపాఠశాలకు కిద తరగతుల్లోనే.. విద్యార్థి ఒకసారి ఫెయిలయితే.. అక్కడితో వారిని బడి మాన్పించేయడం అనేది చాలా మామూలు సంగతి. బడిలో చేరుతున్న వారు వంద మంది ఉంటే.. పదో తరగతి పూర్తిచేసే వారు పది మంది కూడా ఉండని పరిస్థితులు ఉండేవి. ఎవ్వరూ చదువు కనీసం పూర్తి అయ్యేవరకు బడికే రాకపోవడానికి కారణం ఈ విధానమేనని.. దాన్ని ఎత్తివేసి.. పదో తరగతికి మాత్రమే పబ్లిక్‌ పరీక్ష ఉండే వ్యవస్థను ఏర్పాటుచేశారు. దీనివల్ల.. చిన్న పల్లెల్లో కూడా పాఠశాలలో చేరిన ప్రతి ఒక్కరూ.. పది వరకు ఎలాంటి బ్రేకులు, ఇంటర్వెల్‌ లు లేకుండా చదువుకుంటున్నారు. పది పూర్తయిందనిపిస్తే.. తర్వాత.. అబ్బిన చదువును బట్టి కొనసాగిస్తున్నారు.

అలాకాకుండా మళ్లీ డిటెన్షన్‌ విద్యావిధానం వచ్చిందంటే.. పల్లెలో డ్రాపవుట్స్‌, మధ్యలో బడిమానేసేవాళ్లు విపరీతంగా పెరుగుతారని పలువురు భయపడుతున్నారు. ఈ కొత్త విధానం అమల్లోకి తేవడానికి అన్ని రాష్ట్రాల విద్యామంత్రులతో కేంద్రం సమావేశం ఏర్పాటుచేసింది. మోడీ సర్కారు- విద్యారంగంలో మార్పులేమో గానీ.. పరిస్థితి కొండనాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లుగా తయారవుతున్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.