Begin typing your search above and press return to search.

గుజ‌రాత్ ఎన్నిక‌లు.. చెట్టు పేరు చెప్పి కాయ‌ల‌మ్ముతున్న మోడీ!

By:  Tupaki Desk   |   29 Nov 2022 12:30 AM GMT
గుజ‌రాత్ ఎన్నిక‌లు.. చెట్టు పేరు చెప్పి కాయ‌ల‌మ్ముతున్న మోడీ!
X
మ‌రో మూడు రోజుల్లో గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల తొలిద‌శ‌కు ముహూర్తం ఖ‌రారైంది. డిసెంబ‌రు 1న తొలి ద‌శ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో బీజేపీ త‌ర‌ఫున ప్రధాని న‌రేంద్ర మోడీ సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు. ``న‌న్ను చూసి ఓటేయండి`` అని పిలుపునిస్తున్నారు. ఎక్క‌డ‌కు వెళ్లినా.. ఏం మాట్లాడినా.. త‌న పేరునే చెబుతున్నారు. ``మోడీజీకో దేఖో.. ఆప్‌కో బ‌హుత్ షామిల్ క‌రేంగే మే.. యాద్ క‌రో.. ఓట్ దేదో మేరే భాయ్‌కో`` అనే మూస మాట‌నే ప‌దే ప‌దే వ‌ల్లెవేస్తున్నారు. ఇదే ఇప్పుడు ప్ర‌దాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్‌కు బ్ర‌హ్మాస్త్రంగా మారిపోయింది.

``27 ఏళ్ల బీజేపీపాల‌న త‌ర్వాత కూడా.. ఇంకా మోడీ త‌న ఫొటోనే చూపించి ఓట్లు వేయాలంటున్నారంటే.. బీజేపీ చేసింది ఏంటి? గోద్రా దుర్ఘ‌ట‌న‌లు.. మ‌ర‌ణాలు.. క‌రోనా మ‌ర‌ణాలు.. నిరుద్యోగం.. వివాదాలు.. ఇవేనా? వీటినేనా మీరు చేసింది. వీటికే మీరు చెట్టు పేరు చెప్పి కాయ‌లు అమ్ముకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు`` అని కాంగ్రెస్ చీఫ్ మ‌ల్లికార్జున ఖ‌ర్గే నిప్పులు చెరుగుతు న్నారు. వాస్త‌వానికి 27 ఏళ్ల పాల‌నలో బీజేపీ చేసిన ప‌నుల‌ను చెప్పుకోవాల‌ని.. పార్టీ అధిష్టాన‌మే తొలుత భావించింది. అయితే.. దీనిని మోడీతిప్పికొట్టారు. త‌న పేరుతోనే ఎన్నిక‌ల‌కు వెళ్తామ‌న్నారు.

ఇప్పుడు ఆయ‌న చేస్తున్న‌ది కూడా అదే. ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్‌పై ఆయ‌న ప‌దే ప‌దే విమ‌ర్శ‌లు చేస్తున్నారు. గుజరాత్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎప్పుడో తరిమికొట్టారని ప్రధాని నరేంద్ర మోడీ ఆ పార్టీపై విరుచుకుపడుతున్నారు. ఒక ప్రాంతం ప్రజలను మరో ప్రాంతానికి వ్యతిరేకంగా, ఒక మతానికి చెందిన వారిని మరో మతానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టి ప్రజలను నానా కష్టాలకు గురిచేసిన కాంగ్రెస్ ను ఎప్పుడో మరిచిపోయారని అన్నారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటున్న వారికి గుజరాతీలు మద్దతివ్వరని అన్నారు.

గుజరాత్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడానికి ముందు గురజాతీలు, మరాఠీలు పరస్పరం పర్షించుకునేలా కాంగ్రెస్ వ్యవహరించిందని దుయ్యబట్టారు. కులాలు, మఠాలు, ప్రాంతాల మధ్య కాంగ్రెస్ చిచ్చు పెట్టిందన్నారు. "మీరు(కాంగ్రెస్) చేసిన పాపాలతో గుజరాత్ ప్రజలు ఎంతో నష్టపోయారు" అని మోడీ దుయ్యబట్ట‌డం ద్వారా సెంటిమెంటును రాజేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

దీటుగా కాంగ్రెస్ వాద‌న‌..
తీవ్రవాద బాధిత పార్టీ ఏదైనా ఉంటే అది కాంగ్రెస్ మాత్రమేనని, తీవ్రవాదంపై పోరులో ఇద్దరు ప్రధానులను త్యాగం వేసిందని ఆ పార్టీ కీల‌క నేత‌లు ప్ర‌చారం చేస్తున్నారు. ముఖ్యంగా గుజ‌రాత్ మోడ‌ల్‌పై గురి పెడుతున్నారు. ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తామంటున్న బీజేపీదే విభజన రాజకీయమని, సమాజంలో చిచ్చుపెట్టే రాజకీయని నేత‌లు ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్తున్నారు. "మోడీ పేరు చెప్పి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారంటే బీజేపీ పాలన విఫలమైందనేగా?" అని ఎద్దేవా చేస్తున్నారు.

కాంగ్రెస్ అస్త్రాలు ఇవీ..

+ గుజరాత్లో ఐదు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

+ 28 వేల టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

+ రాష్ట్ర అప్పులు తారాజువ్వలా ఎగబాకుతున్నాయి.

+ ప్రస్తుతం రూ.3.4 లక్షల కోట్ల అప్పుంది.

+ కరోనా సమయంలో 4 లక్షల మంది చనిపోయారు.

+ ఆరేళ్లలో ముగ్గురు సీఎంలను మార్చారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.